రామ్, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం విడుదల తేదీని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ‘ది వారియర్’ తర్వాత రామ్, ‘అఖండ’ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి.


తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. యూట్యూబ్ హిందీ డబ్బింగ్‌ల ద్వారా రామ్ ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక ‘అఖండ’ దేశవ్యాప్తంగా ఎంత సౌండ్ చేసిందో అందరికీ తెలిసిందే. బోయపాటి గత సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లు కూడా వందల మిలియన్ల వ్యూస్ సంపాదించాయి. దీంతో సరిగ్గా ప్రమోషన్లు చేస్తే హిందీ మార్కెట్లో ఈ సినిమా మంచి నంబర్లతో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.


అయితే తమిళంలో మాత్రం ఈ సినిమా ఏమాత్రం ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి. ఎందుకంటే తమిళ దర్శకుడు లింగుస్వామితో రామ్ ‘ది వారియర్’ సినిమా చేసి అక్కడి ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అయితే అక్టోబర్ 19వ తేదీన తమిళంలో విజయ్, లోకేష్ కనగరాజ్‌ల మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘లియో (LEO)’ విడుదల కానుంది. విజయ్‌కు ఇక్కడ మార్కెట్ పెరిగింది. లోకేష్ కనగరాజ్‌కు తెలుగులో కూడా స్టార్ డైరెక్టర్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ సినిమా తెలుగులో కూడా రామ్, బోయపాటిల సినిమాకు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది.


ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ యాక్షన్ చిత్రంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. రామ్, శ్రీలీల జంట సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.


బోయపాటి శ్రీను సినిమా అంటే అందులో హీరో క్యారెక్టర్ ఎంత మాస్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాక్షన్స్ సీన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఈ సినిమాను కూడా బోయపాటి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా చాలా జాగ్రత్తగా షూటింగ్ చేస్తున్నాడట. ఇందులో హీరో రామ్ కూడా పక్కా మాస్ గెటప్ లో కనిపించనున్నాడని టాక్. ప్రస్తుతానికి బోయపాటి శ్రీను మంచి ఫామ్ లో ఉన్నాడు. గతేడాది నందమూరి బాలకృష్ణ హీరోగా ‘అఖండ’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత రామ్ పోతినేని తో ఓ పవర్ ఫుల్ సినిమాను పట్టాలెక్కించాడు బోయపాటి. ఈ సినిమా కోసం అత్యంత నైపుణ్యం గల సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారట. 


ఇక హీరో రామ్ రీసెంట్ గా ‘వారియర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో హీరో రామ్ ఆశలన్నీ బోయపాటి సినిమా మీదే పెట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది అనడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. దానికి తోడు ఆమె ఇటీవల నటించిన ‘ధమాకా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ అమ్మడి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. హీరోయిన్ గా ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.