జలుబు, దగ్గు అనేది తరచూ మనుషులపై దాడి చేస్తూనే ఉంటాయి. దగ్గు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిలో ఎక్కువ శాతం సాధారణమైనవే, ప్రమాదకరమైనవి కావు. అందుకే దగ్గు వచ్చినా ఎక్కువమంది పెద్దగా పట్టించుకోరు. వేడి నీళ్లు తాగుతూ, దగ్గు సిరప్ వేసుకొని కోలుకుంటారు. అయితే అన్నివేళలా దగ్గును విస్మరించడం మంచిది కాదు. ఎందుకంటే క్షయలాంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో మొదట కనిపించే లక్షణం దగ్గు.  సాధారణ దగ్గుకు, టీబీ వల్ల వచ్చే దగ్గుకు మధ్య తేడా తెలియక చాలామంది దాన్ని పట్టించుకోవడం లేదు. ఆ రెండు దగ్గుల మధ్య తేడా తెలుసుకుంటే టీబీని ప్రాథమిక దశలోనే అడ్డుకోవచ్చు.


రెండింటి మధ్య తేడా
సాధారణ దగ్గు, క్షయ వల్ల వచ్చే దగ్గు మధ్య తేడా తెలుసు కోవడం ముఖ్యం. క్షయ, ఇతర తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు దగ్గుకు కారణం అవుతాయి. సాధారణ దగ్గుతో పోలిస్తే క్షయ వల్ల వచ్చే దగ్గు రెండు వారాల కంటే ఎక్కువ కాలం పాటు ఉంటుంది. సాధారణ దగ్గు వచ్చినప్పుడు దానితో పాటూ జలుబు వచ్చే అవకాశం ఉంది కానీ ఇతర సమస్యలేవీ రావు. కానీ క్షయ వల్ల దగ్గు వస్తుంటే మాత్రం... శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,రాత్రిపూట చెమటలు పట్టడం, అప్పుడప్పుడు దగ్గులో రక్తం కనిపించడం, తీవ్ర అలసట, ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, చలి వేయడం, జ్వరం వంటివి కూడా కలుగుతాయి. దగ్గుతో పాటూ వీటిలో ఏ లక్షణం ఉన్నా కూడా  క్షయ వ్యాధి పరీక్ష చేయించుకోవడం అవసరం. 


టీబీ ఎందుకు వస్తుంది?
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై టీబీ దాడి చేస్తుంది. అలాగే ఎవరైనా టీబీ సోకిన వ్యక్తితో సన్నిహిత పరిచయాన్ని కలిగి ఉన్నా కూడా వారికి సోకుతుంది. పోషకాహార లోపం వల్ల క్షయ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.తరచుగా ధూమపానం చేసే వారిలో ఇది కనిపిస్తుంది. దీర్ఘకాలికంగా మూత్రపిండాల వ్యాధులు, రోగనిరోధక శక్తి వ్యాధులతో బాధపడుతున్న వారిలోనూ క్షయ వచ్చే అవకాశం ఎక్కువ. 


చికిత్స
క్షయ వ్యాధి నిర్ధారణ అయ్యాక దానికి కారణమైన బ్యాక్టీరియా శరీరంలో వ్యాప్తి చెందకుండా ఆపేందుకు మందులు ఇస్తారు. ఆ బాక్టీరియాని చంపేందుకు శక్తివంతమైన టాబ్లెట్స్ ఇస్తారు. తర్వాత శరీరంలో ఎక్కడో ఒక మూల టీబీని కలిగించే బ్యాక్టీరియా నిద్రాణ స్థితిలో ఉండే అవకాశం ఎక్కువ. దాన్ని కూడా చంపేందుకు ఎనిమిది నుండి తొమ్మిది నెలల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. టీబీ ఒక్కసారి వస్తే మళ్లీ రాదని లేదు, తగ్గిపోయినా కూడా తిరిగి రీలాప్స్ అవుతుంది. 


Also read: మనిషి మాంసం తినే ఈ బ్యాక్టీరియాతో జాగ్రత్త, వీటి వల్ల ప్రాణానికే ముప్పు














గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.