HCA Elections : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను అజారుద్దీన్ కోల్పోయారు. ఆయన పేరును ఓటర్ జాబితా నుంచి తొలగించారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కర్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా అజారుద్దన్ కొనసాగారు. అందుకే కమిటీ చర్య తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 20 2023న HCA ఎన్నికలు జరగనున్నాయి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్స్ కు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో 173 మందితో కూడిన ఓటర్ల జాబితాను ఇప్పటికే విడుదల చేశారు. ఈ జాబితా నుంచి ఆజారుద్దీన్ పేరును తొలగించారు. అక్టోబర్ 4 నుంచి 7 వరకు ఎన్నికల అధికారి వి.సంపత్ కుమార్ నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబరు 14న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. అక్టోబర్ 16 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అక్టోబరు 20న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.
HCA ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ పదవీకాలం పూర్తి అయిన తరువాత సుప్రీం కోర్టు HCA కార్యక్రమాల నిర్వహణకు మాజీ జస్టిస్ లావు నాగేశ్వర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ఇప్పటి వరకు HCA బాధ్యతలు చూశారు. అయితే HCAలో 57 క్లబ్‌లపై మూడేళ్ల పాటు జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్, జాన్‌మనోజ్, చార్మినార్ క్రికెట్ అసోసియేషన్, బడ్డింగ్ స్టార్ క్రికెట్ అసోసియేషన్‌లు కోర్టును ఆశ్రయించారు. దీంతో హెచ్‌సీఏ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
అయితే ఈ విషయంలో ఆయా కోర్టులు ఇచ్చే ఆదేశాలు చెల్లవని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోవద్దని తెలంగాణ హైకోర్టు, జిల్లా కోర్టులను సుప్రీం కోర్టు ఆదేశించింది.HCA ఎన్నికల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే HCA ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్. అధ్యక్ష పదవీ కాలం ముగిసినప్పటికీ హెచ్‌సీఏను మాత్రం అజారుద్దీన్ వదల్లేదు. దీంతో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గతంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీని నేతృత్వంలో హెచ్‌సీఏ కార్యక్రమాలు, ఇతర అంశాలు పర్యవేక్షిస్తూ వచ్చారు. అయినా వివాదాలు ఏమాత్రం సద్దుమణగలేదు. గతంలో జస్టిస్ దీపక్‌వర్మను అంబుడ్స్‌మన్‌గా నియమించడంపై హెస్‌సీఏ పరిధిలోని కొన్ని క్రికెట్ క్లబ్‌లు హైకోర్టును ఆశ్రయించాయి. దాన్ని హైకోర్టు కొట్టివేయడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో మరికొంతమంది ఈ కేసుల్లో ఇంప్లీడ్ అయ్యారు. వాటన్నింటిని సుప్రీంకోర్టు విచారించింది.