భారతీయ కుటుంబ వ్యవస్థలో కులదైవ ఆరాధన ఎంతో విశిష్టమైంది. అయితే ఈ రోజుల్లో చాలామందికి తమ కులదైవానికి సంబంధించిన సమాచారం కూడా ఉండడం లేదు. చాలా మందికి ఇంటి దేవతలుగా గ్రామ దేవతల వంటి వారే ఉంటారు. కొద్ది మందికి మాత్రం పురాణ దేవతలు కూడా కులదైవాలుగా ఉంటారు. కొందరికి దక్షిణామూర్తి, మరికొందరికి హయగ్రీవుడు కులదైవాలుగా ఉంటే మరి కొందరికి నరసింహస్వామి, వేంకటేశ్వరుడు, శ్రీరాముడు, పాండురంగడు ఇంటి దేవుళ్లు గా ఉంటారు. గృహంలో జరిగే ఏ శుభకార్యంలోనైనా గృహస్థులు ఈ దేవతలకు ప్రాధాన్యతను ఇచ్చి మొదట పూజించి తర్వాత ఇతర కార్యక్రమాలు జరుపుకోవడం ఆనవాయితీగా ఉంటుంది.
శుభకార్యాలు చేయాలంటే వినాయకుడి వంటి కులదేవత పూజ తప్పనిసరిగా చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల కుటుంబం సురక్షితంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ శాంతులు నిలిచి ఉండాలని పూర్వీకుల నుంచి కూడా కులదేవతారాధన చేస్తూ వచ్చారు. కుల దైవం కుటుంబాన్ని కాపాడుతుంది. అన్న రకాల అననుకూల శక్తుల నుంచి కుటుంబాన్ని రక్షిస్తుంది.
కులదైవాన్ని మరిస్తే...
కులదైవాన్ని మరిస్తే కుటుంబం చుట్టూ ఆవరించి ఉన్న దైవ శక్తి రక్షణ చక్రం కనుమరుగవుతుంది. దీని కారణంగా ప్రమాదాలు, ప్రతికూల శక్తుల విజృంబణ, అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. రకరకాల అడ్డంకులతో కుటుంబ పురోగతి కుంటుపడుతుంది. కుటుంబంలో సంస్కారం క్షీణించడం, అనైతికత, అసమ్మతి, అశాంతి చెలరేగుతాయి. గ్రహచారం బాగున్నా కుటుంబంలో సంక్షేమం ఉండదు.
కులదైవారాధన తప్పని సరి
కులదైవానికి సముచిత స్థానం ఇవ్వక పోయినా, సరైన గౌరవం దక్కకపోయినా, సరైన రీతిలో ఆరాధించకపోయినా వారి శక్తి నశించి కుటుంబం కుంటుపడుతుంది. అలా జరిగితే మీరు ఏదేవతారాధన చేసినా కూడా అది వారికి చేరదు. బయటి నుంచి వచ్చే దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు చాలా సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తాయి.
ప్రతి సంవత్సరం చెయ్యాలి
ప్రతి కుంటుంబానికి వారి కుల దైవానికి సంబంధించిన ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది. ఆ ఆచారాన్ని అనుసరించి ఏడాదిలో ఒకసారి లేదా రెండు సార్లు ప్రత్యేకమైన రోజులలో కులదైవారాధాన ప్రత్యేకంగా చేస్తారు. ఇది కాకుండా శుభకార్యాల సమయంలో తప్పకుండా కుల దైవారాధన చేసుకోవాల్సి ఉంటుంది.
కులదేవతరాధన వల్ల కలిగే లాభాలు
- కులదేవతను విస్మరిస్తే జన్మ జాతకాల్లో దోషాలు ఏర్పడుతాయి. మంచి గ్రహ రాశులు కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. కాబట్టి గ్రహల అనుకూలత కోసం తప్పనిసరిగా కుల దేవతారాధన చేసుకోవాలి.
- ఏ దేవతారాధన చేసిన కులదైవాన్ని విస్మరిస్తే ఆ పూజ ఫలించదు. తల్లిదండ్రులను, కుల దైవాన్ని పూజించి వారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. వారి ఆశీర్వాదం లేకుండా ఇంకెలాంటి ఆశీర్వాదం లభించదు.
- కులదేవతారాధన విస్మరించిన కుటుంబంలో నిరంతరం ఏదో ఒకరకమైన కలతలు వేధిస్తూ ఉంటాయి.
- పరిసరాల్లో ఉండే వ్యక్తులతో కూడా అనవసరపు స్పర్థలు ఏర్పడుతాయి.
- పిల్లలతో, తల్లిదండ్రులకు సరైన సయోధ్య లేక నిరంతరం ఇంట్లో వేదనా భరిత వాతావరణం ఉంటుంది.
- ఏదో ఒక కారణంతో భార్యాభర్తల మధ్య విబేధాలు చేలరేగి వారి మధ్య ఆనందం లేకుండా పోతుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
Also read : ఇన్ని రకాల చందనాలున్నాయా - ఏ దేవుడికి ఏ చందనం ప్రీతి!