Ambati Rambabu sensational on Polavaram Project | అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సోమవరం సందర్శించారు. ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని, తిరిగి దారిలోకి తెచ్చి, పోలవరం పూర్తి చేయాలంటే మరో నాలుగు సీజన్లు పడుతుందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ నీటిపారుదలశాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవం ప్రాజెక్ట్ చాలా కాంప్లికేటెడ్ విషయం, దాని గురించి ఎవరికి అర్థం కాదన్నారు. ఎందుకంటే పోలవరం తనకు కూడా అర్థం కాలేదు అన్నారు అంబటి రాంబాబు. 


ఆ విషయం చెప్పిన తొలి వ్యక్తిని తానేనన్న అంబటి 
పోలవరం ప్రాజెక్టును పలుమార్లు సందర్శించి, సంబంధిత శాఖ అధికారులతో ఎన్నోసార్లు సుదీర్ఘంగా చర్చలు జరిపిన తరువాత ఓ విషయం అర్థమైందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యే ప్రాజెక్టు కాదని చెప్పిన తొలి వ్యక్తిని తానేనని ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పారని, ఇందులో కొత్తదనం ఏముందని ఏపీ ప్రభుత్వాన్ని, టీడీపీ నేతలను ప్రశ్నించారు. 2019కు ముందు చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదం కారణంగానే పోలవరం నేటికి పూర్తి కావడం లేదని మరో సంచలనానికి తెరలేపారు.


2022లోనే పూర్తి చేస్తామన్నాం, కానీ వివరణ ఇచ్చాం 
పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు, ఆయనకు సంబంధించిన మీడియా దుష్ప్రచారం చేస్తోందని, కానీ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును జగన్ కాంప్లికేటెడ్ చేశాడు, నాశనం చేశాడని, పోలవరం పూర్తి చేయాలంటే ఇంకా నాలుగేళ్లు పడుతుందని చంద్రబాబు చెప్పారని అంబటి రాంబాబు గుర్తుచేశారు. 2019కి ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి అసెంబ్లీ ఎన్నికలు వెళ్తాని చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. అదే విధంగా 2022లో ప్రాజెక్టు పూర్తిచేసి ఎన్నికలు వెళ్తామని మేం చెప్పాం. కానీ పోలవరంపై పూర్తి స్థాయిలో సమీక్ష చేసి, నివేదికల అనంతరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యేది కాదని తాను చెప్పినట్లు అంబటి పేర్కొన్నారు.


‘పోలవరం ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి చేయడానికి మేం ప్రయత్నించాం. ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ చాలా కీలకమైనది. ఎగువ, దిగువ.. రెండు కాఫర్ డ్యామ్ లు కట్టిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలి. కానీ మీరు ముందుగానే డయాఫ్రమ్ వాల్ కట్టారు. నదిని సైతం డైవర్షన్ చేయాలని ప్రయత్నించారు. ఎందుకంటే 2018లోనే పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించాలని చంద్రబాబు భావించారు. నది డైవర్షన్ వీలుకాకపోవడంతో కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాలేదు. కాఫర్ డ్యామ్ పూర్తయితే.. నది డైవర్షన్ కాలేదు కనుక 54 గ్రామాలు మునిగిపోతాయి. అందుకే నీళ్ల డైవర్షన్ చేసి, కాఫర్ డ్యామ్ లు పూర్తి చేసి డయాఫ్రమ్ వాల్ కట్టాలి. ఈ చారిత్రాత్మక తప్పిదంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు. 


ఇప్పుడు పరిస్థితి ఏంటంటే డయాఫ్రమ్ వాల్ కట్టాలి. సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి ఉంది. దీనికి అదనంగా మరో రూ.900 కోట్లు ఖర్చు అవుతుంది. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ కట్టకపోతే ఇలాగే జరుగుతుంది. చంద్రబాబు హయాంలో స్పిల్ వే పైనుంచి నీళ్లు వెళ్లాయి. వైసీపీ హయాంలో కాఫర్ డ్యామ్ పూర్తి చేసి గ్రామాలు నీట మునగకుండా చేశాం.  అక్కడ ఇసుక పొరలు ఎక్కువగా ఉండటంతో స్పిల్ వే కట్టేందుకు అవకాశం తక్కువగా ఉంది. దాంతో నిపుణులు గోదావరి నదిని దారి మళ్లించాలని సూచించారు. 



డయాఫ్రమ్ వాల్ వేయడానికి రూల్ ఏంటంటే.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ లు పూర్తి కావాలి. దాంతోపాటు నది ప్రవాహాన్ని దారి మళ్లించాలి. తరువాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తిచేసి, అనంతరం కాఫర్ డ్యామ్ లు తొలగిస్తారు అని అంబటి రాంబాబు తెలిపారు. కానీ వరద రావడం వల్ల కాఫర్ డ్యామ్ కొంతమేర కొట్టుకుపోయింది. నీళ్లు ప్రవహించకుండా జగన్ అడ్డుకోలేదని చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ చేసిన ఒక్క తప్పిదం ఏంటంటే 2022లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పడమే అని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వైఎస్సార్ కల, ఆశయం అని అంబటి వివరించారు.