బరువు తగ్గాలనుకునే వారు, డయాబెటిస్ బారిన పడినవారు బ్రౌన్ రైస్‌ను తినేందుకు ఇష్టపడతామరు. ఆరోగ్యంగా బరువు తగ్గేలా చేయడంలో బ్రౌన్ రైస్ ముందుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలను దూరం చేయడంతో పాటు, శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. ఈ బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే  ఇందులో ఉండే డైటరీ ఫైబర్ జీవక్రియను సవ్యంగా సాగేలా చేస్తుంది. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే బ్రౌన్ రైస్‌తో ఏం చేసుకోవాలో చాలామందికి తెలియదు. కేవలం అన్నం మాత్రమే వండుకొని తినాలని అనుకుంటారు. కానీ బ్రౌన్ రైస్‌తో దోశె, కిచిడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రుచిలో కూడా ఇవి అదిరి పోతాయి. ఓసారి ట్రై చేయండి.  


బ్రౌన్ రైస్ దోశె


కావాల్సిన పదార్థాలు
బ్రౌన్ రైస్ - రెండు కప్పులు 
అటుకులు - పావు కప్పు 
శెనగపప్పు - రెండు టేబుల్ స్పూన్లు 
మినప్పప్పు - అర కప్పు 
మెంతులు - అర స్పూను 
ఉప్పు - రుచికి 


తయారీ ఇలా
1. బ్రౌన్ రైస్‌ను నీటిలో నానబెట్టి నాలుగైదు గంటల పాటు వదిలేయాలి. వేరే గిన్నెలో మినప్పప్పు, శెనగపప్పు, మెంతులు వేసి నానబెట్టాలి. అలా నాలుగు గంటలు వదిలేయాలి. 
2. బాగా నానాక  బ్రౌన్ రైస్‌ను, పప్పులు, మెంతులు వేసి మిక్సీలో రుబ్బుకోవాలి. పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో ఉప్పు వేసి కలపాలి. 
3. గిన్నెపై మూత పెట్టి ఎనిమిది గంటలు బయటే వదిలేయాలి. ఆ పిండి పులుస్తుంది. 
4. మరుసటి రోజు ఉదయం ఈ పిండిని కలుపుకొని, అవసరం అయితే నీళ్లు వేసుకోవాలి. 
5. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి నెయ్యి లేదా నూనె వేసుకొని దోశెలు పోసుకోవాలి. 
6. ఈ బ్రౌన్ రైస్ దోసెలను కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి


.................................................


బ్రౌన్ రైస్ కిచిడి


కావాల్సిన పదార్థాలు
బ్రౌన్ రైస్ - అరకప్పు 
పెసరపప్పు - ఒక కప్పు 
నెయ్యి - రెండు టీ స్పూన్లు 
జీలకర్ర - ఒక టీ స్పూను 
పసుపు - అర టీ స్పూను 
లవంగాలు - రెండు 
ఇంగువ పొడి - అర టీ స్పూను


తయారీ ఇలా
1. బ్రౌన్ రైస్, పెసరపప్పు కలిపి బాగా కడిగి నీళ్లలో 30 నిమిషాలు నానబెట్టాలి. 
2. ఇప్పుడు స్టవ్ పై ప్రెషర్ కుక్కర్ పెట్టి నెయ్యి వేయాలి. ఆ నెయ్యిలో జీలకర్ర, ఇంగువ, పసుపు, లవంగాలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. 
3. అవి వేగాక నానబెట్టుకున్న బ్రౌన్ రైస్,  పెసరపప్పును వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
4. తర్వాత కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉంచితే బ్రౌన్ రైస్ కిచిడి రెడీ అయినట్టే.


Also read: సాధారణ దగ్గు, టీబీ వల్ల వచ్చే దగ్గు మధ్య తేడాను తెలుసుకోవడం ఎలా?















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.