NEP Captains: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ - 2020 అమలులో విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ "ఎన్ఈఫీ సారథి" అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిప్లొమో, యూజీ, పీజీ విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. ఉన్నత విద్యారంగంలో సంస్కరణలపై విద్యార్థుల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా యూజీసీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలోనే ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులను ఎంపిక చేసింది. తాజాగా వీరి జాబితాను ప్రకటించగా... ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు ఎంపిక అయ్యారు. 8 కళాశాలలకు చెందిన మొత్తం 23 మంది విద్యార్థులకు ఈ అవకాశం దక్కింది. అయితే ఎన్ఈపీ సారథులుగా ఎంపికైన వీరిని ఎన్ఈపీ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు. జాతీయ విద్యా విధానం అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీలు, వివిధ ఉన్నత విద్యా సంస్థలకు చెందిన వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్లు, ప్రన్సిపాళ్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయా విద్యా సంస్థల్లో విద్యార్థులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం ద్వారా ఎన్ఈపీ లక్ష్యాలను మరింత సులభంగా సాధించగల్గుతామని యూజీసీ భావిస్తోంది.
డిబేట్లు, క్విజ్ లతో పాటు ఇతర పోటీల నిర్వహణ
విద్యా సంస్కరణలు విజయ వంతంగా అమలు కావడానికి విద్యార్థుల ప్రమేయం చాలా ముఖ్యమని యూజీసీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ముఖ్యంగా విద్యార్థుల్లో నిబద్ధత వల్లే ఇది విజయవంతం అవుతుందని తెలిపింది. అయితే ఈవెంట్లు, డిబేట్లు, పోటీలు, క్విజ్ లు వంటి పోటీలు నిర్వహించేలా కార్యక్రమాలను కూడా రూపొందించింది. అలాగే సోషల్ మీడియా ద్వారా ఎన్ఈపీ ప్రచారం చేయడం, కాలేజీల్లో ఎన్ఈపీ హెల్స్ డెస్కుల ఏర్పాటు తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎన్ఈపీ అంబాసిడర్ గా యూనివర్సిటీలు, విద్యా సంస్థలు తమ సంస్థల్లో అత్యుత్తమ వ్యక్తిత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సామర్థ్యాలు, సృజనాత్మక, బాధ్యతాయుత ప్రవర్తన, నాయకత్వ పటిమ ఉన్న ముగ్గురు విద్యార్థులను నామినేట్ చేశాయి. వారి నుంచి యూజీసీ అర్హులు అయిన వారిని ఎంపిక చేసి ఎన్ఈపీ అంబాసిడర్లుగా ప్రకటించింది.
యూజీసీకి ఫీడ్ బ్యాక్ అందించాల్సిందే..!
అయితే ఎన్ఈపీ సారథులుగా ఎంపికైన వారు.. తమ విధుల్లో భాగంగా ఎన్ఈపీ-2020 కార్యక్రమాలపై ఇతర విద్యార్థులకు అవగాహన పెంచాల్సి ఉంటుంది. అలాగే క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం వంటివి కూడా ఓపికగా చేయాలి. అలాగే ఈ కార్యక్రమం అమలుపై యూజీసీకి ఫీడ్ బ్యాక్ ను కూడా అందించాలి. అంబాసిడర్ గా ఎంపికైన వారికి యూజీసీ గుర్తింపు సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ సర్టిఫికేట్ తో వారికి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి. సర్టిఫికేట్ తో పాటు యూజీసీ ఆన్ లైన్ ప్రోగ్రాంలు, ఇతర అవకాశాలను కూడా వారు పొందుతారు. అలాగే ఈ అనుభావం వారికి భవిష్యత్తులో మరిన్న ఉన్నత విద్యా కోర్సుల అభ్యాసానికి సహకరిస్తుందని యూజీసీ అధికారులు వివరిస్తున్నారు. మరోవైపు ఎన్ఈపీ సారథులుగా ఎంపికైన విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా తెగ సంబరపడిపోతున్నారు.
Read Also: IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా