Best Thriller Movies On OTT: చిన్నపిల్లలను ఆత్మలు ఆవహించడం.. వారికి తెలియకుండానే వారు హత్యలు చేయడం.. ఈ కాన్సెప్ట్‌తో పలు సినిమాలు వచ్చాయి. హారర్ సినిమాల్లో చిన్నపిల్లలను లీడ్ రోల్స్‌లో తీసుకొని చేసిన సినిమాలు చాలావరకు సక్సెస్ అవుతాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి ‘ది ప్రాడిజీ’ (The Prodigy). కానీ ఈ జోనర్‌లో వచ్చిన మిగతా చిత్రాలకంటే ‘ది ప్రాడిజీ’ భిన్నమని చెప్పడానికి కారణం దీని కథ. ఇందులో ఊహించని ట్విస్టులు ఎక్కువగా ఉండకపోయినా.. కథను ముందే రివీల్ చేయకుండా చివరి వరకు ఈ సినిమాను ఆసక్తి నడిపించిన తీరే ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
కథ..
‘ది ప్రాడిజీ’ కథ ఊరికి దూరంగా ఉన్న ఒక ఇంట్లో ఓపెన్ అవుతుంది. తాళం వేసి ఉన్న ఆ ఇంటి డోర్‌ను బద్దలు కొట్టుకొని ఒక అమ్మాయి తప్పించుకొని పారిపోతుంటుంది. తనకు ఎదురుగా వచ్చిన కారును ఆపి తన చేయిను నరికేశారని ఏడుస్తుంది. తప్పించుకున్న ఆ అమ్మాయి చెప్పిన దాన్నిబట్టి ఆ సైకో కిల్లర్‌ను పట్టుకోవడానికి పోలీసులు వస్తారు. తప్పించుకోవాలని ప్రయత్నించినా పోలీసులు తనను కాల్చేస్తారు. చనిపోయిన సైకో కిల్లర్ చేతిలో ఆ అమ్మాయి చేయి ఉంటుంది. కట్ చేస్తే సైకో కిల్లర్ చనిపోయిన ఆ సమయానికే సారా బ్లూమ్ (టైలర్ షిల్లింగ్), జాన్ బ్లూమ్ (పీటర్ మూనే) అనే జంటకు ఒక బాబు పుడతాడు. ఆ బాబుకు మైల్స్ (డేవిడ్ కోహ్ల్‌స్మిత్) అని పేరు పెట్టుకుంటారు. మైల్స్ కళ్లు కూడా చనిపోయిన సైకో కిల్లర్ కళ్లులాగానే ఉంటాయి.
మైల్స్ చిన్నప్పుడే చాలా పెద్దవాడిలాగా ప్రవర్తిస్తుంటాడు. అతడికి చాలా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. అవి చూసి తన తల్లి సారా ఆశ్చర్యపోతుంది. ఒకరోజు రాత్రి లేచి చూసేసరికి మైల్స్.. తమకు తెలియని ఏదో భాషలో మాట్లాడుతుంటాడు. అది సారా రికార్డ్ చేస్తుంది. తరువాతి రోజు మైల్స్.. తన క్లాస్‌మేట్‌ను రాడ్‌తో కొడతాడు. అలా ఎందుకు చేశావని తన టీచర్ తనను అడుగుతుంది.
తాను అలా చేయకపోతే వేరే వ్యక్తి తనను కొడతాడని భయపడుతూ చెప్తాడు మైల్స్. దీంతో సారాను స్కూల్‌కు పిలిపిస్తుంది ఆ టీచర్. తను రికార్డ్ చేసిన టేప్‌ను టీచర్‌కు ఇస్తుంది సారా. అదేరోజు రాత్రి పడుకున్న మైల్స్ సడెన్‌గా లేచి తనలో ఎవరో ఉన్నారని చెప్పి బాధపడుతుంటాడు. మరోవైపు సారా ఇచ్చిన రికార్డింగ్‌ను విన్న ఆ టీచర్.. వెంటనే తనను ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లమంటుంది. ఆ సైకియాట్రిస్ట్ కూడా మైల్స్‌లో వేరే వ్యక్తి ఉన్నాడని చెప్తాడు. ముందుగా ఆ విషయాన్ని సారా నమ్మకపోయినా మెల్లగా నమ్మడం మొదలుపెడుతుంది.
మైల్స్ వల్లే జాన్‌కు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్‌లో పడుంటాడు. ఒకరోజు ఇంటి బేస్మెంట్‌లో తమ పెట్ డాగ్ చచ్చి పడుంటుంది. అది చూసిన సారా మైల్స్‌ను అడిగితే తనకు ఏం తెలియదని చెప్తాడు. దీంతో వేరే దారిలేక తనను ఆ సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్తుంది సారా. మైల్స్ లోపల ఉన్నవాడి పేరును కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు ఆ డాక్టర్. కానీ ఆ డాక్టర్‌ను బెదిరించి అసలు మైల్స్‌కు ఏం సమస్య లేదని.. తన తల్లికి చెప్పిస్తాడు. కానీ డాక్టర్‌తో మాట్లాడుతున్న సమయంలో సోఫాపై ఒక పేరును రాస్తాడు. ఆ పేరును సారాకు చెప్తాడు డాక్టర్. గూగుల్‌లో సెర్చ్ చేయగా సైకో కిల్లర్ గురించి తెలుస్తుంది. దీంతో తన కొడుకును ఆ సైకో కిల్లర్ నుండి కాపాడడానికి సారా ఏం చేస్తుంది అన్నది తెరపై చూడాల్సిన కథ.
అనుక్షణం ఆసక్తి..
‘ది ప్రాడిజీ’ కథ వినడానికి చాలా మామూలుగా అనిపించినా.. తెరపై చూస్తున్నంతసేపు మాత్రం తరువాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి క్రియేట్ అవుతుంది. గంటన్నర సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్‌తో ప్యాక్ చేశాడు దర్శకుడు నికోలస్ మ్యాక్‌కార్తి. చనిపోయిన సైకో కిల్లర్.. అప్పుడే పుట్టిన బాబులోకి రావడం అనేది కథలో ప్రేక్షకులకు కొత్తగా అనిపించే అంశం. ఇక ఈ హారర్, థ్రిల్లర్ అయిన ‘ది ప్రాడిజీ’.. అమెజాన్ ప్రైమ్‌లో రెంట్‌కు అందుబాటులో ఉంది.
Also Read: బొమ్మలో దెయ్యం ఉందని తెలిసీ ప్రేమగా చూసుకునే కేర్ టేకర్.. ఆమె ప్రియుడి రాకతో అంతా తార్‌మార్!