ఎర్ర చందనం, పచ్చ చందనం, తెల్లచందనం, హరిచందనం, గోపి చందనం ఇలా రకరకాల పేర్లతో రకరకాల చందనాలను పూజలో ఉపయోగిస్తారు. గంధం లేని పూజ పూర్తికాదు. శ్రీ మహావిష్ణువుకి చందనాన్ని తిలకంగా అలంకరిస్తారు..ఇంకా ఆయా చందనాల మాలలని జపానికి వినియోగిస్తారు.
తెల్ల చందనం
తెల్లని చందన మాల ధరించడం వల్ల శ్రీమహా విష్ణువు అనుగ్రహం దొరుకుతుందని, సాధనలో ఉన్నవారికి ప్రశాంతత, సంతోషం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. గంధపు మాల ధరించడం మాత్రమే కాదు తెల్లగంధం తిలకం కూడా శుభప్రదమే. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, శివారాధనలో చందన తిలకం సమర్పించిన తర్వాత ప్రసాదంగా నుదుటన ధరించడం వల్ల సకల పాపాలు నశించి పుణ్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. నుదుటి మీద ఉంచిన తిలకం అన్ని విపత్తులను నివారిస్తుంది. ఆనందానికి, అదృష్టానికి కారకంగా మారుతుంది. మహా సరస్వతి, మహా లక్ష్మీ మంత్రం, గాయత్రి మంత్ర సాధన గంధ మాలతో చెయ్యడం ద్వారా విశేష ఫలితాలను సాధించవచ్చని శాస్త్రం చెబుతోంది.
Also Read: అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత శ్మశానం నుంచి వచ్చేస్తూ వెనక్కి తిరిగిచూస్తే!
ఎర్ర చందనం
శక్తి పూజలో ఎర్రచందనం కలపముక్క ను ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఎర్రచందన మాలతో దుర్గాదేవి మంత్ర జపం చేస్తే ఆమె కోరుకున్న వరాలను తప్పక తీరుస్తుందట. అంతేకాదు ఈ పూజ ద్వారా అంగారకుడికి చెందిన మంగళ దోషం కూడా తొలగిపోతుందని నమ్మకం. ప్రతి రోజూ ఉదయం రాగిపాత్రలో నీరు తీసుకుని, అందులో ఎర్రచందనం, ఎర్రని పువ్వులు, బియ్యం వేసి భక్తి శ్రద్ధలతో సూర్య మంత్రాన్ని జపిస్తూ, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ అర్ఘ్య దానంతో సూర్యుడి కరుణ పొందవచ్చు. సూర్యుడి కటాక్షం ఉంటే ఆయుష్షు, ఆరోగ్యం, సంపద, పుత్రులు, స్నేహితులు, కీర్తి ప్రతిష్టలు, అదృష్టం, వైభవం లభిస్తాయి.
గోపీ చందనం
గోపి చందనం కృష్ణుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది. స్కంద పురాణంలో దీని ప్రస్థావన ఉంది. ముందుగా శ్రీకృష్ణుడికి సమర్పించిన గోపి చందనాన్ని భక్తులు నుదుట తిలకంగా ధరిస్తారు. ఇలా గోపీ చందనం తిలకంగా ధరించిన వారికి సకల తీర్థ స్థానాలలో దాన ధర్మాలు చేసి, ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది. ప్రతి రోజు గోపీ చందన తిలక ధారణ చేసిన వాడు పాపాత్ముడైనా కృష్ణ సాన్నిధ్యాన్ని చేరుకుంటాడని నమ్మకం.
హరిచందనం
హరి చందనం విష్ణువు కు పీతి పాత్రమైంది. హరి చందనాన్ని విష్ణుమూర్తికి సమర్పించిన తర్వాత దాన్ని ధరించాలి. హరిచందనం ధరించడం ద్వారా మన: శరీరాలు ప్రశాంతంగా ఉంటాయి. దీనితో వ్యక్తి ప్రతి రంగంలో విజయంతో పాటు కీర్తి ప్రతిష్టలను సాధిస్తారు. హరి చందనం తులసి మొక్క కొమ్మలు, వేరు నుంచి తయారు చేస్తారు. దీనిని ధరించడం వల్ల దు:ఖాలు, అనారోగ్యాలు తొలగి విష్ణు మూర్తి అనుగ్రహం దొరకుతుంది.
Also Read: మే 17 రాశిఫలాలు, ఈ రాశివారిని అనుకోని సమస్యలు చుట్టుముడతాయి!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.