DK Siva Kumar: 


ఆర్థిక ఇబ్బందులు..
 
కర్ణాటకలో 5 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కి వాటిని అమలు చేయడం కత్తిమీద సామైంది. నిధులు చాలక  ఇబ్బందులు పడుతోంది. కొంత మంది ఎమ్మెల్యేల అసహనానికీ ఇదే కారణం. అందుకే...ముఖ్యమంత్రి లేఖ రాసినట్టు ప్రచారం జరిగింది. అదంతా ఫేక్ అని కాంగ్రెస్ కొట్టి పారేసింది. అయితే...ఇప్పుడు ప్రభుత్వం హామీలు నెరవేర్చడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టు డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ ఇప్పటికే చాలా సందర్భాల్లో తేల్చి చెప్పారు. కానీ...ఈ సారి మాత్రం ఆయన వ్యాఖ్యల తీరు మారిపోయింది. ఈ సంవత్సరం ఉచిత హామీలను అమలు చేయడం కష్టమే అని స్పష్టం చేశారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు పడుతోందని అందుకే ఆ హామీలు నెరవేర్చడం కుదరడం లేదని చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గానూ ఉన్న డీకే శివకుమార్ చేసిన కామెంట్స్ ఆ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఎమ్మెల్యేలందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ కొద్ది రోజులు ఓపిక పట్టాలని సూచించారు డీకే శివకుమార్. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదన్న అసహనంతో ఉన్నారు చాలా మంది ఎమ్మెల్యేలు. అంతే కాదు. కొంతమంది మంత్రులు తమని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికీ తీసుకెళ్లినట్టు సమాచారం. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం "అంతా బాగానే ఉంది" అని అంటున్నారు. అంతర్గతంగా ఏం జరుగుతోందన్నది క్లారిటీ లేదు. ఈ పుకార్లకు డీకే శివకుమార్ చేసిన కామెంట్స్‌ తోడయ్యాయి. హామీలు నెరవేర్చలేం అని నేరుగానే చెప్పారు డీకే శివకుమార్. 


"కొంత మంది ఎమ్మెల్యేలు రకరకాల సమస్యలతో మమ్మల్ని కలుస్తున్న మాట వాస్తవమే. ఉచిత హామీలు అమలు చేయాలంటే ఇప్పటికిప్పుడు రూ.40 వేల కోట్లు జమ చేయాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని వాళ్లకు వివరిస్తున్నాం. మేం స్పష్టంగా చెప్పేదేంటంటే...ఈ ఏడాది ఆ హామీలను అమలు చేయడం కష్టమే. ముఖ్యంగా ఇరిగేషన్, PWD విభాగాల్లో ఎక్కువ నిధులు అవసరమవుతున్నాయి. ఎమ్మెల్యేలు వీటిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. పార్టీ మీటింగ్‌లో వాళ్లకు అంతా వివరిస్తాం. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు నెరవేరుస్తాం అని చెప్పిన మాట నిజమే. కానీ దయచేసి కొంత ఓపిక పట్టండి"


- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం


కొందరు మంత్రులు తమను అసలు పట్టించుకోడం లేదని ఎమ్మెల్యేలు హైకమాండ్‌కి కంప్లెయింట్ చేసినట్టూ తెలుస్తోంది. కీలక విషయం ఏంటంటే...11 మంది ఎమ్మెల్యేలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఓ లేఖ పంపినట్టు సమాచారం. వాళ్లందరూ ఆ లేఖపై సంతకాలు పెట్టి మరీ ఫిర్యాదు చేశారట. 20 మంది మంత్రులు తమని బాగా ఇబ్బంది పెడుతున్నట్టు అందులో కంప్లెయింట్ చేశారట. ఇక అప్పటి నుంచి కర్ణాటక కాంగ్రెస్‌లో కూడా ఏదో జరుగుతోందన్న వాదనలు మొదలయ్యాయి. దీనిపై ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. "ఇదంతా అవాస్తవం" అని కొట్టి పారేశారు. ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు మధ్య ఎలాంటి గ్యాప్ రాకుండా ఉండేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు తేల్చి చెప్పారు. 


Also Read: మా అంతర్గత విషయాల్లో మీరు తలదూర్చకండి, మిజోరం సీఎంకి బైరెన్ సింగ్ వార్నింగ్