శ్రావణ మాసం శివారాధనకు ప్రత్యేకం. శ్రావణంలో పరమశివుడు పూర్తి సృష్టిని సంచలితం చేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సమయంలో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు. ఈ చాతుర్మాస్యం సందర్భంగా శ్రావణంలో శంకరుడికి విశేష పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో చేసే శివారాధనలో కొన్ని ప్రత్యేక పద్ధతులను పాటించాల్సి ఉంటుంది.


శివుడు అభిషేక ప్రియుడు. ఏ సందర్భంలో అయినా శివకటాక్షానికి అభిషేకం నిర్వహించడం చాలా మంచి పద్ధతి. అయితే శ్రావణ మాసంలో నిర్వహించే శివాభిషేకానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.


పూజా ఫలితం దొరకాలంటే


పూజ చేసే సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఆ పూజకు పూర్తి ఫలితం దక్కదని శాస్త్రం చెబుతోంది. శ్రావణ మాసంలో దేవాదిదేవుడు మహాదేవుని ఆరాధించడం వల్ల కోరికలు నెరవేరుతాయి.


శివలింగానికి అభిషేకం చేసే సమయంలో దక్షిణ లేదా తూర్పు ముఖంగా జలాభిషేకం చెయ్యకూడదు. శివలింగానికి అభిషేకం చేసుకునే సమయంలో ఉత్తరం వైపున మాత్రమే అభిషేకం చెయ్యాలి. పార్వతి దేవి శివుడికి ఎడమ భాగం అంటే ఉత్తర దిశ లో ఉంటుంది. కనుక అటువైపు నుంచి అభిషేకం జరిపించాలి.


నిలబడి అభిషేకం చెయ్యకూడదు


శివలింగానికి అభిషేకం చేసే సమయంలో నిలబడి నీళ్లు సమర్పించకూడదు. హాయిగా కూర్చుని మంత్రాలు జపిస్తూ అభిషేకం జరుపుకోవాలి. నిలబడి చేసే అభిషేకానికి ఫలితం దొరకదు.


రాగి పాత్ర


శివుడికి అభిషేకం చేసేందుకు ఎప్పుడైనా సరే రాగి పాత్రనే వినియోగించాలి. ఇనుము కలిగిన ఎటువంటి పాత్రను కూడా అభిషేకానికి వినియోగించకూడదు. శివాభిషేకానికి రాగి పాత్ర శ్రేష్టమైంది.


శంఖం వాడకూడదు


శివలింగానికి అభిషేకం చేసేందుకు ఎప్పుడూ కూడా శంఖాన్ని వాడకూడదు. శివపురాణంలోని శంఖచూడ్ అనే రాక్షసుడిని శంకరుడు సంహరించాడు. అతడి ఎముకలతోనే శంఖం ఏర్పడుతుందనే నమ్మకం ఉంది. అందువల్ల శివారాధనలో శంఖం నిశిద్ధం అని గుర్తుంచుకోవాలి. శివలింగాన్ని అభిషేకించే సమయంలో నీటి ధారకు అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఒకేసారిగా నీటితో అభిషేకించాలని గుర్తుంచుకోవాలి.


పండితులు చెబుతున్న దానిప్రకారం శివపురాణంలో శివారాధన గురించి వివరణాత్మక విశ్లేషణ ఉంది. సాయంత్రం శివలింగానికి జలాభిషేకం చెయ్యకూడదు. ఉదయం 5 గంటల నుంచి 11 మధ్య  జలాభిషేకానికి శుభప్రదమైన కాలం. జాలాభిషేకం చెయ్య దలచుకుంటే ఎలాంటి ఇతర పదార్థాలను అందులో కలుపకూడదు. కేవలం శుద్ధమైన నీటిని మాత్రమే అందుకు ఉపయోగించాలి.


శ్రావణ మాసంలో శివపూజా నియమాలు


శంకరుని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కనుక ఆయనను భోళా శంకరుడు, భక్తసులభుడు అంటారు. ఆయన అనుగ్రహం కోసం చిన్న చిన్న నియాలు పాటిస్తే చాలు



  • శ్రావణ సోమవారం ఉదయాన్నే నిద్ర లేచి స్నానంచేసి రుద్రాభిషేక పూజ ఇంట్లోకూడా చేసుకోవచ్చు. లేదా శివాలయంలోనూ చేసుకోవచ్చు.

  • బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, గంగా జలం లేదా పాలు అభిషేకానికి ఉపయోగించవచ్చు. పంచామృత అభిషేకం కూడా చేస్తారు.

  • తర్వాత నైవేద్యం సమర్పించి, హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి.

  • పూజ తర్వాత తప్పకుండా ప్రసాదం తీసుకోవాలి. అప్పుడే పూజపూర్తయినట్టు. 


Also read : దీప అమావాస్య రోజు ఇలా చేస్తే శ్రావణ లక్ష్మీ సంతోషంగా మీ ఇంట అడుగుపెడుతుంది


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial