Netflix Subscription Plan Prices: 


ప్లాన్ ప్రైస్‌ పెంచేస్తారట..


యూజర్స్‌కి నెట్‌ఫ్లిక్స్ (Netflix Subscription Plan) త్వరలోనే షాక్ ఇవ్వనుంది. సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ప్రైస్‌ని పెంచనుంది. వాల్‌ స్ట్రీట్ జనరల్ ఈ విషయం వెల్లడించింది. కొద్ది నెలల తరవాత ఈ ప్రైస్‌ని పెంచే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ ఏడాదిలోనే లేదంటే..వచ్చే ఏడాది మొదట్లో ఈ కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి. మార్కెట్‌ అడ్జెస్ట్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనుంది నెట్‌ఫ్లిక్స్. ముఖ్యంగా అమెరికా, కెనడా మార్కెట్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఈ రెండు దేశాల్లోనే ముందుగా ప్రైస్ పెంచాలని భావిస్తోంది. ఇండియా గురించి ఎక్కడా ప్రస్తావన లేకపోయినప్పటికీ...అంతర్జాతీయంగా నెట్‌ఫ్లిక్స్ ఈ మార్పులు తీసుకొచ్చే యోచనలో ఉంది. అలాంటప్పుడు భారత్‌లోనూ ప్లాన్స్‌ మారిపోవడం ఖాయం. గతేడాదే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ప్రైస్‌ని పెంచింది నెట్‌ఫ్లిక్స్. ఇప్పుడు మరోసారి అదే నిర్ణయం తీసుకోనుంది. అయితే...గతేడాది ప్రైస్‌ని పెంచినప్పుడు ఆ ఎఫెక్ట్‌ని భారత్‌పై పడకుండా చూసుకుంది. కానీ...ఇక్కడ వేరే విధంగా షాక్ ఇచ్చింది. పాస్‌వర్డ్ షేరింగ్‌పై (Netflix Password Sharing) ఆంక్షలు విధించింది. అకౌంట్స్‌ షేర్ చేయకుండా కట్టడి చేస్తోంది. ఇలా షేర్ చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చింది. 


కొత్త సబ్‌స్క్రైబర్‌లు..


నిజానికి ఈ పాస్‌వర్డ్ షేరింగ్‌పై ఆంక్షలు విధిస్తామన్న వార్తలు వచ్చిన మొదట్లో ఇండియా ప్రస్తావనా ఎక్కడా రాలేదు. కానీ...ఉన్నట్టుండి భారత్‌లోనూ ఇది అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ప్లాన్ ప్రైస్‌ల విషయంలోనూ అదే జరిగే అవకాశాలు లేకపోలేదు. నిజానికి చాలా రోజులుగా ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు ఆ సంస్థ. అందుకే ఈ సారి ఆ ఎఫెక్ట్‌ ఉంటుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎంత వరకూ పెంచుతారన్న విషయంలోనూ ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై సంస్థ ప్రతినిధులెవరా అధికారికంగా స్పందించలేదు. నెట్‌ఫ్లిక్స్ ఎప్పుడైతే పాస్‌వర్డ్ షేరింగ్‌ని ఆపేసిందో అప్పటి నుంచి కొత్త సబ్‌స్క్రైబర్స్‌ (Netflix Subscribers) సంఖ్య పెరిగింది. ఈ ఏడాది సెకండ్ క్వార్టర్‌లో దాదాపు 60 లక్షల మంది కొత్తగా సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. అంటే దాదాపు 8% మేర పెరిగినట్టు లెక్క. పాస్‌వర్డ్ షేరింగ్‌ని ఆపేస్తే యూజర్లు తగ్గిపోతారని భావించినా..అనూహ్యంగా కొత్త యూజర్లు  వచ్చి చేరారు. ఇలాంటి సమయంలో ప్లాన్ ప్రైస్‌ని పెంచడం వల్ల కొంత మంది వెనక్కి తగ్గుతారేమో అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. 


నెట్‌ఫ్లిక్స్ బాటలోనే డిస్నీ..


డిస్నీ కూడా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ మార్గాన్ని ఫాలో అవుతోంది. ఇప్పటి వరకు మీరు డిస్నీ పాస్‌వర్డ్‌ను ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అలా జరగదు. నెట్‌ఫ్లిక్స్ మాదిరిగానే డిస్నీ కూడా తన విధానాన్ని మార్చుకుంది. ఈ ఏడాది జూలైలో నెట్‌ఫ్లిక్స్ భారతీయ వినియోగదారులు తమ ఇంటి వెలుపల వ్యక్తులతో పాస్‌వర్డ్‌లను షేర్ చేయకుండా నిషేధించింది. ఇప్పుడు డిస్నీ కూడా నెట్‌ఫ్లిక్స్ బాటలో పయనిస్తోంది. డిస్నీ+ కెనడాలోని వినియోగదారులను వారి ఇంటి వెలుపల వారితో తమ పాస్‌వర్డ్‌లను షేర్ చేయవద్దని కోరింది. డిస్నీప్లస్ వినియోగదారుల కోసం పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేసింది. నవంబర్ 1వ తేదీ నుంచి కెనడాలోని వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లను వారి ఇంటి వెలుపలి వ్యక్తులతో షేర్ చేయలేరు. డిస్నీప్లస్ ఈ సమాచారాన్ని తన కస్టమర్‌లకు ఈమెయిల్ ద్వారా అందించింది. 


Also Read: 5 రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఖరారు చేసిన ఈసీ! తెలంగాణలో ఒకే విడతలో!