2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా I.N.D.I.A పావులు కదుపుతోంది. I.N.D.I.Aలోని పార్టీలు ఇప్పటికే మూడు సార్లు సమావేశమయ్యాయి. ముంబై భేటీ తర్వాత సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు జరగలేదు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీలతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. భోపాల్‌లో జరగాల్సిన బహిరంగ సభ రద్దవడంతో అగ్రనేతల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఢీకొట్టేందుకు అవసరమైన వ్యూహాలపై చర్చించినట్టు సమాచారం. దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో ఇండియా కూటమి తదుపరి భేటీకి అవసరమైన ప్రణాళికను రూపొందించినట్టు తెలుస్తోంది.
మర్యాదపూర్వకంగానే కలిశా-శరద్ పవార్
పవార్‌తో భేటీకి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రజల గొంతుకను పెంచేందుకు రాహుల్ గాంధీతో కలిసి శరద్ పవార్‌తో సమావేశమైనట్టు ఖర్గే వెల్లడించారు. ఏ ఛాలెంజ్‌కైనా తాము సిద్ధమేనన్న ఆయన, జుడేగా భారత్- జీతేగా ఇండియా అంటూ ట్వీట్ చేశారు. శరద్ పవార్ సైతం ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసాన్ని మర్యాదపూర్వకంగా సందర్శించినట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్, కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సభ్యుడు గుర్‌దీప్ సపాల్ పాల్గొన్నారని తెలిపారు.
ఇప్పటికే మూడు సార్లు సమావేశం
ఇప్పటికే కూటమిలోని పార్టీలన్నీ మూడు సార్లు సమావేశమయ్యాయి. పట్నా, బెంగళూరులో జరిగిన భేటీకి 26 పార్టీల నేతలు హాజరు కాగా.. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబయి వేదికగా జరిగిన భేటీకి 28 పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరైన విషయం తెలిసిందే. అంతేకాకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంతవరకు కలిసికట్టుగా పోటీచేయాలని తీర్మానం చేశారు. ఈ నెలాఖరు నాటికి సీట్ల సర్దుబాటు అంశాన్ని కొలిక్కి తెచ్చేలా 14మందితో సమన్వయ కమిటీని సైతం ఏర్పాటు చేశారు.
కులగణన చేపట్టాల్సిందే-ఖర్గే
మరోవైపు వెనకబడిన తరగతుల గణన చేపట్టాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. తద్వారా ఆ వర్గాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడంతోపాటు వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకోవచ్చన్నారు. కులగణన పేరుతో దేశ విభజనకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ ప్రధాని మోడీ చేసిన ఆరోపణలను ఖర్గే ఖండించారు. దేశ ప్రజలకు అన్ని విషయాలపై అవగాహన ఉందని, 2024 ఎన్నికల్లో ఇటువంటి ఆటలు సాగవని ఖర్గే హెచ్చరించారు. ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఖర్గే మరోసారి ఆరోపించారు. ప్రజలను హింసించడమే బీజేపీ గ్యారంటీ అన్న ఆయన, కాంగ్రెస్ మాత్రం ఉద్యోగాలను సృష్టించే హామీలు ఇస్తుందన్నారు. ప్రధాని మోడీ వివిధ రాష్ట్రాల పర్యటనలను ఆపేసి మణిపుర్ పర్యటన చేయాలంటూ చురకలంటించారు. ఆరు నెలలుగా ఆ రాష్ట్రం అట్టుడుకిపోతున్నా మోడీ మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. అక్కడకు వెళ్లే ధైర్యం మోదీ ఎందుకు చేయడం లేదన్నారు.