ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కలిశారు. తొలుత నార్త్ బ్లాక్‌కు చేరుకున్న జగన్మోహన్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌ బకాయిల గురించి కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించడంతో పాటుగా పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని విన్నవించినట్లుగా సమాచారం. సీఎం జగన్ వెంట ఆ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి కూడా ఉన్నారు.


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తో భేటీ తర్వాత కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను సీఎం జగన్‌ కలిశారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఇతర అంశాలపై చర్చించారు. శుక్రవారం (అక్టోబరు 6) ఉదయం విజ్ఞాన్‌ భవన్‌లో వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరిగే సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. రేపు రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్‌ సమావేశం కానున్నట్లు సమాచారం.


పోలవరంపై వినతులు
* పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై చర్చించిన సీఎం వైఎస్‌ జగన్‌
* సత్వరం ప్రాజెక్టును పూర్తిచేయాల్సి అవసరం ఉందని, వీలైనంత త్వరగా ప్రాజెక్టు ఫలితాలను అందించేందుకు సహకరించాలన్న సీఎం.
* ప్రాజెక్టు పూర్తి నిర్మాణం వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాల్సి ఉందని తెలిపిన సీఎం.
* 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం 55,548.87 కోట్లుగా ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తుచేసిన సీఎం. దీనికి ఆమోదం తెలపాల్సిందిగా గట్టిగా విజ్ఞప్తిచేసిన సీఎం. 


* పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అడహాక్‌గా డబ్బు విడుదలచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన గతంలో పలుమార్లుచేసిన విజ్క్షప్తి మేరకు రూ.12,911.15 కోట్ల విడుదలకు  ఆమోదం లభించడం సంతోషకరమని పేర్కొన్న సీఎం. అయితే దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామన్న సీఎం. 
* లైడార్‌ సర్వేప్రకారం అదనంగా 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, 2022 జులైలో వచ్చిన భారీ వరదలు వల్ల తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తొలిదశ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేయాల్సిన పనులపై ఈ అంచాలను రూపొందించామని వెల్లడించిన సీఎం.


* పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయని ఆమేరకు నిధులు విడుదలచేయాలని అభ్యర్థించిన సీఎం. 


* తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలు సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న విషయాన్ని గుర్తుచేసిన ముఖ్యమంత్రి. 
* రూ.7,359 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ బకాయిల రూపంలో  చెల్లించాల్సి ఉందన్న సీఎం.
* 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌వరకూ సరఫరా చేసిన విద్యుత్‌ ఛార్జీలను ఇప్పటికీ చెల్లించలేదు. 9 ఏళ్లుగా ఈ సమస్య పెండింగులో ఉందని, * * ఏపీ జెన్‌కోకు, డిస్కంలకు ఇది తీవ్ర గుదిబండగా మారిందన్న విషయాన్ని ప్రస్తావించిన సీఎం. 
* దీంతో వివిధ సంస్థలకు చెల్లింపులు చేయలేని పరిస్థితి ఏపీ విద్యుత్‌ సంస్థలకు ఏర్పడిందన్న సీఎం. 
* వెంటనే ఈ డబ్బు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేసిన సీఎం. 
* ఈ డబ్బు ఇప్పించాలంటూ ఏపీ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు చేసినమీదన, 30 రోజుల్లోగా ఏపీకి బకాయిలు చెల్లించాలంటూ ఆగస్టు 29, 2022న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం హైకోర్టును ఆశ్రయించిందని, దీంతో ఈ అంశంలో కోర్టు వ్యవహారంలో పడిపోయిందన్న సీఎం.
* ఏపీ విద్యుత్‌ సంస్థలకు ఆడబ్బు వచ్చేలా తగిన చర్యలు తీసుకోగలరని విజ్ఞప్తిచేసిన సీఎం.