Manipur Violence: 


ర్యాలీలో పాల్గొన్న మిజోరం సీఎం..


మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్...మిజోరం సీఎం జోరంతంగకు వార్నింగ్ ఇచ్చారు. అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. మణిపూర్‌లో కుకీలపై జరిగిన దాడులను ఖండిస్తూ జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు మిజోరం సీఎం. దీనిపైనే బైరెన్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా మణిపూర్‌లో అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. వేలాది మంది కుకీలు పొరుగునే ఉన్న మిజోరంకి వలస వెళ్లారు. అక్కడి ప్రభుత్వం వాళ్లందరికీ ఆశ్రయం కల్పిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికే 13 వేల మంది కుకీలు మిజోరంకి వలస వెళ్లినట్టు తెలుస్తోంది. మిజోరంలోని మిజో తెగలకు, మణిపూర్‌లోని కుకీలకు ఎప్పటి నుంచో మైత్రి ఉంది. మయన్మార్‌కి చెందిన చిన్ తెగలతోనూ సంబంధాలున్నాయి. 31 మంది చిన్ శరణార్థులు కూడా మయన్మార్ నుంచి మిజోరంకి వలస వెళ్లారు. మొత్తంగా ఆ రాష్ట్రం వలసలదారులకు కేంద్రంగా మారింది. మయన్మార్‌లో చిన్‌ తెగలకు, అక్కడి ఆర్మీకి ఘర్షణ జరిగిన తరవాత వాళ్లు కూడా మిజోరంకి వరుస కట్టారు. అయితే...మణిపూర్‌ విషయంలో మిజోరం జోక్యం చేసుకోవడాన్ని బైరెన్ సింగ్ ఖండిస్తున్నారు. "మీకు ఆ అవసరం లేదు" అని తేల్చి చెబుతున్నారు. ఇదే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు బైరెన్ సింగ్. తాము ఎప్పుడైతే డ్రగ్స్ ముఠాలను నియంత్రించడం మొదలు పెట్టామో అప్పటి నుంచే రాష్ట్రంలో హింస మొదలైందని వెల్లడించారు. 


"డ్రగ్స్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడం మొదలైనప్పటి నుంచే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు ప్రారంభమయ్యాయి. మణిపూర్ ప్రభుత్వం ఎప్పుడూ కుకీలకు వ్యతిరేకం కాదు. రాష్ట్ర ఐక్యతను దెబ్బ తీయాలని చూసే వాళ్లదంరినీ మేం గమనిస్తున్నాం. మిజోరం ముఖ్యమంత్రి నా సలహా ఒక్కటే. పొరుగు రాష్ట్ర విషయాల్లో తల దూర్చద్దు"


-బైరెన్ సింగ్, మణిపూర్ ముఖ్యమంత్రి


భిన్న వాదనలు..


అక్రమ వలసదారులను అడ్డుకుంటున్నామని బైరెన్ సింగ్ తేల్చి చెబుతున్నారు. కుకీలకు ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ ఉండాలన్న డిమాండ్‌నీ కొట్టిపారేశారు. అటు కుకీ తెగకు చెందిన సంస్థలు మాత్రం రాష్ట్రంలో హింస చెలరేగడానికి కారణం ముఖ్యమంత్రేనని తేల్చి చెబుతున్నాయి. తమ తెగకు అన్యాయం చేయాలని చూశారని, అందుకే రాష్ట్రం ఇలా తగలబడిపోతోందని అంటున్నాయి. 


మణిపూర్ హింసాంకాండ మొత్తం దేశాన్ని ఉడికిస్తోంది. అటు పార్లమెంట్‌లోనూ దీనిపై పెద్ద రగడే జరుగుతోంది. ఈ హింసపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుపడుతున్నాయి. దీనిపై పలువురు విపక్ష ఎంపీలు పార్లమెంట్ బయటే ఆందోళనలు చేస్తున్నారు. ఇది కచ్చితంగా బీజేపీ వైఫల్యమే అని తేల్చి చెబుతున్నారు. ఈ అల్లర్లకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన బైరెన్ సింగ్ మరోసారి ఇదే విషయం వెల్లడించారు. రిజైన్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప రాజీనామా చేయనని స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.


Also Read: అవిశ్వాస తీర్మానం బీజేపీని నైతికంగా దెబ్బ తీస్తుందా? విపక్షాల వ్యూహం ఇదేనా?