శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అనేక రకాల హార్మోన్లు అవసరం. అవి శరీరంలో ఉత్పత్తి అయి, వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. శరీరంలో హార్మోన్ల కొరత ఏర్పడితే తీవ్రమైన సమస్యలు, వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. హార్మోన్లలో అసమతుల్యత నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, మంచి జీవనశైలిని అనుసరించడం అవసరం. శరీరంలో హార్మోన్స్ స్థాయిలు బ్యాలెన్స్ లేనప్పుడు ఖచ్చితంగా వైద్య చికిత్స తీసుకోవాలి. అలాగే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడే కొన్ని ఆహారాలను కచ్చితంగా తినాలి.


క్యాబేజీ 
క్యాబేజీని రెండు రోజులకు ఒకసారి తిన్నా మంచిదే. దీన్ని తినడం వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. క్యాబేజీలో అనేక సమ్మేళనాలు, మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హార్మోన్ల స్థాయిని నిర్వహించడానికి ఉపయోగపడతాయి. కూరగా, పచ్చడిగా, సలాడ్‌గా ఇలా ఏ రూపంలోనైనా క్యాబేజీని తినడం అవసరం.


బ్రకోలి 
శరీరంలో హార్మోన్ల అసమతుల్యత సమస్య నుంచి బయటపడేసే సమర్థత బ్రకోలీలో పుష్కలంగా ఉంది. శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నవారు బ్రకోలీని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. కేవలం ఈస్ట్రోజన్ హార్మోన్ మాత్రమే కాదు అనేక రకాల హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో బ్రకోలి సాయపడుతుంది.


టమోటో 
టమోటోలు అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయి. కాబట్టి టమోటోను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. టమోటో తినడం వల్ల శరీరంలోని హార్మోన్లన్నీ సమతుల్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. హార్మోన్ అసమతుల్యతను తగ్గించడంలో టమాటలోని పోషకాలు ముందుంటాయి.


అవకాడో 
అవకాడో పండ్లు మన దేశంలో పండవు. కానీ ప్రతి సూపర్ మార్కెట్లోనూ, పండ్ల మార్కెట్లలోనూ అందుబాటులో ఉంటాయి ఈ అవకాడో పండ్లు.  హార్మోన్ల ఉత్పత్తిని సరి చేయడంతో పాటు వాటిలో అసమతుల్యత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి. హార్మోన్ల అసమతుల్యత సమస్యతో బాధపడేవారు అవకాడోను తినడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది.


పాలకూర 
పాలకూర సాధారణంగానే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో అధికంగా ఐరన్ ఉంటుంది. ఇది శరీరంలో రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను కూడా సరిచేస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్ని చాలా అధ్యయనాలు ధృవీకరించాయి.


బీట్రూట్ 
ఈ ఎర్రని దుంపలో పోషకాలు అధికం .శరీరానికి అవసరమయ్యే పోషకాలు అన్నీ ఇందులో ఉన్నాయి. హార్మోన్ అసమతుల్యత రాకుండా కాపాడటంలో బీట్రూట్ ఉపయోగపడుతుంది. దీన్ని మీరు సలాడ్ గా తీసుకున్న లేక కూరగా వండుకొని తిన్నా మంచిదే. 


హార్మోన్ల అసమతుల్యతను నివారించడానికి ఇక్కడ చెప్పిన ఆహార పదార్థాలన్నీ క్రమం తప్పకుండా తినాలి. ఇవన్నీ కూడా మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 


Also read: ఇరవై నాలుగేళ్లుగా ఇతని ఆహారం నీళ్లు, కొబ్బరే - ఆ సమస్యను తట్టుకునేందుకే ఇలా మారాడట

















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.