Asia Cup 2022:  అంతర్గత సమస్యలతో శ్రీలంక అట్టుడుకుతోంది! ఎక్కడ చూసినా అశాంతి ప్రజ్వరిల్లుతోంది. ధరలు పెరుగుదల, వనరుల కొరతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో అక్కడ ఆసియా కప్‌ నిర్వహించడం సబబేనా? అందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయా? లేదంటో టోర్నీని మరో దేశానికి తరలిస్తారా? అంటే ఇప్పుడే చెప్పలేం అంటున్నారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ!


మరికొన్ని రోజుల్లో ఆసియాకప్‌ మొదలవుతోంది. ఆగస్టు 27న మొదలై సెప్టెంబర్‌ 11న ముగుస్తుంది. కరోనా కారణంగా ఇప్పటికే ఈ టోర్నీని వాయిదా వేశారు. ఇప్పుడేమో ఆతిథ్య దేశంలో అశాంతి పెరిగింది. దీనిపై లండన్‌లో పర్యటిస్తున్న సౌరవ్‌ గంగూలీని మీడియా ప్రశ్నించింది. అయితే టోర్నీని తరలించడంపై ఇప్పుడే మాట్లాడలేనని ఆయన పేర్కొన్నారు. పరిస్థితిని పరవ్యేక్షిస్తున్నామని వెల్లడించారు.


'ప్రస్తుతానికి ఏమీ వ్యాఖ్యానించను. పరిస్థితులను మేం పర్యవేక్షిస్తున్నాం. శ్రీలంకలో ఇప్పుడు ఆస్ట్రేలియా ఆడుతోంది. లంక జట్టు సైతం అదరగొడుతోంది. అందుకే మరో నెల రోజులు వేచిచూస్తాం' అని గంగూలీ అన్నాడు.


Also Read: అనుకున్నట్టే కోహ్లీని తప్పించేశారు! విండీస్‌ టీ20 సిరీసుకు రాహుల్‌ ఎంపికలో సెలక్టర్ల ట్విస్ట్‌!


Also Read: రోహిత్‌ టాస్‌ గెలిస్తే ఆంగ్లేయులకు అప్పడమే!


శ్రీలంకలో ఆసియా కప్‌ను నిర్వహించేందుకు ఇబ్బందులేమీ ఉండవని ఆ దేశ మాజీ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య సైతం స్పందించాడు. అక్కడి ప్రజలు క్రికెట్‌ను ఎంతగానో ప్రేమిస్తారని పేర్కొన్నాడు.


'ఆసియా కప్‌ ఇక్కడే జరుగుతుందన్న ధీమా ఉంది. ఆ టోర్నీకి ఎలాంటి ప్రమాదం ఉండదు. శ్రీలంకలో ప్రజలు క్రికెట్‌ను, క్రికెటర్లను ప్రేమిస్తారు. ఏ క్రికెటర్‌కు విరుద్ధంగా నడుచుకోరు. లంకలో ప్రశాంతంగా టోర్నీ నిర్వహించేందుకు సహకరిస్తారు' అని జయసూర్య పీటీఐకి చెప్పారు.


ఒకవేళ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఆసియా కప్‌ను మరో దేశానికి తరలిస్తారు. బంగ్లాదేశ్‌ను ప్రత్యామ్నాయ వేదికగా ఎంపిక చేశారు.