Story of Frog and Snake in Sringeri: విభాణ్డక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం.  శృంగేరి కి దగ్గరగా ఉన్న శృంగ పర్వతం పేరు మీద దీనికి ఆ పేరు వచ్చిందంటారు. రోమపాదుడు పాలిస్తున్న ఈ రాజ్యంలో అడుగు పెట్టిన ఋష్యశృంగుడు ఆ రాజ్యాన్ని కరవు నుంచి విముక్తి కలిగించి...వర్షాలు కురిసేలా చేశాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో కరవు అనే మాట వినిపించలేదు. అదే సమయంలో ధర్మ ప్రచారం కోసం ఆదిశంకరాచార్యులు దేశాటన చేస్తూ తన శిష్యులతో కలసి ఇక్కడ అడుగుపెట్టారు. ఆ సమయంలో ప్రసవిస్తున్న ఓ కప్పకు  పాము తన పడగతో నీడ కల్పిస్తుంది. బద్ధ శత్రువులైన పాము, కప్ప మధ్య స్నేహం చిగురించిందంటే ఇదంతా ఆ ప్రదేశం గొప్పతమనే అని భావించారు. అందుకే తాను నిర్మించాలి అనుకున్న నాలుగు మఠాల్లో మొదటి మఠాన్ని ఏర్పాటు చేశారు. అదే శృంగేరి శారదా పీఠం. మఠాన్ని స్థాపించిన తర్వాత 12 ఏళ్ల పాటూ ఆదిశంకరాచార్యులు ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత పూరి , బదరీ, ద్వారకలో మరో మూడు మఠాలు స్థాపించారు. హిందూ సనాతన ధర్మాలను పరిరక్షిస్తూ ఈ పీఠాలు ప్రచారం చేస్తుంటాయి..


Also Read: మే 16 or 17 సీతానవమి ఎప్పుడు - విశిష్టత ఏంటి!
 
ఎన్నో అద్భుతాల నిలయం
శృంగేరి ఆలయ పరిసరాలు 20 వ శతాబ్దం వరకు చెక్కతో నిర్మించి ఉండేవి..అగ్నిప్రమాదం జరగడంతో పాత దేవాలయం స్థానంలో కొత్త దేవాలయాన్ని ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ దేవాలయంలో విద్యాశంకర స్వామి లింగాకారంలో దర్శనమిస్తారు. స్వామివారికి ఇరువైపులా వినాయకుడు, అమ్మవారు కొలువయ్యారు. మండపంలో స్తంభాలపై 12 రాశులు చెక్కి ఉంటాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన కిటికీల నుంచి సూర్యకిరణాలు..నెలల ప్రకారం ఆయా రాశులపై పడేలా ఏర్పాట్లు చేశారు. మరో విశేషం ఏంటంటే ఆలయంలో స్తంభాలపై ఉన్న గండ్రటి రాళ్లు గోళాకారంగా సింహం నోటి నుంచి బయటకు జారినట్టు చెక్కడం అద్భుతం అనిపిస్తుంది. తుంగ నదికి ఓ వైపు విద్యాశంకర దేవాలయం..దానిని అనుసంధానంగా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడున్న సూర్య నారాయణ స్వామి ఆలయం ధ్యానానికి చాలా అనువైనది. నరసింహ వనము అత్యంత ప్రత్యేకం. 20వ శతాబ్ధంలో ఈ ప్రదేశం మొత్తం దట్టమైన అడవిలా ఉండేది.. అప్పుడు జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవనృసింహభారతీ మహాస్వామివారు నిత్యం ఆ వనంలో ధ్యానం చేసేవారు. అలా అప్పటి మఠం ప్రధాన కార్యనిర్వహణాధికారి ఆ ప్రాంతంలో చిన్న కుటీరం నిర్మించి..జగద్గురువులు ఉండేందుకు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కాలక్రమంలో ఆ చిన్న నిర్మాణం విస్తరించి శ్రీసచ్చిదానంద విలాస్ పేరుతో జగద్గురువుల ఆశ్రమంగా పరిణామం చెందింది. ఆ పక్కనే గురునివాస్ అనే పూజాప్రాంగణం, వేదపాఠశాల ఉన్నాయి. 


Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!


పరమేశ్వరుడు ప్రసాదించిన స్పటిక లింగం


శృంగేరిలో శ్రీ శారదా పీఠాన్ని నెలకొల్పిన సమయంలో సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే శంకరాచార్యులవారికి స్పటిక లింగం ప్రసాదించారు. ఆ మహిమాన్విత లింగాన్ని నిత్యారాధన కోసం అక్కడే ఏర్పాటు చేశారు. వందల ఏళ్లుగా ఈ అపూర్వ శివలింగానికి నిత్యం రెండుసార్లు ప్రత్యేక అభిషేక ఆరాధనలు జరుగుతున్నాయి.  


శ్రీ శృంగేరి పీఠానికి 4 దిక్కులా నలుగురు రక్షకులు


తూర్పున - శ్రీ కాలభైరవ స్వామి ఆలయం
పశ్చిమాన- శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం
దక్షిణాన - శ్రీ దుర్గాంబ అమ్మవారి ఆలయం
ఉత్తరాన - శ్రీ కాళికాంబ అమ్మవారి ఆలయం 
మఠం ప్రాంగణానికి కొద్దిదూరంలో చిన్న కొండపై శ్రీ మలహానికారేశ్వర దేవాలయం వెలసింది.  కశ్యప మహర్షి కుమారుడైన విభాండక మహర్షి ఈ కొండపై తపస్సు చేసి జ్యోతి స్వరూపంతో శ్రీ మలహానికారేశ్వర లింగంలో ఐక్యం అయినట్టు ఆధారాలున్నాయి. 


Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!


గమనిక: కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం..దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...