IND vs ENG, 2nd ODI Preview: ఓవల్‌లో ఆంగ్లేయులను ఆటాడించిన టీమ్‌ఇండియా ఇప్పుడు లార్డ్స్‌ పోరుకు సిద్ధమైంది. రెండో మ్యాచునూ గెలిచి సిరీస్‌ పట్టేయాలని పట్టుదలగా ఉంది. తొలి పోరు ప్రదర్శననే పునరావృతం చేయాలని భావిస్తోంది. మరోవైపు ఘోర పరాజయానికి ప్రతికారం తీర్చుకోవాలని ఇంగ్లాండ్‌ రగిలిపోతోంది. అచ్చొచ్చిన లార్డ్స్‌లో రెచ్చిపోవాలని అనుకుంటోంది. మరి వీరిలో గెలిచేదెవరు? పిచ్‌ ఎలా ఉంది? తుది జట్లలో ఎవరుంటారు?


టీమ్‌ఇండియాలో కొన్ని వీక్‌నెస్‌లు


తొలి వన్డేలో విజయానికి కారణం జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) బౌలింగ్‌ అటాక్‌. అతడికి మహ్మద్‌ షమి, ప్రసిద్ధ్‌ కృష్ణ అండగా నిలిచారు. లార్డ్స్‌లోనూ (Lords) టీమ్‌ఇండియా గెలవాలంటే వీరు కచ్చితంగా రాణించాల్సిందే. ఒకవేళ రోహిత్‌ (Rohit Sharma) టాస్‌ గెలిస్తే, వాతావరణం అనుకూలంగా ఉంటే బుమ్రా చెలరేగడం ఖాయం. ఓవల్‌లో 10 వికెట్ల తేడాతో విజయం దక్కినప్పటికీ జట్టుకు కొన్ని వీక్‌నెస్‌లైతే ఉన్నాయి. శిఖర్‌ ధావన్‌ స్వేచ్ఛగా ఆడినట్టు అనిపించలేదు. శ్రేయస్‌ అయ్యర్‌ను షార్ట్‌పిచ్‌ బంతుల వీక్‌నెస్‌ వెంటాడుతోంది. సూర్య, హార్దిక్‌, పంత్‌, జడ్డూ మిడిలార్డర్‌ భారం మోయాలి. వీరిలో కనీసం ఇద్దరు భాగస్వామ్యాలు నెలకొల్పడం ముఖ్యం. స్పిన్‌ పరంగా ఇబ్బందేం లేదు.


ఓడినా తక్కువ అంచనా వేయొద్దు!


'ఫ్యాబ్‌ 5' ఆటగాళ్లు వచ్చినా ఇంగ్లాండ్‌ కూర్పులో ఏదో తేడా కొట్టింది! ఎప్పుడూ ప్రత్యర్థులకు రుచి చూపించే స్వింగ్‌ బౌలింగ్‌కు ఈసారి వారే బోల్తా పడ్డారు. రెండో మ్యాచులోనూ తొలుత బ్యాటింగ్‌ చేస్తే ఈ ఇబ్బంది ఎదుర్కోక తప్పదు. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాక జోస్‌ బట్లర్‌ ఆత్మవిశ్వాసంతో ఆడలేదు. వీర బాదుడు బాదే ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌కు డకౌట్ల వీక్‌నెస్‌ ఉంది. జానీ బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్‌, జో రూట్‌ షాట్ల ఎంపిక బాగాలేదు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను అంచనా వేయలేకపోయారు. బౌలింగ్‌లో సైతం పెద్దగా పస కనిపించలేదు. స్కోరు తక్కువగా ఉండటం ఇందుకు కారణం కావొచ్చు. ఈ మ్యాచులో సామ్‌ కరన్‌ను తీసుకున్నా ఆశ్చర్యం లేదు.


టాస్‌ గెలిస్తే బౌలింగే!


ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఎండలు బాగా ఉన్నాయి! 27 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండొచ్చు. అయితే లండన్‌లో ఎప్పుడు వర్షం కురుస్తుందో ఎవరికీ తెలియదు. సడెన్‌గా మబ్బులు కమ్ముకుంటాయి. చిరు జల్లులు కురుస్తాయి. వెంటనే ఎండ వచ్చేస్తుంది. అంటే మబ్బులను బట్టి బంతి స్వింగ్‌ అవుతుంది. తొలుత బ్యాటింగ్‌ చేసేవాళ్లకు కాస్త ఇబ్బంది కరమే. ఛేదన సులభంగా ఉంటుంది.



India vs England 2nd ODI match Probable XI


ఇంగ్లాండ్‌: జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌ స్టో, జో రూట్‌, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌, మొయిన్‌ అలీ, క్రెయిగ్‌ ఓవర్టన్‌, డేవిడ్‌ విలే, బ్రేడన్‌ కేర్స్‌, రీస్‌ టాప్లే


భారత్‌: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్‌