ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఘోర పరాజయం మూట కట్టుకుంది. ఐదేళ్ల క్రితం 151 నియోజకవర్గాలలో విజయం సాధించి అధికారంలో వచ్చిన ఆ పార్టీ... ఇప్పుడు సింగిల్ డిజిట్ కంటే ఒక్క సీటు ఎక్కువకు పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశ నిస్పృహలలోకి నెట్టే అంశం. గత ఎన్నికలకు, ఇప్పటికీ ఏం మారింది? అంటే... ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పాలి. వైసీపీ పరాజయంలో ఆయన పాత్ర ఎంతో ప్రముఖమైనది.
వైసీపీ కేర్ చెయ్యలేదు కానీ పవన్ గట్టి దెబ్బ కొట్టాడు
పదవిలో ఉన్న ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను ఎప్పుడూ కేర్ చెయ్యలేదు. ఆయన్ను ప్రత్యర్థిగా పరిగణించలేదు. ఆయనది తమ స్థాయి కాదన్నట్టు వ్యవహరిస్తూ వచ్చింది. పైగా, పవన్ వ్యక్తిగత జీవితాన్ని పలు సందర్భాల్లో హేళన చేస్తూ వచ్చింది. తమకు, టీడీపీకి మధ్య ఆటలో అరటి పండులా తీసేసింది. అదృష్టం బాలేనప్పుడు అరటి పండు తిన్నా సరే పన్ను ఇరుగుతుందని ఓ సినిమాలో డైలాగ్ ఉంది. పన్ను విరగడం కాదు... ఫ్యానుకు ఎన్నికల్లో పవర్ షాక్ తగిలింది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినది చేతల్లో చూపించారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు. టీడీపీ, బీజేపీని ఒక్కటి చెయ్యడం కోసం తమ పార్టీ సీట్లు కొన్నిటిని త్యాగం చేశారు. వైసీపీకి గట్టి దెబ్బ కొట్టారు.
పవన్ రేంజ్ త్రివిక్రమ్ అప్పుడే చెప్పారు...
కానీ వైసీపీతో పాటు చాలా మందికి అర్థం కాలేదు!
పవన్ కళ్యాణ్ ఆప్త మిత్రుల్లో దర్శకుడు త్రివిక్రమ్ ఒకరు. సినిమా వేడుకల్లో పవన్ గురించి ఆయన గొప్పగా చెబుతుంటే స్నేహితుడు కనుక తప్పక చెబుతున్నారని సరిపెట్టుకున్నారు కొందరు. అతిగా పొగుడుతున్నారని ట్రోల్స్ చేసిన జనాలు సైతం ఉన్నారు. అయితే... పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటనేది త్రివిక్రమ్ కొన్నేళ్ల క్రితం జరిగిన 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పారు.
''చెయ్యి ఎత్తగానే జనం ఆగిపోయే శక్తి ఎక్కడో కోట్లలో ఒక్కడికి ఇస్తాడు దేవుడు. ఇటు వైపు వెళ్ళమని చెయ్యి చూపిస్తే అక్కడ ఏముందని కూడా ఆలోచించకుండా పరుగు పెట్టి వెళ్లేంత ప్రేమ, అభిమానం సంపాదించుకునే శక్తి ఎక్కడో కోట్లలో ఒక్కడికి ఇస్తాడు. అలాంటి కోట్లలో ఒక్కడు... పేరు మీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు'' అని 'కాటమరాయుడు' వేడుకలో త్రివిక్రమ్ చెప్పారు. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూస్తే అది నిజమని నమ్మక తప్పదు. ఎందుకంటే...
ఏపీలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఆ సమయంలో ఓటమి చవి చూశాయి. తదనంతర పరిణామాల నేపథ్యంలో రెండు పార్టీల శ్రేణులు కలవడం అసాధ్యమని వైసీపీ భావించింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాపు సామాజిక వర్గానికి మాత్రమే నాయకుడిగా ప్రాజెక్ట్ చేసే ప్రయత్నాలు చేసింది. ముద్రగడ వంటి నాయకులను తమ పార్టీలో చేర్చుకుని పవన్ మీద విమర్శలు చేయించాయి. తద్వారా కాపు ఓటు బ్యాంకు పూర్తిగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి వెళ్లకుండా చేయవచ్చని పథకం రచించింది. తెలుగుదేశం పార్టీ అధినేత కమ్మ సామాజిక వర్గం కనుక రెండు వర్గాలు ఏకం కాకుండా చూడాలని చూసింది వైసీపీ. అయితే... తనపై నమ్మకం పెట్టుకుని ఓటు వేయమని పవన్ చేసిన విజ్ఞప్తిని ప్రజలు గౌరవించారు. మరోవైపు టీడీపీ నేతల నుంచి సహకారం లభించింది.
'ఆర్ఆర్ఆర్'లో రెండు సామాజిక వర్గాలకు చెందిన హీరోలు కలిసి నటించినా సరే, తామిద్దరం స్నేహితులమని చెప్పినా సరే సోషల్ మీడియాలో అభిమానులు మధ్య మాటల యుద్ధం తప్పలేదు. ఎన్నికలు వచ్చేసరికి ఆ మనస్పర్థలు పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా కూటమికి ఓటు వేసేలా చేశారు పవన్ కళ్యాణ్. ఆయన చెయ్యి ఎత్తి చెప్పిన మాటలకు ప్రజలు విలువ ఇచ్చారు. ఆయన మీద అభిమానంతో ఓట్లు వేశారు. అప్పుడు త్రివిక్రమ్ చెబితే వైసీపీకి అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఘోరంగా బోల్తా కొట్టింది.
Also Read: జనసేనాని పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కంగ్రాట్స్ - ట్రోల్ చేస్తున్న మెగా & జనసేన ఫ్యాన్స్!