Delhi Liquor Policy Case: 


సుప్రీంకోర్టులో విచారణ..


ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సీబీఐ సహా ఈడీపై ప్రశ్నల వర్షం కురిపించింది ధర్మాసనం. ఈ కేసులో ఆప్‌ని నిందితుల జాబితాలో చేర్చకపోవడంపై ఆరా తీసింది. ఈ విషయంలో ఈడీని వివరణ అడిగింది. ఓ రాజకీయ పార్టీని టార్గెట్ చేయాలన్న ఉద్దేశం తమకు లేదని, కానీ లీగల్‌గా చూసినప్పుడు ఆప్‌ని కూడా ఈ లిస్ట్‌లో చేర్చాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. Prevention of Money Laundering Act పరంగా చూస్తే ఇది కీలకమే అని తేల్చి చెప్పింది. మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ జరిగిన తీరుపైనా ప్రశ్నలు కురిపించింది. అసలు ఈ పాలసీని లీగల్‌గా సవాలు చేసే అవకాశముందా అని సీబీఐని ప్రశ్నించింది.





అందుకు సీబీఐ వివరణ కూడా ఇచ్చింది. కొంత మందికి లాభం చేకూర్చేందుకే ఈ పాలసీని తీసుకొచ్చారని స్పష్టం చేసింది. వాట్సాప్‌ ఛాట్‌లతో పాటు మిగతా ఆధారాలు చూసిన తరవాతే...ఈ నిర్ధరణకు వచ్చినట్టు వెల్లడించింది. అయితే...ఈ మెసేజ్‌లపైనా అనుమానం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. వీటిని ఆధారంగా తీసుకోవచ్చా అని ప్రశ్నించింది. ఈడీ కూడా తన వివరణ ఇచ్చింది. Signal అనే మెసెంజర్ ద్వారా నిందితులు ఛాట్ చేసుకున్నారని చెప్పింది. ఈ యాప్‌ని ఛాట్‌ని ట్రేస్ చేయడం కాస్త కష్టం అని అందుకే...కేసు ఇంత సంక్లిష్టంగా మారిందని వివరించింది. దీంతో పాటు మరి కొన్ని ప్రశ్నలూ సంధించింది సర్వోన్నత న్యాయస్థానం. 


"విజయ్ నాయర్, మనీశ్ సిసోడియా ఈ లంచాల గురించి మాట్లాడుకుంటుండగా మీరు విన్నారా..? పోనీ ఎప్పుడైనా చూశారా..? ఈ వాట్సాప్‌ ఛాట్‌ని ఎలా పరిగణనలోకి తీసుకోమంటారు..? పోనీ అప్రూవర్ చెప్పిందైనా నిజమే అని ఎలా నమ్మమంటారు..? దీనికి సాక్ష్యాధారాలుండాలిగా. క్రాస్‌ ఎగ్జామిన్ చేస్తే రెండు నిముషాలు కూడా ఈ కేసు నిలబడదు"


- సుప్రీంకోర్టు