Sports News in Telugu: ప్రపంచ హాకీ చరిత్ర(World Hockey History)లో భారత్‌ది ఓ సువర్ణ అధ్యాయం. ఇప్పటివరకూ ఏ జట్టు సాధించలేని... కలలో కూడా ఊహించలేని చరిత్ర మనది. ప్రత్యర్థులు వణికిపోయేలా..ఇక వారిపై గెలవడం మన వల్ల కాదంటూ నిస్తేజం ఆవరించేలా... అమ్మో భారత జట్టా(Indian Hockey Team)... అని భయపడేలా సాగింది అంతర్జాతీయ హాకీలో భారత జైత్రయాత్ర.   మైదానంలో చిరుతలా పరిగెత్తే భారత ఆటగాళ్లను చూసి ప్రత్యర్థి జట్లు దిగ్భ్రాంతి కి గురయ్యేవి. సాక్ష్యాత్తూ నియంత హిట్లర్‌ను కూడా తమ ఆటతో మంత్రముగ్దున్ని చేసిన కళాత్మకమైన ఆట భారత హాకీ సొంతం. పదండీ ఓసారి ఆ చరిత్రను తలుచుకుని మన హాకీ ఘనతను మరోసారి స్మరించుకుందాం. హాకీ చరిత్ర ఆరంభంలోనే అద్భుతాలు సృష్టించిన నాటి ఆటను నెమరువేసుకుందాం.  


సువర్ణ అధ్యాయాన్ని మించి..

ఒలింపిక్స్‌ ఇందులో ఒక్క పతకమైన సాధించాలని ప్రతీ అథ్లెట్‌ కలలు కంటాడు. ఇందులో పాల్గొంటేచాలని అనుకునే ఆటగాళ్లైతే చాలామంది ఉంటారు. అలాంటిది ఈ విశ్వ క్రీడల్లో రెండుసార్లు హ్యాట్రిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ సాధించి సత్తా చాటింది భారత జట్టు. వామ్మో ఇదేం ఆటరా నాయనా అని ప్రత్యర్థి జట్లు షాకై చూస్తూ నిలబడిపోయేలా సాగింది ఆ ప్రదర్శన. బ్రిటీష్ పాలనలో భారత సైన్యంలో ప్రవేశపెట్టిన హాకీ... మన దేశ క్రీడా ప్రతిభను విశ్వ వేదికపై చాటిచెప్పే అవకాశం ఇచ్చింది. ఒలింపిక్స్‌లో భారత్‌ ఒకసారి కాదు రెండుసార్లు హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించింది. 1925లో భారత హాకీ సమాఖ్యను ఏర్పాటు చేయగా.. ఇండియా తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ను 1926లో న్యూజిలాండ్‌తో ఆడింది. అప్పుడు భారత హాకీ పురుషుల జట్టు... న్యూజిలాండ్‌తో 21 మ్యాచ్‌లు ఆడి 18 మ్యాచ్‌లు గెలిచింది. ఈ టోర్నమెంట్‌లోనే మేజర్‌ ధ్యాన్‌చంద్‌(Major Dhyan Chand )వెలుగులోకి వచ్చాడు. ఇక  అప్పటినుంచే భారత్  ప్రారంభమైంది.

 

ఒలింపిక్స్‌లో స్వర్ణ చరిత్ర

భారత హాకీ జట్టు 1928లో మొదటి ఒలింపిక్స్‌ గేమ్స్‌లో పాల్గొంది. అప్పుడు ప్రారంభమైన భారత జైత్రయాత్ర కొన్ని దశాబ్దాల పాటు నిరాటంకంగా... నిర్విగ్నంగా కొనసాగింది. 1928లో మొదటి ప్రయత్నంలోనే ఇండియా.. ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్‌ను కైవసం చేసుకుని అబ్బురపరిచింది. ఆ ఒలింపిక్స్‌లో అయిదు మ్యాచులు ఆడిన భారత్‌ 29 గోల్స్ చేసిందంటే భారత జైత్రయాత్ర ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ 29 గోల్స్‌లో మేజర్ ధ్యాన్‌చంద్‌ 14 గోల్స్‌ చేశాడు. హాకీ మాంత్రికుడిగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ధ్యాన్‌చంద్‌ 1932, 1936 ఒలింపిక్స్‌లోనూ మరో రెండు బంగారు పతకాలను సాధించి... విశ్వక్రీడల్లో భారత్‌కు హ్యాట్రిక్‌ స్వర్ణాలను అందించాడు. 1936లో ధ్యాన్‌చంద్‌ కెప్టెన్సీలోనే భారత్‌ స్వర్ణం సాధించి ముచ్చటగా మూడోసారి స్వర్ణాన్ని ముద్దాడింది.

 

1948, 1952, 1956 ఒలింపిక్స్‌లోనూ వరుసగా బంగారు పతకాలు సాధించిన భారత్‌... రెండోసారి హాకీలో హ్యాట్రిక్‌ స్వర్ణాలు గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో పాకిస్థాన్‌పై పరాజయం పాలై రజత పతకంతో సరిపెట్టుకున్న ఇండియా... 1964 టోక్యో ఒలింపిక్స్‌లో మళ్లీ స్వర్ణాన్ని కైవసం చేసుకుని సత్తా చాటింది. 1968లో కాంస్యం గెలిచిన భారత్‌... 1972 మ్యూనిచ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లోనూ మరో కాంస్యం సాధించింది. 1980లో మరోసారి బంగారు పతకం గెలుచుకుని ఒలింపిక్స్‌లో ఎనిమిది స్వర్ణాలు గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం 8 స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో 12 పతకాలు సాధించింది. 2020 టోక్యో  ఒలింపిక్స్‌లో, పురుషుల హాకీ జట్టు జర్మనీపై థ్రిల్లింగ్ విజయం సాధించి కాంస్య పతకం గెలుచుకుంది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న టీమిండియా...ఈసారి ఒలింపిక్ పతకంపై కన్నేసింది.