Asian Games 2023: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ భారత ఫుట్‌బాల్  అభిమానులకు శుభవార్త చెప్పింది.  ఈ ఏడాది సెప్టెంబర్  - అక్టోబర్‌లలో  హాంగ్జౌ (చైనా) వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా  క్రీడల్లో  ఫుట్‌బాల్ జట్టును  పాల్గొనేందుకు అనుమతినిచ్చింది.   ర్యాంకుల ఆధారంగా గతంలో ఫుట్‌బాల్ టీమ్‌ను  పంపేందుకు నిరాకరించిన  ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, క్రీడా మంత్రిత్వ శాఖ.. తాజాగా తమ నిర్ణయాన్ని సవరించాయి. 


ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఇండియన్ ఫుట్‌బాల్ లవర్స్‌కు గుడ్ న్యూస్..  మన జాతీయ (పురుషుల,  స్త్రీల) ఫుట్‌బాల్ జట్లు  త్వరలో జరుగబోయే ఆసియా క్రీడల్లో పాల్గొంటాయి.   కేంద్ర  యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం గతంలో  నిబంధనలను సడలించాలని అంగీకరించాయి.  ఇటీవల భారత ఫుట్‌బాల్ జట్టు ప్రదర్శనలు దృష్టిలో ఉంచుకుని  కేంద్ర క్రీడా శాఖ ఈ సడలింపులిచ్చింది. ఆసియా  క్రీడలలో  మన జట్లు  అద్భుత ప్రదర్శనతో దేశం గర్వించేవిధంగా  ఆడతాయని  ఆశిస్తున్నా..’ అని ట్వీట్ చేశారు. 


కాగా  అండర్ - 23   స్థాయిలో పోటీపడే ఆసియా క్రీడలలో భారత ఫుట్‌బాల్ జట్టును  పంపకూడదని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది.   ఆసియా క్రీడల్లో జరుగబోయే టీమ్ ఈవెంట్స్ పోటీలలో టాప్ - 8 ర్యాంకులో ఉన్న జట్లనే ఆసియా క్రీడలకు పరిగణించాలని  క్రీడల మంత్రిత్వ శాఖ.. భారత ఒలింపిక్ సంఘం (ఐవోఎ), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్) లకు లేఖ రాసింది. ఆసియాలో ఫుట్‌బాల్ ఆడే జట్లలో టాప్ -10 లో భారత్ లేదు.  ప్రస్తుతం భారత ర్యాంకు 18గా ఉంది.  అయితే దీనిపై  తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.


 






భారత ఫుట్‌బాల్ జట్టు ఇటీవల కాలంలో మెరుగ్గా ఆడుతున్నదని,  కొద్దిరోజుల క్రితమే ఇంటర్ కాంటినెంటల్ కప్,  శాప్ టైటిల్ కూడా గెలిచిన భారత జట్టును  ఆసియా క్రీడల్లో ఆడించాలని అభిమానులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.  భారత ఫుట్‌బాల్ కోచ్ ఇగార్ స్టిమాక్ కూడా ఇదే విషయమై ప్రధాని నరేంద్ర మోడీ,  కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ రాశారు. 


 






కేంద్రం  నిబంధనలను సడలించిన నేపథ్యంలో  టీమిండియా.. ఆసియా క్రీడల సన్నాహకాలపై  దృష్టిసారించింది.  అండర్ - 23 స్థాయిలో మ్యాచ్‌లు జరిగినా ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం ఏజ్ లిమిట్ లేదు. ఈ నేపథ్యంలో భారత ఫుట్‌‌బాల్ జట్టు సారథి  సునీల్ ఛెత్రితో పాటు మరో ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు  ఆసియా క్రీడలు ఆడనున్నట్టు  తెలుస్తున్నది. 





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial