Asia Mixed Team Badminton Tournament: ఆసియా మిక్స్ డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. హోరాహోరీగా జరిగిన సెమీస్ పోరులో భారత్ 2-3 తేడాతో చైనా చేతిలో ఓడిపోయింది. అయితే అసలు పతకంపై ఆశలు లేని స్థితిలో మన బ్యాడ్మింటన్ వీరులు పోరాడిన తీరు ఆకట్టుకుంది. తొలి రెండు మ్యాచులు పోయినా.. తర్వాత 2 మ్యాచ్ లు గెలిచి పోటీలోకి వచ్చిన భారత్.. ఒక దశలో చైనాపై విజయం సాధించేలా కనిపించింది. అయితే చివరకు మిక్స్ డ్ డబుల్స్ లో ఓడిపోయి కాంస్యంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఆదిలోనే షాక్
ఈ మ్యాచ్ లో మొదటే భారత్ కు డబుల్ షాక్ తగిలింది. స్టార్ షట్లర్లు సీహెచ్. ప్రణయ్, పీవీ. సింధులు చైనా ఆటగాళ్లు చేతిలో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ లో ప్రణయ్ 13-21, 15-21 తేడాతో లీలాన్ చేతిలో ఓడిపోయాడు. ఇక సింధు ప్రపంచ 101వ ర్యాంకర్ ఫాంగ్ గావో చేతిలో ఖంగుతింది. 9-21, 21-16, 18-21 తేడాతో ఫాంగ్.. సింధును ఓడించింది. దీంతో విజయంపై భారత్ ఆశలు గల్లంతయ్యాయి. అయితే ఈ దశలో పురుషుల డబుల్స్ లో ధ్రువ్ కపిల- చిరాగ్ శెట్టి జోడీ.. హిజి తింగ్- హో డాంగ్ ను ఓడించటంతో ఆశలు చిగురించాయి. భారత జోడీ 21-19, 21-19తో చైనా జంటను ఓడించింది. అలాగే మహిళల జోడీ పుల్లెల గాయత్రి- ట్రెసా జాలీ జంట అద్భుత ప్రదర్శనతో లీషెంగ్- వీజిన్ జోడీని ఓడించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత జోడీ 21-18, 13-21, 21-19తో గెలిచింది.
పోరాడినా కాంస్యమే
దీంతో భారత్ 2, చైనా 2 మ్యాచ్ లు గెలిచినట్లయింది. ఫలితం మిక్స్ డ్ డబుల్స్ మ్యాచ్ పై ఆధారపడి ఉండగా.. భారత జంట ఇషాన్ భట్నాగర్- తనీషా.. జియాంగ్- వీయ్ మా చేతిలో ఓడిపోయింది. భారత జోడీ అద్భుతంగా పోరాడినా గెలవలేకపోయింది. దీంతో చైనా గెలిచి ఫైనల్ కు వెళ్లింది. భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మరో సెమీస్ లో కొరియా 2-1తో థాయ్ లాండ్ పై నెగ్గింది.