చాలా మంది చనిపోయిన ఆత్మీయుల విలువైన వస్తువులు, వస్త్రాలు వాళ్ల జ్ఞాపకాలుగా దాచుకోవడం లేదా ధరించడం చేస్తుంటారు. ఇలా చెయ్యడం మంచిదేనా అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. కొంతమంది వాడుకోవచ్చని, కొంతమంది వాడొద్దని సలహాలు ఇస్తుంటారు. మరి దీని గురించి శాస్త్ర పురాణాలు ఏం చెబుతున్నాయో ఒకసారి చూద్దాం.


పుట్టిన ప్రతి ప్రాణి తన జీవిత యాత్ర ముగించుకుని మరణాన్నిఆశ్రయించడం అనేది నిత్య సత్యం. మరణించిన వ్యక్తి తాలూకు జ్ఞాపకాలు, అతడికి సంబంధించిన విషయాలు మాత్రమే మనతో ఉండేవి. చనిపోయిన వ్యక్తి వదిలి వెళ్లిన అతడి వ్యక్తిగత వస్తువులు ఉపయోగించాలా.. వద్దా అనే అనుమానాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అనుమానాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం.


నగలు


జనన మరణాల గురించి మరణానంతర విషయాల గురించి శాస్త్ర పురాణాలు కొన్ని విషయాలను వివరించింది. గరుఢ పురాణంలో మరణించిన వ్యక్తుల ఆభరణాలను ధరించవద్దని సూచించింది. మరణించిన వారి జ్ఞాపకాలుగా వాటిని భద్రపరుచుకోవచ్చు. కానీ వాటిని ధరించడం వల్ల మరణించిన వారి ఆత్మ.. నగలను ధరించిన వారిని ఆకర్షించవచ్చు. వారికి మాయామోహ బంధాల నుంచి విముక్తి దొరకడంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. మరణానికి ముందు.. వారే స్వయంగా మీకిచ్చిన ఆభరణాలను ధరించడం వల్ల ఇబ్బంది ఉండదు. లేదా మరణానంతరం ఆ నగలను కరిగించి కొత్త నగలుగా మార్చుకుని వేసుకోవడం వల్ల కూడా సమస్య ఉండదు.


వస్త్రాలు


చనిపోయిన వ్యక్తి దుస్తులు పొరపాటున కూడా ధరించవద్దని గరుఢ పురాణం హెచ్చరిస్తోంది. దుస్తులు వారి శరీరానికి అతిదగ్గరగా ఉండేవి కనుక చాలా త్వరగా వీటిని ఆత్మలు ఆకర్షిస్తాయట. దాని వల్ల మరణించిన వారి ఆత్మ త్వరగా ఈ లోకాన్ని వీడేందుకు ఆటంకాలు ఏర్పడుతాయి. ఇలా మరణించిన వారి దుస్తులు ధరిస్తే పితృదోషం బారిన పడవచ్చు. మరణించిన వ్యక్తులకు సన్నిహితులు ఈ దుస్తులు అసలు ధరించవద్దు. ఇతరులకు, తెలియని వ్యక్తులకు లేదా అవసరంలో ఉన్న వారికి ఈ దుస్తులను ఇవ్వవచ్చు. లేదా దానం చెయ్యవచ్చు.


ఇతర వస్తువులు 


గడియారాలు, చేతి కర్రల వంటి ఇతర వ్యక్తిగత వస్తువులను వారి జ్ఞాపకార్థం భద్ర పరచుకోవచ్చు. కానీ వాటిని ధరించవద్దు. భద్రపరచుకునే వీలు లేని వారు దానంగా ఎవరికైనా ఇచ్చెయ్యవచ్చు. గడియారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరణించిన వారి ఆత్మీయులు ధరించకూడదు. ఇది పితృదోషానికి కారణం కాగలదు. మరణించిన వ్యక్తి ఉపయోగించిన మంచాన్ని కూడా ఎవరికైనా దానం చెయ్యాలని చెబుతారు. వారి జాతకచక్రం ఇంట్లో ఉంటే దాన్ని కూడా కాల్చి ప్రవహించే నీటిలో కలిపెయ్యాలి. ఇలా చేస్తే మరణించిన వారి ఆత్మకు విముక్తి లభిస్తుంది.


Also Read : Baby Teeth: పసి పిల్లలకు ఈ నెలల్లో దంతాలు వస్తే అశుభం - ఎవరికి కీడు? ఏం జరుగుతుంది?





Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.