అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల ప్రభావం తాజాగా ఆ దేశ క్రికెట్ పై కూడా పడింది. శ్రీలంక వేదికగా సెప్టెంబరు 3 నుంచి అఫ్గానిస్థాన్ x పాకిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే, తాజాగా ఇరు బోర్డుల మధ్య చర్చల అనంతరం 2022 నాటికి ఈ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.  






ఇరు జట్ల మధ్య సిరీస్ నిర్వహించాలని పాకిస్థాన్ బోర్డు ఎంతగానో ప్రయత్నించింది. శ్రీలంకలో ఈ సిరీస్ జరగాల్సి ఉంది. అయితే పాకిస్థాన్‌లో సిరీస్ నిర్వహించాలని సోమవారం ప్రకటించారు. కానీ, అఫ్గానిస్థాన్ బోర్డు తమ ఆటగాళ్లు మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని సిరీస్ వాయిదా వేయాలని పాక్ బోర్డును కోరింది. ఈ మేరకు ఇరు బోర్డుల మధ్య జరిగిన వర్చువల్ సమావేశంలో సిరీస్ వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.  






అఫ్గానిస్థాన్ నుంచి విమాన రాక‌పోక‌లకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో పక్క శ్రీలంకలో కొవిడ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. అలాగే తమ దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అఫ్గానిస్థాన్ క్రికెటర్లు మానసికంగా ఎంతో  ఆవేదన చెందుతున్నారు. ఈ కారణాలతోనే సిరీస్ వాయిదా వేస్తున్న‌ట్లు పీసీబీ తెలిపింది. ఆఫ్ఘ‌న్ క్రికెట్ టీమ్ రోడ్డు మార్గం ద్వారా పాకిస్థాన్ వెళ్లి అక్క‌డి నుంచి శ్రీలంక‌కు విమానంలో వెళ్లాల‌ని ప్లాన్ చేసింది. అయితే ప‌రిస్థితులు అందుకు కూడా అనుకూలంగా లేక‌పోవ‌డంతో సిరీస్‌ను ప్ర‌స్తుతానికి వాయిదా వేసి.. 2022లో నిర్వ‌హించే ప్లాన్ చేశారు.


అఫ్గన్‌, పాకిస్తాన్‌ల మధ్య శ్రీలంక వేదికగా సెప్టెంబర్‌ 1 నుంచి మూడు వన్డేల సిరీస్‌ మొదలుకావాల్సి ఉంది. సెప్టెంబర్‌ 1న తొలి వన్డే, 3న రెండో వన్డే, 5న చివరి వన్డే జరగాల్సి ఉంది.