టీవీ షో లైవ్‌ నడుస్తోందని కూడా పట్టించుకోకుండా పాకిస్థాన్‌లో ఇద్దరు నేతలు బహిరంగంగా  కొట్టుకున్నారు.  పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) పార్టీకి చెందిన అఫ్నాన్‌ ఉల్లాహ్, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీకి చెందిన ఇమ్రాన్‌ ఖాన్‌ లాయర్‌ షేర్ అఫ్జల్‌ ఖాన్‌ మార్వాట్‌ల మధ్య వాగ్వాదం తీవ్రమై కొట్టుకునే స్థాయికి వెళ్లింది. అక్కడి ఎక్స్‌ప్రెస్‌ టీవీలో ప్రముఖ హోస్ట్‌ జావేద్‌ చౌదరి షో 'కల్‌ తక్‌' లో రాజకీయ అంశంపై మాట్లాడుతూ నానా రభసా చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


పీటీఐ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ మిలటరీ అధికారులతో బ్యాక్‌ డోర్‌ చర్చలు జరిపారని, అనేక తప్పులు చేశారని పీఎంఎల్‌-నేత అఫ్నాన్‌ ఆరోపించారు. ఇలా ఇరువురు రెండు పార్టీల నేతలపై ఆరోపణలు చేశారు. తర్వాత ఇద్దరు నాయకులు ఒకరి కుటుంబ సభ్యులపై మరొకరు విమర్శలు చేయడం ప్రారంభించడంతో వ్యక్తిగత దూషణలతో గొడవ తీవ్ర రూపం దాల్చింది. పీటీఐ నేత అఫ్జల్‌ ఖాన్‌ మార్వాట్‌ సడెన్‌గా లేచి అఫ్నాన్‌ తలపై కొడుతూ దాడికి దిగారు. వెంటనే అఫ్నాన్‌ కూడా లేచి మార్వాట్‌పై దాడి చేశారు. ఇద్దరూ తన్నుకోవడం, చెంపదెబ్బలు కొట్టుకోవడం చేశారు. దీంతో టీవీ షో సిబ్బంది వారిని ఆపడానికి ప్రయత్నిస్తూ వారివైపు పరుగుతీశారు. 


ఈ గొడవ జరిగిన తర్వాత అఫ్నాన్‌ తన ట్విట్టర్‌ (ఎక్స్‌) లో పోస్ట్‌ చేశారు. తాను అహింసను నమ్ముతానని అయితే తాను నవాజ్‌ షరీఫ్‌ సైనికుడిని అంటూ పేర్కొన్నారు. 'నిన్న జరిగిన టాక్‌ షోలో మార్వాట్‌ నాపై దాడి చేశాడు. నేను అహింసను నమ్ముతాను. కానీ నేను నవాజ్‌ షరీఫ్‌ సైనికుడిని. మార్వాట్‌ను, పీటీఐ నేతలకు, ముఖ్యంగా ఇమ్రాన్‌ ఖాన్‌కు ఇది ముఖ్యమైన పాఠం. వారు పెద్ద నల్ల కళ్ళద్దాలు ధరించాలి' అని పోస్ట్‌లో తెలిపారు.


పీటీఐ నేత మార్వాట్‌ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ఇలా అన్నారు.. 'ఎక్స్‌ప్రెస్‌ టీవీ, జావేద్‌ చౌదరి నిజంగా తమ టీవీ షోలో జరిగిన దానిపై ప్రజా తీర్పు కోరుకుంటే, ప్రజల నుంచి ఏదీ దాచకూడదని అప్పుడే న్యాయం జరుగుతుంది. ఎక్స్‌ప్రెస్‌ టీవీలో పోరాటానికి దారి తీసిన చర్చ ఐదు లేదా ఆరు నిమిషాల నిడివి రికార్డింగ్‌ ఉంది. అది మొత్తం ప్రజలకు ఎందుకు చూపించడం లేదు? ఏదైనా సమాధానం ఉందా? ప్రజలకు మొత్తం సత్యం తెలుస్తుంది. జావేద్‌ చౌదరి మొత్తం ఆరున్నర నిమిషాల క్లిప్‌ షేర్‌ చేస్తే నేను అతనిని ఎందుకు కొట్టాను అనే సమాధానం స్పష్టంగా ఉంటుంది' అని వెల్లడించారు.