కేరళలో నివసిస్తున్న వ్యక్తి బాలకృష్ణన్. వయసు 63 ఏళ్లు. గత ఇరవైనాలుగేళ్లుగా అతని భోజనం కేవలం నీళ్లు, కొబ్బరి నీళ్లు, కొబ్బరి ముక్కలు. రోజులో ఎప్పుడు ఆకలేసినా వీటినే తింటాడు. ఇతర ఆహారాలేవీ ముట్టుకోడు. ఇలా తాను మారడనాకి కారణం గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD)అని చెప్పాడాయన. ఇది ఒక జీర్ణకోశ వ్యాధి. ఇది పొట్టలో మంటను కలిగిస్తుంది. ఒక్కసారి వచ్చిందంటూ ఎక్కువ కాలం పాటూ వేధిస్తుంది. దీనివల్ల గుండెల్లో మంటగా అనిపించడం, యాసిడ్ రిఫ్లక్స్ కావడం అనేది జరుగుతుంది. ఈ సమస్య వల్ల విసిగిపోయిన బాలకృష్ణన్ ఆహారం తినాలంటేనే భయపడేవారు. కొబ్బరి నీళ్లు తాగిన తరువాల ఆయనకు ఉపశమనంగా అనిపించేది. దీంతో మిగతా ఆహారాలను పక్కన పెట్టి పూర్తిగా కొబ్బరి మీదే ఆధారపడడం మొదలుపెట్టాడు. మధ్యాహ్న భోజనంలో నాలుగు కొబ్బరి ముక్కలు, కొబ్బరి నీళ్లు తాగుతాడు. రాత్రి భోజనం కూడా ఇంతే. వారానికోసారి మాత్రం తన తోటలో పండించిన కొన్ని కూరగాయలను ఉడికించి తింటాడు. పోషకాహార లోపం రాకుండా ఉండేందుకు ఇలా తింటాడు. 


తాను తినడం కోసం లేత కొబ్బరి కాయలను ప్రత్యేకంగా కొని తెచ్చుకుంటాడు. మొదటి మూడు నెలలు కొబ్బరికి అలవాటు పడడానికి ఇబ్బంది పడ్డానని, తరువాత మాత్రం ఆరోగ్యం కుదుటపడిందని, అప్పట్నించి కొబ్బరి మీదే ఆధారపడ్డానని చెబుతున్నాడు బాలకృష్ణన్. రోజూ వ్యాయామం తప్పకుండా చేస్తానని, ఈత కొడతానని చెబుతున్నాడు ఈయన. గత 24 ఏళ్లుగా ఇలాగే ఉన్నానని, ఎలాంటి సమస్యలు రాలేదని వివరించాడు. కానిస్టేబుల్ గా పనిచేసిన ఈయన, తరువాత రెవెన్యూ సర్వీస్‌‌లో ఉద్యోగం సాధించారు. అయిదు కిలోమీటర్లు ఆగకుండా నడిచేస్తారు. 


కొబ్బరినీళ్ళతో సాధ్యమే
యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలను తగ్గించే శక్తి కొబ్బరికాయల్లో ఉందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. శరీరంలో PH సమతుల్యతను కొబ్బరికాయలు, కొబ్బరి నీళ్లు కాపాడుతాయని వివరించారు. యాసిడ్ రిఫ్లక్స్‌ను నియంత్రించే ఎలక్ట్రోలైట్లు కొబ్బరి నీళ్లలో ఉంటాయని, అందుకే వాటిని తాగడం వల్ల ఇతని సమస్య తగ్గిందని చెబుతున్నారు వైద్యులు. కొబ్బరిలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. పొటాషియం, సోడియం, మాంగనీస్, విటమిన్ బి, కాపర్, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కొబ్బరికాయ వల్ల శరీరానికి అందుతాయి. అయితే కొబ్బరినీళ్లు అత్యధికంగా తాగితే మాత్రం గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు వైద్యులు. దీనికి కారణం కొబ్బరినీళ్ళలో పొటాషియం అధికంగా ఉంటుంది. పొటాషియం శరీరంలో అధికంగా చేరితే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.


GERD వంటి సమస్యలు ఉన్నవారు కేవలం కొబ్బరి నీళ్లు, కొబ్బరితోనే పొట్ట నింపుకోవాల్సిన అవసరం లేదు. ఓట్ మీల్, బ్రౌన్ రైస్, చిలగడదుంపలు, క్యారెట్లు, బ్రకోలి, గ్రీన్ బీన్స్, ఆకుపచ్చని కూరగాయలు వంటి వాటితో ఆహారాన్ని తినవచ్చు. 


Also read: బ్రౌన్ రైస్‌తో ఇలా కిచిడి, దోశె చేసుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు
















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.