5 States Elections:
5 రాష్ట్రాల్లో ఎన్నికలు
త్వరలోనే జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఖరారు చేయనుంది. అక్టోబర్ 8, అక్టోబర్ 10వ తేదీల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరంలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకూ ఆయా రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 2018లో కూడా ఇలాగే నిర్వహించింది ఈసీ. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం 2018లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. ఈ సారి కూడా ఇదే విధంగా నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఒకదానితో ఒకటి క్లాష్ అవ్వకుండా చూసుకుంటోంది ఈసీ. ఈ ఏడాది డిసెంబర్ 17తో మిజోరం అసెంబ్లీ గడువు ముగిసిపోనుంది. బీజేపీ మిత్రపక్షమైన మిజోరం నేషనల్ ఫ్రంట్ (MNF) ప్రస్తుతం అధికారంలో ఉంది.
ఇక మిగతా నాలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీల గడువు వచ్చే ఏడాది జనవరిలో ముగియనుంది. ప్రస్తుతం తెలంగాణలో BRS అధికారంలో ఉండగా..మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికల కసరత్తుని ఇప్పటికే మొదలు పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇటీవలే తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించింది. ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తున్నారు ఈసీ అధికారులు. ఈ మేరకు ప్రత్యేకంగా భేటీ కూడా అవుతున్నారు. డిసెంబర్ 10-15 తేదీల్లో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే...ఈ తేదీలకు సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ ఇంకా అప్రూవల్ చేయాల్సి ఉంది. ఆ తరవాతే అధికారికంగా ప్రకటిస్తారు.