Petition on Freebies: 


ఉచిత హామీలపై పిటిషన్..


మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రాజకీయ పార్టీలు ఉచిత హామీలివ్వడం సహా డబ్బులు పంచడాన్ని నియంత్రించాలని కోరుతూ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం..ఈ మేరకు రెండు ప్రభుత్వాలనూ మందలించింది. నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది. చీఫ్‌ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం..కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, RBIకి ఒకేసారి నోటీసులు పంపింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న ట్యాక్స్‌ని దుర్వినియోగం చేస్తున్నారనీ ఆ పిటిషన్‌లో ఆరోపించారు. కేవలం ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బులు పంచి పెడుతున్నారని మండి పడ్డారు పిటిషనర్. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉచిత హామీలపై కొన్ని కేసుల విచారణ పెండింగ్‌లో ఉంది. ఆ లిస్ట్‌లోనే ఈ పిటిషన్‌నీ చేర్చింది ధర్మాసనం. 


ఉచిత హామీల్ని నియంత్రించలేం..


సోషల్ వర్కర్ భట్టులాల్‌ జెయిన్‌ ఈ పిటిషన్ వేశారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుని ఇలా దుర్వినియోగం చేయకుండా కట్టడి చేయాలని పిటిషన్‌లో కోరారు భట్టులాల్. లంచం ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారని మండి పడ్డారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నుంచే డబ్బులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు పంచుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రాలు అప్పులపాలయ్యాయని, వాటిని తీర్చడం పక్కన పెట్టి డబ్బులు పంచి పెట్టడమేంటని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఎన్నికల ముందు ఇలా డబ్బులు పంచి పెట్టడం కన్నా దారుణమైన విషయం ఇంకేదీ ఉండదని అన్నారు. ప్రతిసారీ ఇదే జరుగుతోందని, చివరకు ఆ భారం అంతా పన్నులు చెల్లించే వాళ్లపైనే పడుతోందని అన్నారు. అయితే..దీనిపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలను ఏ మాత్రం నియంత్రించలేమని తేల్చి చెప్పారు. 


గతంలోనూ వ్యాఖ్యలు..


ఈ ఏడాది ఆగస్టులోనూ ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉచిత హామీలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ ఉచిత హామీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలనుఅడ్డుకోలేం"అని తేల్చి చెప్పింది. డీఎంకే పార్టీ వేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రజాసంక్షేమమే ప్రభుత్వాల విధి అని వెల్లడించింది. "ప్రజా ధనాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారన్నదే ముఖ్యమైన విషయం. కానీ ఈ విషయంలో ఓ నిర్ణయానికి రావటం చాలా కష్టం. ఇలాంటి అంశాలను సుప్రీం కోర్టు పరిశీలిస్తుందా అన్న ప్రశ్నించుకోవాల్సి వస్తుంది" అని అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. ఈ మధ్యే డీఎమ్‌కే పార్టీ ఉచిత హామీలపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను, ఉచిత హామీలుగా పరిగణించటం సరికాదని వాదించింది డీఎమ్‌కే. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం..అలా వ్యాఖ్యానించింది. 


Also Read: 5 రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఖరారు చేసిన ఈసీ! తెలంగాణలో ఒకే విడతలో!