కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే విధారపరమైన నిర్ణయాలను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. బిహార్‌ ప్రభుత్వం చేపట్టిన కుల గణనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కులగణనకు సంబంధించి తదుపరి సమాచారాన్ని వెల్లడించకుండా, నిరోధించాలని పిటీషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బిహార్ ప్రభుత్వం తీసుకున్న కులగణన సమాచారం బయటకు రాకుండా చేయడానికి నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనే విధానపరమైన నిర్ణయాన్ని అడ్డుకోలేమని స్పష్టం చేసింది. ఒకవేళ డేటాకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే.. దాన్ని పరిశీలనలోకి తీసుకుంటామని తెలిపింది. బిహార్‌ ప్రభుత్వం చేపట్టిన కుల ఆధారిత సర్వే రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. 


బిహార్ ప్రభుత్వానికి నోటీసులు
నితీష్ కుమార్ సర్కార్ చేపట్టిన కుల ఆధారిత సర్వేను ఆగస్టు 2న పట్నా హైకోర్టు సమర్థించింది. ఈ సర్వే రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ, యూత్‌ ఫర్‌ ఈక్వాలిటీ, ఏక్‌ సోచ్‌ ఏక్‌ ప్రయాస్‌ అనే స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వీటిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీ ధర్మాసనం విచారణ జరిపింది. కులగణన అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పటికీ, నితీష్ కుమార్ ప్రభుత్వం  సర్వే వివరాలను వెల్లడించిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని, దీనిపై స్టే ఇవ్వాలని వాదించారు. పిటిషనర్ల సవాలుపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.


బిహార్‌లో 63 శాతం బీసీలే.. కులగణన వెల్లడి
దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న బిహార్‌ కుల గణన సర్వే వివరాలను నితీష్ కుమార్ సర్కార్ వెల్లడించింది. 13.07 కోట్లున్న రాష్ట్ర జనాభాలో 63.13శాతం బీసీలే ఉన్నారని నివేదికలో తేలింది. ఇందులో అత్యంత వెనుకబడిన వర్గాలు 36శాతం, ఇతర వెనుకబడిన వారి జనాభా  27.13శాతంగా ఉన్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో తమ రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపడతామని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ గత ఏడాది జూన్‌లో ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. మరోవైపు కులగణనను వ్యతిరేకిస్తూ పట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయస్థానం వాటిని కొట్టివేస్తూ సర్వేకు అనుమతించింది. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్లింది. కుల ఆధారిత సర్వేపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను 2024 జనవరికి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. 


యాదవుల జనాభా 14.27శాతం
ఓబీసీల్లో యాదవులు అత్యధికంగా 14.27శాతం ఉన్నారు. దళితులు 19.65శాతం ఉంటే, గిరిజనులు కేవలం  1.68 శాతమే ఉన్నారు. అంటే గిరిజనుల జనాభా రాష్ట్రంలో ఉన్నది 22 లక్షలు మాత్రమే. మొత్తం జనాభాలో హిందువులు 81.99 శాతంగా ఉంటే, ముస్లింల జనాభా 17.7శాతంగా ఉంది. క్రైస్తవులు, సిక్కులు, జైన్లు వేళ్లమీద లెక్కబెట్టేంత స్థాయిలోనే ఉన్నారు.