Asia Cup 2022: శ్రీలంకలో ఆసియాకప్‌-2022ను నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం కష్టమేనని శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC) ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా చెలరేగుతున్న వరుస నిరసనలే ఇందుకు కారణం. ఆసియా క్రికెట్‌ మండలి (ACC) వద్ద వారు అశక్తత వ్యక్తం చేశారని సమాచారం. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు ఆసియా కప్‌ జరగాల్సి ఉంది.


ప్రస్తుతం శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం ఆకాశానికి ఎగిసింది. నిత్యావసర వస్తువులు దొరక్కపోవడంతో ప్రజలు ప్రతిరోజూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గుంపులు గుంపులుగా అధికారులు, ప్రభుత్వ పాలకులపై దాడులకు దిగుతున్నారు. తమ దేశ పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని లంక క్రికెట్‌ దిగ్గజాలు సనత్‌ జయసూర్య, కుమార సంగక్కర, మహేళా జయవర్దనె సైతం గళం వినిపించారు.


కొన్ని రోజులు క్రితమే శ్రీలంకలో కంగారూలు పర్యటించారు. ప్రస్తుతం పాకిస్థాన్ టెస్టు సిరీస్‌ ఆడుతోంది. ద్వైపాక్షిక సిరీసులు జరుగుతున్నా ఆసియా కప్‌ ఆతిథ్యం విషయంలో మాత్రం లంక క్రికెట్‌ బోర్డు చేతులెత్తేసినట్టు తెలిసింది. 'శ్రీలంక క్రికెట్‌ సంఘం తమ పరిస్థితి గురించి ఏసీసీకి వివరించిందని శ్రీలంక మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక, రాజకీయ పరిస్థితుల వల్ల ఆసియాకప్‌నకు ఆతిథ్యమిచ్చే స్థితిలో లేమని వివరించింది' అని ది నేషన్‌ రిపోర్టు చేసింది.



'యూఏఈలో ఆసియా కప్‌ నిర్వహించడంపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఏదేమైనా వేదిక ఆసియాలోనే ఉంటుంది. టోర్నీ నిర్వహించేందుకు మైదానాలను కేటాయించాలని లంక బోర్డు వారిని కోరింది' అని ది నేషన్‌ తెలిపింది. ప్రజల నిరసనల వల్ల ఆగస్టు 21న మొదలవ్వాల్సిన లంక ప్రీమియర్‌ లీగ్ (LPL) మూడో సీజన్‌ను వాయిదా వేశారు. 


లంకలో పరిస్థితిని తాము పర్యవేక్షిస్తున్నామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఇంతకు ముందే చెప్పారు. 'ప్రస్తుతానికి ఏమీ వ్యాఖ్యానించను. పరిస్థితులను మేం పర్యవేక్షిస్తున్నాం. శ్రీలంకలో ఇప్పుడు ఆస్ట్రేలియా ఆడుతోంది. లంక జట్టు సైతం అదరగొడుతోంది. అందుకే మరో నెల రోజులు వేచిచూస్తాం' అని గంగూలీ అన్నాడు.


Also Read: ఆసియాకప్‌ను బంగ్లాదేశ్‌కు తరలిస్తారా? గంగూలీ ఆన్సర్‌ ఏంటంటే?


Also Read: ట్రినిడాడ్‌లో టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌కు వర్షం అడ్డంకి! మ్యాచు ఉంటుందా!