Pawan Kalyan Wins Pithapuram: పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. అదీ భారీ మెజారిటీతో! దాంతో మెగా అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. ఈ ఎన్నికల్లో పవన్ పార్టీ జనసేన (Janasena Party) నుంచి పోటీ చేసిన మెజార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం సాధించారు. ఏపీలో 21 స్థానాలకు గాను 21 స్థానాల్లో విజయఢంకా మోగించారు. గత ఎన్నికల్లో భారీ స్థాయిలో ఎమ్మెల్యే సీట్లు దక్కించుకున్న వైసీపీ ఈసారి జనసేన కంటే తక్కువ స్థానాలకు పరిమితం కావడం ఇతర రాష్ట్రాల ప్రజలను ఆశ్చర్యపరిచే విషయం. ప్రభుత్వం మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది చెప్పడానికి ఉదాహరణ ఇది. అదే సమయంలో మరొక హీరో మీద పవన్ అభిమానుల్లో వ్యతిరేకత సైతం చర్చకు వస్తోంది.


ఇప్పుడు పవన్ అభిమానుల్ని బన్నీ మచ్చిక చేసుకునేది ఎలా?
ఎన్నికలకు ముందు సంగతి... టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యాగ్జిమమ్ జనాలు పవన్ కళ్యాణ్, ఆయన జనసేన పార్టీకి మద్దతు పలుకుతున్న రోజులు. ఛోటా మోటా స్టార్స్ నుంచి మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ పిఠాపురానికి క్యూ కడుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం పవన్ విజయం సాధించాలని కోరుతూ ట్వీట్ చేశారు. కానీ, ప్రచార పర్వం చివరకు వచ్చేసరికి నంద్యాల వెళ్లారు.


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురం వెళ్లి బాబాయ్ (Pawan Kalyan)ను కలిశారు. ఆ రోజే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి (Silpa Ravi Chandra Kishore Reddy)కు మద్దతు తెలిపారు. ఒకవైపు వైసీపీ పతనం ప్రారంభమైందని, జగన్ మోహన్ రెడ్డి క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తానని పవన్ ప్రచారంలో నిప్పులు చెరుగుతుంటే... మరోవైపు అతని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మెగా ఫ్యామిలీ బంధువు బన్నీ మద్దతు పలకడాన్ని మెగా అభిమానులు, జన సైనికులు జీర్ణించుకోలేకపోయారు. అల్లు అర్జున్ మీద సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.


శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తనకు స్నేహితుడు అని, గత ఎన్నికల్లో అతని ఇంటికి వెళ్లాలని అనుకున్నా కుదరలేదని, ఈసారి వెళ్లాలని, పార్టీలకు అతీతంగా తన వాళ్లు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు అల్లు అర్జున్ ఇచ్చిన వివరణ మెగా అభిమానుల్లో ఆగ్రహ జ్వాలల్ని చల్లార్చలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం ఎంతో జరిగింది. చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ మీద శిల్ప రవి చేసిన విమర్శలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాయి. మెగా ఫ్యాన్స్ పాత వీడియోలను బయటకు తీసి వైరల్ చేశారు. పవన్ ఒక్కడినే అంటే అనుకోవచ్చు... చిరంజీవిని సైతం విమర్శించిన వ్యక్తికి బన్నీ మద్దతు ఇవ్వడం వాళ్లకు నచ్చలేదు. 


మెగా బ్రదర్ నాగబాబు ''మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మా వాడు అయినా పరాయివాడే. మాతో నిలబడే వాడు పరాయివాడు అయినా మావాడే...!'' అని ట్వీట్ చేసి, ఆ తర్వాత డిలీట్ చేసినా... బంధువుల్లో బన్నీ మీద ఎంత వ్యతిరేకత ఉందనేది అర్థం చేసుకోవచ్చు.


'పుష్ప 2'కు మెగా ఫ్యాన్స్‌ మద్దతు ఉంటుందా?
ఏపీలో తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. మరోవైపు అల్లు అర్జున్ మద్దతు ఇచ్చిన శిల్పా రవి ఓటమి చెందారు. దీన్నిబట్టి ప్రజల్లో వైసీపీ మీద వ్యతిరేకతను బన్నీ సరిగా అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యాడని ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు ఆఫ్ ది రికార్డ్ కామెంట్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు అతడు వేసిన రాంగ్ స్టెప్ కరెక్ట్ చేసుకోవడానికి భారీ మూల్యం చెల్లించక తప్పదనే విశ్లేషణలు వినబడుతున్నాయి.


Also Read: పవన్ కళ్యాణ్ ఓటమికి తల వంచలేదు... ఈ విజయం ఒక్క రోజులో వచ్చినది కాదు


ఏపీలో, ఆ మాటకు వస్తే తెలంగాణలో బలమైన అభిమాన గణం ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ అతి ముఖ్యమైన వ్యక్తి. ఇప్పుడు వాళ్ళందరూ 'పుష్ప 2'ను బాయ్ కాట్ చేస్తే బన్నీ పరిస్థితి ఏమిటి? అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. మెగా ఫ్యామిలీ నీడ నుంచి మెల్లగా బయటకు వచ్చి సొంతంగా ఎదగాలని అనుకున్న బన్నీ... ఆ ప్రయత్నాల్లో భాగంగా వేసిన అడుగు ఏకంగా కూర్చున్న చెట్టును నరుక్కున్నట్టు అయ్యిందని ఫిల్మ్ అనలిస్టులు కామెంట్ చేస్తున్నారు. 'పుష్ప 2' రిలీజ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో? వెయిట్ అండ్ వాచ్. పవన్ విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ హరీష్ శంకర్, నితిన్, సాయి ధరమ్ తేజ్ వంటి భక్తులు ట్వీట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Also Readపవన్ ఫ్యాన్స్ ముగింట ట్రెండ్స్ ఎంత - వాట్సాప్ స్టేటస్, ట్విట్టర్ వీడియో షేర్స్‌తో హల్‌ చల్