Kanyadhan Hindu wedding: హిందూవివాహంలో కీలకమైన ఘట్టం కన్యాదానం. నిజానికి వివాహమంటేనే కన్యాదానం అని చెబుతుంటారు. కన్యాదానం కూడా ఒక రకమైన దానమే అయినా ఇది విభిన్నమైంది. దీనికి ఎంతో విశిష్టత ఉంది. సంతానార్థం, త్రిధర్మ రక్షణార్థం కన్యాదానం చేస్తారు. ఒక్కో యుగంలో ఒక్కో ధర్మానికి ప్రాముఖ్యతను ఇచ్చింది. క్రుత యుగంలో తపస్సుకు, త్రేతాయుగంలో జ్నానానికి, ద్వాపరయుగంలో యజ్నాలకు, కలియుగంలో దానానికి విశిష్ట స్థానం ఉంది. ఇది స్పష్టంగా పద్మపురాణంలో పేర్కొన్నారు. మొత్తం 16 రకాల దానాలు ఉన్నాయి. వాటిలో నాలుగు దానాలకు ఎంతో విశిష్టత ఉంది. అవి కన్యాదానం, గోదానం, భూదానం , విద్యాదానం. వీటిని చతుర్విధ ధానాలు అంటారు.


భూదానంలో భూమి మీదనో, గోదానంలో గోవు మీదనో అన్ని హక్కులనూ దానం పుచ్చుకునేవారికి ఇస్తారు. వారు వాటిని అనుభవించవచ్చు. ఇంకొకరికి ఇస్తారు. ఏమైనా చేసుకోవచ్చు. కన్యాదానం వాటికి చాలా భిన్నమైంది. వధువు సర్వబాధ్యతలను మరొకరికి బదిలీ  చేయడం కన్యాదానం ఉద్దేశం. ఇంత వరకు ఆమె పోషణ, రక్షణ, సంతోషం, ఓదార్పు, ప్రోత్సాహం అన్నీ తల్లిదండ్రుల బాధ్యతగా ఉంటాయి. 


కన్యాదానం లక్ష్యం ఒక్కటే. పుట్టింట్లో లభించిన ప్రేమానురాగాలు, రక్షణ, ఆత్మీయత, అప్యాయత అత్తింట్లోనూ నిరాటంకంగా లభించాలన్నదే కన్యాదానం ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఘట్టం అత్తవారింట్లో కలిసిపోవడానికి, సర్దుకుపోవడానికి మానసికంగా సిద్ధం చేస్తుంది. భరోసాను కల్పిస్తుంది. ధైర్య స్థైర్యాలను ఇస్తుంది. వరుని కాళ్లను కడిగి కన్యాదాత శచీదేవిని పూజించి కన్యాదానం చేస్తాడు. వధూవరుల మధ్య తెరను సుముహుర్తం వరకు అలానే ఉంచి కన్యాదానం చేస్తారు. నాకు బ్రహ్మలోకం సిద్ధించే నిమిత్తం సువర్ణ సంపన్నరాలైన ఈ కన్యను విష్ణుస్వరూపుడైన నీకు ఇస్తున్నాను అంటూ వధువు తండ్రి కన్యాదానం చేస్తాడు. 


ఈ కన్యను నా పితరులు తరించడానికి దానం చేస్తున్నాను. భగవంతుడు, పంచభూతాలు, సర్వదేవతలు సాక్షులగుదురుగాక. సాధుశీలమైన, అలంకరించిన ఈ కన్యను ధర్మ, కామార్థ సిద్ధి కలిగే నిమిత్తం మంచి శీలం కలిగిన బుద్ధిమంతుడైన నీకు దానం చేస్తున్నాను అంటూ కన్యాదానం చేస్తాడు. సాక్షాత్ విష్షు స్వరూపుడైన అల్లుడి పాదాలు కడిగి ఈ కన్యాదానం చేస్తాడు. ఈ సందర్భంగా వరుడి దగ్గరి నుంచి కొన్ని ప్రమాణాలు తీసుకుంటాడు. 


కన్యాదానం సమయంలో ఈ ఆచారాన్ని నిర్వహిస్తారు:


⦿ కన్యాదానం సంప్రదాయంలో ఒక్క ముఖ్యమైన ఘట్టం. ఈ ఘట్టం నిర్వహించేముందు ఉపవాసం ఉంటారు. కన్యాదానం చేసేంత వరకు తల్లిదండ్రులు ఉపవాసంతోనే ఉంటారు. 


⦿ వరుడి చేతితో వధువు చేతిని పెట్టి.. నా కూతురిని నీ చేతిలో పెడుతున్నా అంటూ తండ్రి చెబుతాడు. తన కుమార్తెకు జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవాలంటూ ప్రమాణం తీసుకుంటాడు. 


⦿ దీనిని అనుసరిస్తూ వధువు తల్లిదండ్రులు అరచేతిలో పవిత్ర జలాన్ని పోస్తుంటారు. నీరు ప్రవహించే విధానం వారి కుమార్తె చేతిలో నుంచి వరుడి చేతిలోకి పడేలా చేస్తుంది.


⦿ ఈ కన్యాదానం జరుగుతున్న సమయంలో దేవదేవతలను ప్రార్థిస్తుంటారు. పవిత్ర జలాన్ని జారవిరుస్తూ అరచేతులో పువ్వులు, పండ్లు, తమలపాకులు, ఇతర వస్తువులు పెడతారు. వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య కన్యాదానం చేస్తారు. 


Also Read: వటసావిత్రి వ్రతం విశిష్టత ఏంటి - మర్రిచెట్టుచుట్టూ సూత్రం ఎందుకు కట్టాలి!