Sikkim Floods: సిక్కింను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరద ధాటికి ఇప్పటి వరకు 14 మంది మృతి చెందగా, 102 మంది గల్లంతయ్యారు. ఇందులో 22 మంది ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. మంగళవారం రాత్రి సంభవించిన కుంభవృష్టి వర్షంతో ఆకస్మిక వరదల పోటెత్తాయి. దీంతో సిక్కింలోని నదులు, కాల్వలు, సరస్సులు ఉప్పొంగుతున్నాయి. దీంతో చుంగు థాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాల్సి రావడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పెరిగింది. సిక్కిం మంగల్ జిల్లాలోని లాచెన్ సమీపంలో ఉన్న షాకో చో సరస్సు కూడా పొంగిపొర్లుతోంది. దీంతో పరిసర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ షాకో చో హిమనీనదం థాంగు గ్రామం పైనే ఉంటుంది. ఈ సరస్సు 1.3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ సరస్సుకు థాంగు గ్రామానికి మధ్య దూరం కేవలం 12 కిలీమీటర్లు.


గ్యాంగ్‌టక్‌ జిల్లాలోని సింగ్‌టామ్‌లోని గోలిటార్ ప్రాంతం, మంగన్ జిల్లాలోని డిక్చు, పాక్యోంగ్ జిల్లాలోని రంగ్‌పో ఐబీఎం ప్రాంతాన్ని అధికారులు ఖాళీ చేయించారు. షాకో చో హిమనీనదం ఉష్ణోగ్రత అసాధారణంగా పెరిగిందని శాటిలైట్ డేటా చూపిస్తున్నట్లు  గ్యాంగ్‌టక్ జిల్లా మేజిస్ట్రేట్ తుషారే నిఖారే తెలిపారు. అయితే ఉష్ణోగ్రత స్థిరంగా ఉండటం సమస్య కాదని చెప్పారు. ముందుజాగ్రత్తగా పరిసర ప్రాంత వాసులను ఖాళీ చేయించినట్లు ఆయన వెల్లడించారు. ఆకస్మిక వరదలు సంభవిస్తే ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 


వరద నీరు తగ్గిన తర్వాత సిక్కింలోని జలవిద్యుత్ ప్రాజెక్టులకు జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ యాజమాన్యంలోని NHPC జలవిద్యుత్ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం NHPC తో పవర్ సెక్రటరీ పంకజ్ అగర్వాల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.


లోనాక్‌ సరస్సు ప్రాంతంలో భారీ వర్షాలు కరువడంతో తీస్తా నదిలో వరద పోటెత్తింది. దీనితో పాటు చుంగ్ థాంగ్‌ ‌ డ్యామ్‌ నుంచి కూడా నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పెరిగింది. సింగ్టామ్‌ సమీపంలోని బర్దంగ్‌ వద్ద పార్క్‌ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. తప్పిపోయిన 23 మంది సైనికులలో ఒకరిని రక్షించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. సైనికుల జాడ కోసం భారత ఆర్మీకి చెందిన త్రిశక్తి కార్ప్స్‌ దళాలు రెస్యూ ఆపరేషన్‌ చేపట్టాయి.


వరదల కారణంగా దాదాపు 14 వంతెనలు కూలిపోయాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 3000 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని అక్కడి ప్రభుత్వ అధికారి వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున సంభవించిన కుంభవృష్టి వర్షం కారణంగా అయిన చుంగ్‌థాంగ్‌ వద్ద ఉన్న ఆనకట్ట కొన్ని ప్రాంతాల్లో కొట్టుకుపోయింది. ఇక్కడే రాష్ట్రంలోని అతి పెద్ద జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ఉంది. ఈ డ్యామ్‌ నుంచి నీరు కిందకు ప్రవహించడంతో నీటిమట్టం పెరిగి అర్ధరాత్రి మెరుపు వరదలు వచ్చాయి. దీంతో ప్రజలు అతలాకుతలమయ్యారు. సింగ్తమ్‌ ప్రాంతంలో అయిదు మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. చుంగ్‌థాంగ్‌ వద్ద తీస్తా స్టేజ్‌ 3 డ్యామ్‌లో పనిచేస్తున్న దాదాపు 14 మంది కార్మికులు అక్కడి సొరంగాల్లో చిక్కుకుపోయారు.