Vat Savitri 2024 Date: కుటుంబ క్షేమం , సౌభాగ్యం , సంతాన ఆరోగ్యం కోసం హిందూ వివాహిత స్త్రీలు దైవారాధనలో మునిగితేలుతారు. విధిని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేంత భక్తి ప్రదర్శిస్తారు. ఇలా విధిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధించింది సావిత్రి. అలాగే తమ కుటుంబ పెద్ద వటవృక్షంలా అందరకీ నీడనివ్వాలని భవంతుడిని ప్రార్థిస్తూ వటవృక్షానికి ప్రత్యేక పూజలు చేస్తారు మహిళలు. ఈ ఏడాది జూన్ 6న వటసావిత్ర వ్రతం జరుపుకుంటున్నారు. జూన్ 05 బుధవారం రాత్రి 7 గంటల 15 నిముషాలకి చతుర్దశి తిథి పూర్తై అమావాస్య ఘడియలు మొదలయ్యాయి. జూన్ 06 గురువారం సాయంత్రం 5 గంటల 49 నిముషాల వరకూ ఉంది. వాస్తవానికి అమావాస్య తిథి రాత్రికి ఉండడమే ప్రధానం...అంటే అమావాస్య జూన్ 05 గురువారమే. కానీ వటసావిత్రి వ్రతం బ్రహ్మముహూర్తంలో చేస్తారు...బ్రహ్మమూర్తంలో అమావాస్య ఘడియలు జూన్ 6 గురువారం ఉన్నాయి. అందుకే గురువారం వటసావిత్రి వ్రతం జరుపుకుంటారు..


సౌబాగ్యం కోసం వటసావిత్రి వ్రతం


సత్యవంతుడి ప్రాణాలు తీసుకెళ్లిపోతున్న యమధర్మరాజు వెంటే వెళుతూ..పట్టుదలగా తన భర్త ప్రాణాలు తిరిగి తెచ్చుకున్న సావిత్రి పతిభక్తికి  నిదర్శంగా వటసావిత్రి వ్రతం జరుపుకుంటారు. మర్రిచెట్టును భక్తితో పూజించిన సావిత్రి..ఆ వ్రత ఫలితంతోనే యముడి వెంట నడిచింది... ఆమె ప్రయత్నాన్ని విరమింపచేసేందుకు యమధర్మరాజు ఎన్నో ప్రయత్నాలు చేసినా చివరకు సావిత్రి పతిభక్తి ముందు తలవంచకతప్పలేదు. సావిత్రి పాతివ్రత్యం ముందు తలొంచి సత్యవంతుడి ప్రాణాలు తిరిగి ఇచ్చేశాడు యముడు. అప్పటి నుంచి వివాహితులు తమ సౌభాగ్యం కోసం ఈ వ్రతం ఆచరించడం మొదలుపెట్టారు. 


Also Read: తిరుమల చుట్టుపక్కల చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలివే - మీరెన్ని దర్శించుకున్నారు!


వటసావిత్రి వ్రతం ఇలా చేయాలి


వివాహిత మహిళలు..వటసావిత్రి వ్రతం రోజు...మర్రిచెట్టును సింధూరంతో అలంకరించి నూలుదారం పోగులని చెట్టుచుట్టూ కడతారు. చెట్టు చుట్టూ దారం చుడుతూనే 108 ప్రదిక్షిణలు చేస్తూ నమో వైవశ్వతాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తారు. పసుపు,కుంకుమ, పూలు, గాజులు లాంటి సౌభాగ్యానికి నిదర్శమనమైన వస్తువులను చెట్టువద్ద ఉంచుతారు. హిందువులు మర్రిచెట్టును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. వటవృక్షం వేళ్లకు బ్రహ్మదేవుడు, కాండానికి శ్రీ మహావిష్ణువు, కొమ్మల భాగంలో పరమేశ్వరుడు నివాసం ఉంటారని చెబుతారు. త్రిమూర్తులను పూజిస్తూ...తన భర్త కూడా వటవృక్షంలా కుటుంబానికి అండగా ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని పూజిస్తారు. ఈ పూజ పూర్తిచేసిన తర్వాత సావిత్రి-సత్యవంతుడి కథ వినడం ద్వారా వ్రత ఫలితం దక్కుతుంది. ఈ రోజంతా ఉపవాసం ఉండి చీకటి పడిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. 


Also Read: గురువాయూర్ కి ఆ పేరెలా వచ్చింది - ఇక్కడ బాలగోపాలుడి విగ్రహం ప్రత్యేకత ఏంటో తెలుసా!


పూజలో భాగంగా ఈ శ్లోకం పఠించాలి
 బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం
సత్యవత్సావిత్రీ ప్రీత్యర్ధంచ
వట సావిత్రీ వ్రతం కరిష్యే


500 ఏళ్లుగా వటసావిత్రి వ్రతం


కేవలం సావిత్రి - సత్యవంతుడి కథ మినహా... వటసావిత్రి వ్రతం ఎప్పటి నుంచి మొదలైందో చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు కానీ ఐదు శతాబ్ధాలుగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారట.  నేపాల్  సహా మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో 500 ఏళ్లుగా ఈ వ్రత్రాన్ని ఆచరిస్తున్నారని చెబుతారు.  


Also Read: ప్రసవించే కప్పకు.. పాము పడగవిప్పి నీడనిచ్చిన ప్రదేశం - అందుకే అత్యంత పవిత్ర స్థలం!