YS Jagan Latest News: అసెంబ్లీ సమావేశాల కారణంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి కార్యక్రమాల్లో మార్పులు చోటు చేసుకున్నట్లుగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈనెల 21న అసెంబ్లీ సమావేశాల కారణంగా మార్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని జగన్ 22న నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. కానీ, అసెంబ్లీ సమావేశాల కారణంగా 20నే ఆ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.


ఈ విస్తృతస్థాయి సమావేశానికి ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు హాజరవుతారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు భవిష్యత్తు ప్రణాళిక తదితర అంశాలపై వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రేపటి (జూన్‌ 19నాటి) పులివెందుల పర్యటనను కూడా వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి వాయిదా వేసుకున్నట్లుగా వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. 


జగన్ ను కలిసిన పలువురు నేతలు
వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ ను మంగళవారం (జూన్ 18) మధ్యాహ్నం పలువురు పార్టీ నేతలు కలిశారు. ఎన్నికల ఫలితాలు, తదితర అంశాలపై వారితో వైఎస్‌ జగన్‌ ప్రాంతాల వారీగా చర్చించారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో కోలగట్ల వీరభద్రస్వామి, సింహాద్రి చంద్రశేఖర్‌, పొన్నాడ సతీష్‌, అదీప్‌రాజ్‌, తదితరులు ఉన్నారు.