ఇంద్రియ లోలత వలన మనిషిలో ఆసక్తి కలుగుతుంది
ఆసక్తి కోరికలకు దారి తీస్తుంది
కోరికలు తీరనప్పుడు కోపం పుడుతుంది
కోపం వ్యామోహానికి బాటలు వేస్తుంది
స్మృతి నశిస్తే బుద్ధినాశం కల్గుతుంది
 బుద్ధినాశం వలన మానవ మనుగడ పతనమవుతుంది


అందుకే అహంకారం ధర్మనాశనానికి మూలమని గుర్తించాలి. అహం నశిస్తేనే ఇహం బోధపడుతుంది. ఇహమే దృశ్య ప్రపంచం. మాయను వదిలితే సత్యం బోధపడుతుంది. అందుకే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అహం నుంచి పుట్టాయని గుర్తించి అహాన్ని అంతం చేసుకోవాలి. మనో నైర్మల్యం ఆచార శుద్ధికి దారి తీస్తుంది. ఆచారశుద్ది ఆధ్యాత్మికబుద్ధికి, ఆనందస్థితికి మూలం. ఇందుకు నిదర్శనం నరనారాయణులు. వీరు సనాతన మహర్షులు, తపోనిధులు, ఆచారశీలతకు, ఆధ్యాత్మికనీతికి, ధార్మికరీతికి సాక్ష్యాలు. నిజానికి ఒకే ఒక్క వైష్ణవ తేజం నర నారాయణులు. ఒకప్పుడు వీరు సోదరులు, ఇంకొకప్పుడు మిత్రులు, మరొకప్పుడు గురుశిష్యులు.  "పరమాత్మ ఇందుగలడందు లేడను సందేహము వలదుశ్రీ హరి సర్వోపగతుడు. ఎందెందు వెదకూ చిన అందందే గలడు" అంటూ తండ్రికి చెప్పి, స్తంభం నుంచి నరసింహావతారమూర్తి ఆవిర్భావానికి ప్రహ్లాదుడు తెరదీశాడు. దుష్ట దానవుడైన హిరణ్యకశిపుని సంహరించాడు. అవతార లక్ష్యం నెరవేరింది కాని స్వామి భయంకరాకృతికి లోకాలు భయపడిపోయాయ్.  అప్పుడు సదాశివుడు శరభరూపంలో నరుడు - సింహాన్ని రెండుగా మార్చి నారసింహ రూపాన్ని చేశాడు. ఈ నరసింహములనే రెండు రూపాలే అనంతర జన్మలో నర నారాయణులుగ జన్మించారు.


Also Read: శివాలయంలో ఉండే నవగ్రహాలకే పవర్ ఎక్కువ ఉంటుందా
నరనారాయణుల పుట్టుక
బ్రహ్మ సృష్టికి సహకరించేందుకు కొందరు ప్రజాపతులు సహాయం చేస్తుంటారు. వీరిలో ఒకరు ధర్మ ప్రజాపతి. ఆ ధర్మ ప్రజాపతి తన సోదరుడు దక్ష ప్రజాపతి కుమార్తెను వివాహం చేసుకున్నాడు.  వీరి జన్మించిన కవల పిల్లలే నరుడు, నారాయణుడు. వీరిద్దరూ సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి అవతారమే అని పురాణాలు పేర్కొంటున్నాయి. నర నారాయణులు ఇద్దరూ హిమాలయాల సమీపంలో ఓ వనంలో తపస్సులో మునిగిపోయారు. ఆ వనమంతా రేగుచెట్లు ఉండడంతో వాటినే ఆహారంగా తీసుకుంటూ తపస్సు సాగించారు. రేగుపండుకి బదరీఫలం అన్న పేరు ఉంది కాబట్టి, ఇక్కడ తపస్సు ఆచరించిన నరనారాయణులకి బదరీనాథుడన్న పేరు స్థిరపడింది.


నరనారాయణుల ఘోర తపస్సు గురించి ఎన్నో కథలు



  • వారి తపస్సు తీవ్రతను లోకానికి తెలియచేసేందుకు ఒకసారి ఆ పరమేశ్వరుడు తన పాశుపతాస్త్రాన్ని వారి మీదకు సంధించాడట. కానీ నిర్వకల్ప సమాధిలో మునిగిపోయిన నరనారాయణులు ముందు ఆ అస్త్రం తలవంచక తప్పలేదు.

  • వారి తపస్సుని భగ్నం చేసేందుకు ఇంద్రుడు అప్సరసలను వారివద్దకు పంపాడు. కానీ ఆశ్చర్యం! నారాయణుడు తన తొడను తాకగానే వారిని మించిన అప్సరస, ఆయన నుంచి వెలువడింది. నారాయణుడి ఊరువు (తొడ) నుంచి వెలువడింది కాబట్టి ఆమెకు ఊర్వశి అన్న పేరు వచ్చింది.

  • మరో సందర్భంలో నరనారాయణులు సహస్రకచుడు అనే రాక్షసుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అయినా కూడా వారిద్దరిలో ఒకరు తపస్సు చేస్తుండగా మరొకరు వంతులవారిగా  యుద్ధాన్ని సాగించారు.


Also Read: శ్రీ వేంకటేశ్వరుడికి శనివారం అంటే ఎందుకు ఇష్టం
నరనారాయణుల క్షేత్రాల్లెన్నో ఉన్నాయి



  • మన దేశంలో నరనారాయణుల క్షేత్రాల్లో అత్యంత విశిష్టమైనది బదరీక్షేత్రం. ఈ క్షేత్రంలోనే నరనారాయణులు తపస్సు సాగించారనీ, ఇప్పటికీ నర, నారాయణ అనే పర్వతాల రూపంలో తపస్సు చేసుకుంటున్నారనీ చెబుతారు.

  • ఈ రెండు పర్వతాల నడుమ నుంచి అలకనంద నది ప్రవహిస్తూ ఉంటుంది. గంగానది భూమిమీదకు అవతరించినప్పుడు, ఈ భూమి ఆ గంగ తీవ్రతను తట్టుకోలేకపోయిందట. అందుకని గంగానదిలోని ఒక పాయ అలకనందగా మారిందని చెబుతారు.

  • నరనారాయణ క్షేత్రాలు కొన్నింటిలో వీరిద్దరూ ఒకే రూపంలో ఉంటే, మరికొన్ని క్షేత్రాల్లో వేర్వేరుగా దర్శనమిస్తారు. తర్వాతకాలంలో ఈ నరనారాయణులే కృష్ణార్జునులుగా జన్మించినట్లు భాగవత పురాణం పేర్కొంటోంది. మహాభారతంలో శ్రీకృష్ణుడే స్వయంగా తాను నారాయణుడిననీ, అర్జునుడే నరుడనీ చెబుతాడు.

  • ఇక ఉత్తరభారతంలో ‘స్వామినారాయణ’ పేరుతో మరో మహాపురుషుని కొలుస్తారు. పూర్వం దుర్వాసముని శాపం చేత నారాయణుడు, 18వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్ లో స్వామినారాయణుడిగా జన్మించారని వీరి విశ్వాసం. 


ఇంతటి ప్రశస్తి కలిగిన నరనారాయణలను పూజిస్తే అంతా శుభమే జరుగుతుందని విశ్వసిస్తారు. నరనారాయణుల ప్రతిమలు లేని పక్షంలో కృష్ణుడు, బదరీనాథుడు, విష్ణుమూర్తి, నరసింహస్వామి... వీరిలో ఎవరిని భర్తిశ్రద్ధలతో పూజించా నరనారాయణుల అనుగ్రహం లభించినట్టే.