కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ముంబై సెన్సార్ బోర్టు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు లంచం అడిగారంటూ ఆధారాలతో సహా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ముంబై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(CBFC) ఆఫీస్ లో తనకు స్వయంగా ఈ అనుభవం ఎదురయిందన్నారు. సినిమా సర్టిఫికేషన్ కు లంచం తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఈ లంచం వ్యవహారాన్ని మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండేతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.


స్పందించిన కేంద్ర సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ


విశాల్ ఆరోపణలపై కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించింది. “CBFCలో సినిమా సర్టిఫికేషన్ కోసం లంచం అడగడం అత్యంత దారుణం. విశాల్ కు ఎదురైన ఘటన నిజంగా  అత్యంత దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం సహించదు.  ఈ లంచం వ్యవహారం వెనుక ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కేంద్ర సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఒక సీనియర్ అధికారి ఈరోజే విచారణ కోసం ముంబైకి పంపించాం. త్వరలోనే బాధ్యులపై చర్యలుంటాయి. CBFC ద్వారా వేధింపులు ఎదరైతే jsfilms.inb@nic.in ద్వారాసమాచారం ఇవ్వండి. తగిన చర్యలు తీసుకుంటాం” అని వెల్లడించింది.   






 వీడియోలో విశాల్ ఏం చెప్పారంటే?


"వెండితెరపై  అవినీతి చూపించడం కామన్. నిజ జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. కానీ, నేను తొలిసారి లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సి వచ్చింది.  ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, ముంబైలోని CBFC(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) ఆఫీస్ లో ఇంకా దారుణం అవినీతి జరుగుతోంది. నా సినిమా ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్ రిలీజ్ కోసం రూ.6.5 లక్షలు లంచలం చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి నేనే స్వయంగా రెండుసార్లు లంచం ఇచ్చాను.  నా సినీ కెరీర్లో ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే,  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను ఇలా చేస్తుంది నా కోసం కాదు. భవిష్యత్తులో రాబోయే నిర్మాతల కోసం. సత్యం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నాను" అంటూ వీడియోలో వెల్లడించారు.   


ఇక అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన   'మార్క్ అంటోనీ' చిత్రం టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో రూపొందింది. విశాల్, రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15 విడుదలై తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. మినీ స్టూడియోస్ బ్యానర్ పై వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీత అందించారు.  


Read Also: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial