Sports News in Telugu:  ఒలింపిక్స్‌లో హాకీలో భారత స్వర్ణ పతక యాత్ర ముగిసిన తర్వాత అత్యధిక పతకాలు గెలిచిన క్రీడ రెజ్లింగ్‌( wrestling). షూటింగ్‌లో స్వర్ణ పతకంతో మెరిసినా గత కొన్ని దశాబ్దాలుగా ప్రతీ ఒలింపిక్స్‌(Olympic)లో ఓ పతకంతో భారత్‌... రెజ్లింగ్‌లో మెరుస్తూ వచ్చింది. అంతర్జాతీయ క్రీడా వేదికపై పట్టు వదలకుండా భారత రెజ్లర్లు తమ సత్తా చాటుతూనే ఉన్నారు.  భారత రెజ్లర్లు కుస్తీ పడితే.. ఆ ఉడుం పట్టు నుంచి విడిపించుకోవడం ప్రత్యర్థులకు కష్టమేనని అన్ని దేశాలకు తెలిసొచ్చింది. ఈసారి కూడా ఒలింపిక్స్‌లో భారత కుస్తీ వీరులపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకసారి విశ్వ క్రీడల్లో భారత కుస్తీ వీరుల ప్రస్థానం ఓసారి పరిశీలిస్తే...


జాదవ్‌తో ప్రారంభం...

ఒలింపిక్స్‌లో భారత కుస్తీ వీరులు ఇప్పటివరకూ ఏడు పతకాలు సాధించారు. విశ్వ క్రీడల్లో హాకీ తర్వాత భారత్‌కు అత్యధిక పతకాలు వచ్చిన విభాగం ఇదే. ఒలింపిక్స్‌లో ఎనిమిది స్వర్ణాలతో భారత్‌ మెరవగా... స్వర్ణం రాకపోయినా భారత రెజ్లింగ్‌ వీరులు మాత్రం అంతర్జాతీయ క్రీడల్లో సత్తా చాటుతూనే ఉన్నారు. ఒలింపిక్స్‌లో భారత్ తరపున తొలి పతకం కేడీ జాదవ్‌( KD Jadhav) గెలిచి నవ శకానికి నాంది పలికాడు. రెజ్లింగ్‌లో పతకం సాధించిన ఏకైక భారత మహిళ రెజ్లర్‌గా సాక్షి మాలిక్‌ చరిత్ర సృష్టించింది. స్టార్‌ రెజ్లర్‌ సుశీల్ కుమార్(Sushil Kumar) రెండుసార్లు పతకం సాధించి రికార్డు సృష్టించాడు.

 

ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన మొదటి భారతీయ రెజ్లర్‌గా కేడీ జాదవ్‌ ఖ్యాతి గడించాడు. 1952 హెల్సింకి గేమ్స్‌లో జాదవ్‌ కాంస్య పతకం గెలిచాడు. ఈ పతకం తర్వాత భారత్‌ రెజ్లింగ్‌లో పతకం సాధించే అయిదున్నర దశాబ్దాల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. అయిదున్నర దశాబ్దాల తర్వాత సుశీల్‌కుమార్‌ పతక కరువును తీర్చాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ కాంస్య పతకంతో మెరవడంతో భారత్‌ రెజ్లింగ్‌లో రెండు పతకం సాధించింది. ఆ తర్వాత గత నాలుగు ఒలింపిక్స్‌లో భారత్‌ ఒక్కో రెజ్లింగ్ పతకాన్ని భారత్ గెలుచుకుంది. 

 

పతక ప్రస్థానం ప్రారంభం ఇలా..

1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో పురుషుల ఫ్రీ స్టైల్ 57 కేజీల విభాగంలో కేడీ జాదవ్‌ కాంస్య పతకం సాధించడంతో విశ్వ క్రీడల్లో భారత పతక ప్రస్థానం ప్రారంభమైంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి రెజ్లర్‌గా జాదవ్‌ చరిత్ర సృష్టించాడు. KD జాదవ్ జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించి అదే ఊపును ఒలింపిక్స్‌లోనూ కొనసాగించి తొలి పతకాన్ని ముద్దాడారు. 1948 లండన్‌ ఒలింపిక్స్‌లో ఆరో స్థానంలో నిలిచిన జాదవ్‌... 1952 ఒలింపిక్స్‌లో మాత్రం కాంస్యాన్ని ముద్దాడాడు. ఆ తర్వాత 56 ఏళ్ల పాటు భారత్‌కు రెజ్లింగ్‌లో ఎలాంటి పతకం దక్కలేదు. అంతర్జాతీయ వేదికపై భారత రెజ్లర్ల పోరాటం సరిపోలేదు.

2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్  కాంస్య పతకంతో రెజ్లింగ్‌లో మరో పతకం కలను సాకారం చేశాడు. 2003 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యంతో అంచనాలు పెంచిన సుశీల్‌కుమార్‌... 2008లో ఒలింపిక్స్‌లో కాంస్యంతో ఆ అంచనాలు నిలబెట్టుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 66 కేజీల విభాగంలో రెపెచేజ్ రౌండ్లు సత్తా చాటి కాంస్యాన్ని ముద్దాడాడు. అ తర్వాత 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని ముద్దాడి వరుసగా రెండు వ్యక్తిగత ఒలింపిక్ పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయుడిగా నిలిచాడు. 

 

కొనసాగిన ప్రస్థానం..

ఆ తర్వాత 2012 లండన్‌ ఒలింపిక్స్‌లోనే యోగేశ్వర్ దత్ కాంస్య పతకం సాధించి సత్తా చాటాడు. హర్యానాలోని ఓ గ్రామం నుంచి వచ్చిన యోగేశ్వర్ దత్ ఒలింపిక్స్‌లో పతకం సాధించి ఆశ్చర్యపరిచాడు. మోకాలి, వెన్ను నొప్పి వేధిస్తున్నా పోరాడి యోగేశ్వర్‌ దత్‌ కాంస్యాన్ని ముద్దాడాడు. కంటికి గాయమైనా వరుసగా మూడు బౌట్‌లలో గెలిచి యోగేశ్వర్ దత్ ఒలింపిక్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. 

 

కొత్త చరిత్రకు "సాక్షి"

2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి మాలిక్(Sakshi Malik) మహిళల ఫ్రీస్టైల్ 58 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి భారత మహిళల సత్తాను అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పింది.  సాక్షి మాలిక్‌ గెలిచిన పతకం భారత్‌కు రెజ్లింగ్‌లో ఒలింపిక్స్‌లో తొలి పతకం. ఆతర్వాత 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రవి కుమార్ దహియా - పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో రజత పతకం సాధించి రెజ్లింగ్‌లో భారత హవాను కొనసాగించాడు. రవి కుమార్ 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగి రజత పతకంతో సత్తా చాటాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనే బజరంగ్‌ పునియా పతకంతో మెరిశాడు. పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగంలో కాంస్య పతకంతో పునియా రెజ్లింగ్‌లో భారత పట్టు ఎంత బలమైందో చాటాడు. పురుషుల 65 కేజీల విభాగంలో రెండో సీడ్‌గా బరిలో దిగిన బజరంగ్ పునియా క్వార్టర్ ఫైనల్స్‌లో ఎర్నాజర్ అక్మతలీవ్, ఇరాన్‌కు చెందిన మోర్టెజా ఘియాసీలను ఓడించి కాంస్యాన్ని ముద్దాడాడు.