ఉన్నట్టుండి ఉద్యోగాలు కోల్పోయి..


కొవిడ్ తరవాత అందరి జీవితాలూ మారిపోయాయి. ముఖ్యంగా ఉపాధి విషయంలో ఇప్పటికీ ఆ ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంది. అప్పుడప్పుడే కాస్త ఆర్థికంగా కుదురుకుంటున్న వారిపై గట్టి దెబ్బే పడింది. ఉన్నట్టుండి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు ఏం చేయాలో తలలు పట్టుకుంటున్నారు. 
ఇప్పటికీ ఈ "లే ఆఫ్" ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. చిన్న చిన్న సంస్థలంటే అనుకోవచ్చు. కానీ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజాలు కూడా వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తుండటమే ఇండస్ట్రీలో అలజడికి కారణమైంది. లక్షల రూపాయల జీతాలున్నా, ఉద్యోగ భద్రత లేకుండా దినదినగండంగా కాలం గడుపుతున్న ఉద్యోగులు వేలల్లో ఉన్నారు. అసలు ఈ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు ఎందుకు జరుగుతోంది..? నిజంగానే ఆ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయా..? నష్టాలను కంపెన్సేట్ చేసుకునేందుకే ఉద్యోగులను తీసేస్తున్నాయా..? 


గ్రేట్ రిజిగ్నేషన్‌తో మొదలై...


కొవిడ్ తరవాత మార్కెట్‌లో అతి పెద్ద కుదుపు "ది గ్రేట్ రిజిగ్నేషన్‌"తో మొదలైంది. విదేశాల్లో మొదలైన ఈ ట్రెండ్, భారత్‌లోనూ కనిపించింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అలవాటు పడిన ఉద్యోగులను, పదేపదే ఆఫీస్‌కు రావాలని మెయిల్స్, కాల్స్ చేయటం వారిని చిరాకుకు గురి చేసింది. 
కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోకముందే కొన్ని సంస్థలు ఉద్యోగులపై ఇలా ఒత్తిడి తీసుకొచ్చాయి. ఫలితంగా చాలా మంది, ఆ ఒత్తిడిని భరించలేక రిజైన్ చేశారు. ఇంకొన్ని సంస్థల్లో వర్క్‌ ఫ్రమ్ హోమ్ కదా అని, పని గంటల్ని విపరీతంగా పెంచేశారు. ఈ వైఖరి కూడా ఉద్యోగులను ఆందోళనకు గురి చేసింది. జీతం తక్కువైనా పర్లేదు, వేరే కంపెనీకి మారిపోవటం బెటర్ అనుకున్నారు. ఇలా అట్రిబ్యూషన్ రేట్ క్రమక్రమంగా పెరుగుతూ పోయింది. ఇదంతా ఉద్యోగుల వర్షన్. ఇక సంస్థల వాదన మరోలా ఉంది. 


భారత్‌లోనూ భారీగానే ప్రభావం..


సాధారణంగా ఏ కంపెనీలోనైనా "అత్యవసర" విభాగాలు కొన్ని ఉంటాయి. అంటే...ఆ విభాగానికి చెందిన ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతే మొత్తం రెవెన్యూపై ప్రభావం పడుతుంది. తరవాత కింది స్థాయి ఉద్యోగులు ఉంటారు. ఇద్దరి పనిని ఒక్కరితోనే చేయించుకునేందుకూ వీలుంటుందని సంస్థలు భావిస్తుంటాయి. ఎప్పుడైతే కొవిడ్ లాంటి సంక్షోభాలు తలెత్తుతాయో అప్పుడు ఈ కింది స్థాయి ఉద్యోగులకే గురి పెడుతుంది ఏ కంపెనీ అయినా. వెంటనే అక్కడే కోతలు మొదలు పెడుతుంది. ఇప్పుడదే జరుగుతోంది. "వీళ్లు లేకపోయినా పని నడుస్తుంది" అని అనిపించిందంటే చాలు. వెంటనే వారిని సాగనంపుతోంది. గూగుల్, నెట్‌ఫ్లిక్స్, మీషో, బైజూస్, కాగ్నిజెంట్, ఇన్‌ఫోసిస్ ఇలా బడా టెక్ సంస్థలన్నీ "లే ఆఫ్" ను కొనసాగిస్తున్నాయి. గతంలో అయితే ఈ లే ఆఫ్‌ల సంఖ్య పదుల్లో ఉండేది. ఇప్పుడది వందలకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్ నడుస్తోంది. భారత్ విషయానికొస్తే 2020 నుంచి ఇప్పటి వరకూ స్టార్ట్‌అప్ సంస్థల్లో 23 వేల మందిని తొలగించినట్టు లెక్కలు చెబుతున్నాయి. అయినా రిక్రూట్‌మెంట్ మాత్రం జోరుగానే సాగుతుందని అంటున్నారు. కొవిడ్ తరవాత ఆదాయం భారీగా తగ్గిపోయిందని, విదేశాల్లో కొన్ని
ప్రాజెక్ట్‌లు రద్దవటమూ ప్రభావం చూపిందని కంపెనీ యాజమాన్యాలు అంటున్నాయి. ఈ కారణంగానే, ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోత తప్పటం లేదని వివరిస్తున్నాయి. అటు అట్రిబ్యుషన్ రేట్ పెరగటం, ఇటు లే ఆఫ్‌లూ అధికమవటం వల్ల మొత్తంగా జాబ్ మార్కెట్‌ ఊగిసలాడుతోంది. ఇంకెంత కాలం ఇది కంటిన్యూ అవుతుందో మరి. 


Also Read: Delhi High Court: భర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న భార్యలు- దిల్లీ హైకోర్టు సీరియస్!