Bhupathi Raju Srinivasa Varma takes charge as Union Minister | న్యూఢిల్లీ: కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను స్థాయికి రావడానికి జాతీయ, రాష్ట్ర నేతలు చాలా మంది సహకరించారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా బాధ్యతలు నిర్వర్తిస్తామన్నారు. ఏపీలో కీలకమైన అంశాలలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒకటి. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే శ్రీనివాస వర్మ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై స్పందించారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా స్టీల్ ప్లాంట్ విషయంలో ముందుకెళ్తామన్నారు.


విశాఖ ఉక్కుపై అప్పుడే నిర్ణయం తీసుకుంటాం 
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విధాన పరంగా నిర్ణయం తీసుకుంటుందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు చెందిన టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీయే కూటమిలా అధికారంలోకి వచ్చాం. అందుకే ఈ పార్టీల అధినేతలతో సమావేశం అనంతరం విశాఖ ఉక్కుపై వివరాలు ప్రకటిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ఏపీ నుంచి పలు కారణాలతో వెనక్కు వెళ్లిన కంపెనీలను రాష్ట్రానికి తీసుకుని వస్తామన్నారు. ఆసక్తి చూపిన పరిశ్రమలకు భూములు కేటాయించి, ఉపాధి అవకాశాలు పెంచుతామని స్పష్టం చేశారు. 


పరిశ్రమలు ఏర్పాటుతో యువతకు ఉపాధి 
తాను రెండు శాఖలకు మంత్రి అని, మోదీ నాయకత్వంలో పనిచేసి ఈ రెండు శాఖలకు మంచి పేరు తెస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సాహిస్తాం అన్నారు. ప్రధానమంత్రి మోదీ ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధిలో మరో అడుగు ముందుకేస్తామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల సహకారంతో నరసాపురం పార్లమెంట్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. తాను 35 ఏళ్లుగా పార్టీలో ఉండి, అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి స్థాయికి రావడంలో తోడ్పాడు అందించిన నేతలకు ధన్యవాదాలు తెలిపారు.  


కేంద్ర మంత్రలు కిషన్ రెడ్డి, కింజరాపు రామ్మోహన్, నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ లతో పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, సీఎం రమేష్ లతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో చర్చించి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తామన్నారు.