హిందూ సంప్రదాయంలో పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి. సుమంగళిగా ఉండే ప్రతి స్త్రీ పసుపు తాళికి రాసుకుని కుంకుమ ముఖాన ధరిస్తుంది. వీటికి చాలా పవిత్రత, ప్రాధాన్యత ఉంటాయి. నుదుటిన బొట్టుగానే కాదు, పాపిట్లో సింధూరం ధరించే ఆచారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. వివాహ సమయంలో వరుడు వధువు పాపిటలో సింధూరాన్ని అలంకరిస్తాడు. అప్పటి నుంచి జీవిత పర్యంతం భర్త జీవించి ఉన్నంత కాలం తప్పనిసరిగా పాపిట్లో సింధూరం ధరిస్తారు హిందూ స్త్రీలు. షోడస సింగారాల్లో సిందూరం కూడా ఒకటి.  అంటే స్త్రీలు చేసుకునే పదహారు రకాల అలంకారాలలో సింధూర ధారణ ప్రధానమైనది. ఇది భర్త ఆయురారోగ్యాలను కాంక్షిస్తూ స్త్రీలు పాటించే ఒక ఆచారం.


రామాయణంలో సీతా దేవి కూడా రాముడి క్షేమం కోసం పాపిట్లో సిందూరం ధరించేది. పాపిట్లో సింధూరం ధరించి దాని మీద పాపిట బిళ్ల ధరించేదట సీతా దేవి. ఈ పాపిట బిల్లనే చూడామణి అని అంటారు. ఆంజనేయ స్వామి సీతాదేవిని ఎందుకు తల్లి పాపిట్లో సింధూరం ధరిస్తావు అని అడిగితే స్వామికి సింధూరం చాలా ఇష్టమని అది ధరించినందు వల్ల తనవైపు ప్రేమగా చూస్తారని, అంతేకాదు ఆయన్ని ప్రేమించే తాను అలా సింధూరం ధరించడం ఆయన ఆయుష్షును పెంచుతుందని చెప్పిందట.  అందుకే ఆంజనేయ స్వామి తాను కూడా రాముడిని అమితంగా ప్రేమిస్తాడు కనుక ఒళ్లంతా సిందూరం ధరించడం మొదలు పెట్టాడని, అతడి ప్రేమకు ముగ్ధుడైన  రాముడు ఆంజేయుడిని కరుణించాడని పురాణ కథ. పుక్కిటి పురాణ కథలు మాత్రమే కాదు,  కేవలం భర్త ఆయురారోగ్యాలు పెరుగుతాయన్న నమ్మకాలు మాత్రమే కాదు దీని వెనుక అనేక శాస్త్రీయ కోణులు, ప్రయోజనాలు కూడా ఉన్నాయట.


సింధూరంలోని శాస్త్రీయ  కారణాలు


సింధూరం ధరించే భాగం చాలా సున్నితమైంది. ఈ భాగాన్ని బ్రహ్మరంధ్రంగా చెబుతారు. సింధూరంలో పాదరసం ఉంటుంది. ఇది ఔషధగుణాలు కలిగి ఉంటుంది. ఈ పాదరసం స్త్రీల బ్లడ్ ప్రెషర్ ను అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. కనుక మహిళలు ఒత్తిడి లేకుండా ఉండొచ్చు. నిద్రలేమి సమస్య కూడా సింధూర ధారణ వల్ల రాదు. పసుపు, నిమ్మ, సీసంతో పాటు మరికొన్ని ధాతువులను ఉపయోగించే చేసే సింధూరం లేదా కుంకుమకు ఔషధ గుణాలు ఉంటాయి. కనుక స్త్రీలలో సాంతాన సాఫల్య సమస్యలు రాకుండా కూడా నివారిస్తుంది కుంకుమ ధారణ. అందుకే దీనిని పిట్యూటరీ గ్రంథికి దగ్గరగా పెట్టుకోవాలని ఆయుర్వేదం చెబుతుంది. ఉత్తర భారత దేశంలోని చాలా సంస్కృతుల్లో ఆజ్ఞా చక్రం నుంచి పాపిట నడుమ ఉండే సహస్రారం వరకు కూడా కుంకుమ లేదా సింధూరాన్ని ధరిస్తారు.


వివాహి స్త్రీలే ఎందుకు?


ఇంటికి వచ్చిన పుణ్య స్త్రీకి కుంకుమ అందించడం అనేది ఒక గౌరవ సూచకంగా భావిస్తారు. దక్షిణ భారతంలో ప్రత్యేక రోజుల్లో పసుపు కుంకుమలను వాయినాలుగా పంచుకునే సంప్రదాయం ఉంది. వివాహిత మహిళలే ఎందుకు పాపిట్లో సింధూరం ధరించాలనే ప్రశ్న కచ్చితంగా వస్తుంది. సింధూరం ధరించడం ప్రయోజనకరమే. కానీ అవివాహితులు, వితంతువులు సింధూరాన్ని పాపిట్లో ధరించకూడదు. ఎందుకంటే పాపిట్లో సింధూరం ధరించడం వల్ల లైంగిక వాంఛలు పెరుగుతాయి. ఇది వితంతువులకు, కన్యలకు అంత మంచిది కాదు. అందుకే వివాహం జరిగే వరకు పాపిట్లో సింధూరం ధరించకూడదని శాస్త్రం చెబతోంది. అవివాహితులకు, వితంతువులకు సింధూరం అందుకే నిశిద్ధం.


Also Read: ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు