Janasena News :  ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం  బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందు కోసం ఒక రోజు ముందుగానే అమరావతి చేరుకున్నారు.  హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్‌పోర్టులో జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లారు.  


చాంబర్‌ను పరిశీలించనున్న పవన్ కల్యాణ్                                        


పవన్‌ కళ్యాణ్  మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి వెళ్లి  రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. మంత్రిగా బుధవారం ఆయ‌న తన ఛాంబర్‌లో బాధ్యతలు తీసుకోనున్నారు. స‌చివాల‌యంలో త‌న ఛాంబ‌ర్‌ను ప‌రిశీలించిన అనంత‌రం సీఎం చంద్రబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉందని స‌మాచారం. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సోమ‌వారం ఛాంబ‌ర్ కేటాయించారు. రెండో బ్లాక్‌లోని మొద‌టి అంత‌స్తులో 212 గ‌దిని కేటాయించ‌డం జ‌రిగింది. ఇక చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు.  


పవన్ క్యాంప్ కార్యాలయంగా ఇరిగేషన్ గెస్ట్ హౌస్                                     


మరో వైపు  ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ క్యాంప్‌ కార్యాలయంగా ఇరిగేషన్‌ గెస్ట్‌హౌస్  ను ప్రభుత్వం కేటాయించింది. విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌ‌సను గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో దేవినేని ఉమా జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు విశాలంగా నిర్మించారు.  త ప్రభుత్వంలో మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ అతిధి గృహాన్ని కేటాయించారు.  సచివాలయంలో గతంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పేషీ ఐదో బ్లాక్‌లో ఉండేది. ఇప్పుడు పవన్‌తో పాటు జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్ కు కూడా రెండో బ్లాక్‌లో మొదటి అంతస్తులో కేటాయించారు. ఇప్పటికే ఈ బ్లాక్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌లో పేషీని మంత్రి నారాయణకు అప్పగించారు. సీఎం పేషీ ఒకటో బ్లాక్‌ వద్ద ఉండటంతో, పవన్‌ పేషీలు రెండోబ్లాక్‌లో ఉంటే అందుబాటులో ఉంటుందని ఆ మేరకు కేటాయింపులు చేశారు. 


ఇష్టమైన శాఖలు ఇచ్చారని పవన్ సంతృప్తి                                 


పవన్ కళ్యాణ్ తొలి సారి ఎమ్మెల్యే అయి..నేరుగా  డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జనసేన మూల సిద్దాంతాలకు అనువుగా తనకు కేటాయించిన శాఖలు ఉన్నాయని.. వాటి ద్వారా ప్రజలకు వీలైనంత మెరుగైన సేవలు చేస్తానని ఆయన నమ్మకంగా ఉన్నారు. సినిమాలకు పూర్తి స్థాయిలో విరామం ఇచ్చి ఆనయ అెదికార విధుల్లో పాల్గొనే అవకాశం ఉంది.