ఆషాఢ అమావాస్య అనేది ఆషాఢ మాసం చివరి రోజు. తెల్లవారి నుంచి శ్రావణం మొదలవుతుంది. శ్రావణ మాసం లక్ష్మీ దేవికి ప్రీతి పాత్రమైన మాసం. శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ ఈ రోజున పండగ చేస్తారు. ఆ పండగ దీప అమావాస్య. అంతేకాదు పితృదేవతలను కూడా సంతృప్తి పరిచేందుకు ప్రత్యేక దీపం వెలిగిస్తారు. 


ఆషాడ అమావాస్యను దీప అమావాస్యగా పరిగణిస్తారు. ఈ రోజున ఇంట్లో ముగ్గులతో అలంకారం చేసి దీపాలు వెలిగిస్తారు. ఈ రోజు చేసే పూజలో పిండి దీపాన్ని భగవంతుడికి సమర్పిస్తారు. ఈ పండగను తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల్లో విశేషంగా చేస్తారు. మహారాష్ట్రలో గత అమావాస్యగా చేస్తారు. అంటే పితరులను తలచుకుని ఆరాధించుకునే అమావాస్య అని అర్థం. తమిళనాట ఆది అమావాస్యగా, గుజరాత్ లో దివాసోగా, కేరళలోని కర్కిడక వావు బలి,  ఉత్తర భారతదేశంలో హరియాలీ అమావస్,  కర్ణాటకలో భీమన అమావాస్య, ఒడిశాలో చితరగి అమావాస్యగా జరుపుకుంటారు. ఈ అమావాస్య నాడు పితృతర్పణలతో పాటు దాన ధర్మాలు కూడా చేస్తారు. ప్రతి అమావాస్యకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ ఆషాఢ అమావాస్య నాడు దీపం వెలిగించడం చాలా ముఖ్యం. ఈ రోజున సజ్జపిండి లేదా గోధుమ పిండితో చేసిన దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని దక్షిణం వైపు వెలిగించి పెట్టాలి. పితృదేవతలకు సమర్పించేందుకు ఈ దీపం వెలిగిస్తారు.


దీప అమావాస్య ఎప్పుడు?


పంచాంగం ప్రకారం ఈ ఏడాది జూలై 16వ తేదిన రాత్రి 10 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. జులై 17న అమావాస్య రోజు సూర్యోదయం జరుగుతుంది. కనుక జూల్ 17న దీప అమావాస్య జరుపుకోవాలి. జూలై 17న అర్థరాత్రి 12 గంటలకు అమావాస్య ముగుస్తుంది. ఈ ఆషాఢ అమావాస్య సోమవారం రోజున వస్తున్నందున ఇది సోమపతి అమావాస్య అవుతుంది. కనుక ఇది చాలా ప్రత్యేకమైన రోజు.


ఎలా జరుపుకోవాలి?


ఇంట్లోని దీపాలను శుభ్రం చేసి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి శుభ్రమైన వస్త్రం పరిచి దాని మీద దీపం ఉంచాలి.  దీపం నువ్వుల నూనె లేదా నెయ్యితో ఈ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపానికి నైవేద్యం, పూలు సమర్పించాలి. దీపావళి రోజున చేసినట్టుగానే ఇంటిని దీపాలతో అలంకరించాలి.


ఈ రోజున పితృదేవతలను తలచుకున్నా, గౌరీవ్రతం చేసుకున్నా, దీప పూజ చేసుకున్నా మంచి ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున పూర్వీకులను తలచుకుని పితృకర్మలు నిర్వహించి దానధర్మాలు చెయ్యడం వల్ల వారికి ఆత్మ శాంతి లభిస్తుందని కూడా నమ్మకం.


Also read : చీపురు విషయంలో ఈ నియమాలు పాటించకపోతే దరిద్రం తప్పదు


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial