Nikhat Zareen: 


రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ (Nikhat Zareen secures 2024 Paris Olympics quota) అద్భుతం చేసింది. ఆసియా క్రీడల్లో పతకం ఖాయం చేసింది. మహిళల 50 కిలోల బాక్సింగ్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్లో జోర్డాన్‌ అమ్మాయి హనన్‌ నాసర్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఆమె ధాటికి తట్టుకోలేక ప్రత్యర్థి విలవిల్లాడింది. దాంతో రిఫరీ మ్యాచును ఆపేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. ఈ గెలుపుతో ఆమె ప్యారిస్‌ ఒలింపిక్స్‌కూ అర్హత సాధించడం విశేషం. అంతకు ముందు ప్రిక్వార్టర్స్‌లో ఐబీఏ విమెన్స్‌ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ రన్నరప్‌ ఎన్‌గ్యూయెన్‌ తి తామ్‌ను 5-0తో చిత్తు చేసిన సంగతి తెలిసిందే.


బ్యాడ్మింటన్‌లో పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల్లో 37 ఏళ్ల తర్వాత పతకం ఖాయం చేసింది. క్వార్టర్‌ ఫైనల్లో నేపాల్‌పై 3-0తో విజయం సాధించింది. ఇండోనేసియా, కొరియా మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్‌ విజేతతో టీమ్‌ఇండియా సెమీస్‌లో తలపడనుంది. లక్ష్యసేన్‌, కిదాంబి శ్రీకాంత్‌, మిథున్‌ మంజునాథ్‌ ఈ జట్టులో సభ్యులు. 


టేబుల్‌ టెన్నిస్‌లో సీనియర్‌ ఆటగాడు ఆచంట శరత్‌ కమల్‌ ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్‌ ప్రి క్వార్టర్స్‌లో చైనీస్‌ తైపీ ఆటగాడు చి యువాన్‌ చౌంగ్‌ చేతిలో పరాజయం చవిచూశాడు. కాగా మహిళల 400 మీటర్ల హీట్స్‌లో ఐశ్వర్య మిశ్రా ఈ సీజన్‌ బెస్ట్‌ 52.73 సెకన్ల టైమింగ్‌ నమోదు చేసింది. ఫైనల్‌కు చేరుకుంది. పురుషుల 400 మీటర్ల హీట్స్‌లో మహ్మద్‌ అజ్మల్‌ ఫైనల్‌కు ఎంపికయ్యాడు. 45.76 సెకన్లలో హీట్‌ను పూర్తి చేశాడు. మహ్మద్‌ అనాస్‌ 46.29 సెకన్లతో వెనకబడ్డాడు. మిగతా హీట్స్‌లో ఫలితాలపై అతడి ఫైనల్‌ ఎంపిక ఆధారపడింది.


భారత మహిళల హాకీ జట్టు ప్రిలిమినరీ రౌండ్‌ పోటీల్లో మలేసియాను చిత్తు చేసింది. 6-0తో విజయం సాధించింది. మౌనిక (7ని), దీప్‌ గ్రేస్‌ ఎక్కా (8 ని), నిశా (11), వైష్ణవి విఠల్‌ ఫాల్కే (15), సంగీతా కుమారి (24), లాల్‌ రెమ్‌సియామి (50) గోల్స్‌ కొట్టారు.


షూటింగ్‌లో భారత్‌ పెట్టింది పేరు! ప్రతిసారీ ఈ విభాగంలో తన సత్తాను చాటుతూనే ఉంటుంది. అథ్లెట్లు పతకాలు సాధిస్తూనే ఉంటారు. శుక్రవారం ఉదయం మహిళల పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత జట్టుకు రజత పతకం వచ్చింది. ఈషా సింగ్‌, దివ్యా తడిగోల్‌, పాలక్‌తో కూడిన జట్టు వెండి పతకాన్ని ముద్దాడింది. ఇక పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ పోటీల్లో 17 ఏళ్ల అమ్మాయి పాలక్‌ స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించింది.


పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3PS టీమ్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. స్వప్నిల్‌ కుశాలె, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌, అఖిల్‌ షెరాన్‌తో కూడిన జట్టు బంగారు పతకాన్ని ముద్దాడింది. అంతేకాదు ఈ త్రయం ప్రపంచ రికార్డు సృష్టించింది. అర్హత పోటీల్లో ప్రతాప్‌ సింగ్‌ (591), స్వప్నిల్‌ కుశాల్‌ (591), అఖిల్‌ షెరాన్‌ (587) వరుసగా ఒకటి, రెండు, ఐదు స్థానాల్లో నిలిచారు.


ప్రస్తుతం పతకాల పట్టికలో 32 పతకాలతో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది స్వర్ణాలు, 12 రజతకాలు, 12 కాంస్యాలు దక్కాయి.