ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడ‌వ‌‌ రోజు మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. పురాణాల ప్రకారం.. జలప్రళయం సంభవించినపుడు శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ శిశువుగా దర్శనమిస్తారు. అంటే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తానెప్పుడూ ముదుంటానని ఈ అలంకారం ద్వార తెలియజేస్తున్నారు. 


వటపత్రసాయి అలంకారం అనంతరం స్వామివారికి ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం నిర్వహించారు.  సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు.
         
Also Read: రాముడు మానవుడా - దేవుడా, ఆ రెండక్షరాలు ఎందుకంత పవర్ ఫుల్


వటపత్రశాయి అలంకారంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఊరేగింపులో భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ డా.రమణప్రసాద్, ఏఈఓ శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఆర్.ధనుంజయ పాల్గొన్నారు.


మరోవైపు ఏప్రిల్ 15వ తేదీన శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృతంగా ఏర్పాట్లు మొదలయ్యాయి. భక్తులందరికీ తలంబ్రాలు అందేలా టీటీడీ అదనపు ఈవో శ్రీ ఏవీ.ధర్మారెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కల్యాణం రోజు సాయంత్రం 5 గంటలకు ఆలయం నుంచి స్వామి, అమ్మవారు ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ భక్తులను ఆకట్టుకునేలా అన్నమయ్య సంకీర్తనలు, త్యాగరాజ సంకీర్తనలు, త‌మిళ‌నాడుకు చెందిన శ్రీ విఠ‌ల్‌దాస్ మ‌హ‌రాజ్ బృందం నామ‌ సంకీర్త‌నం నిర్వహించనున్నారు.


Also Read: అన్ని సమస్యలకు చెక్ పెట్టి విజయాన్నందిచే శ్లోకం ఇది


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివ‌రాలు


10-04-2022(ఆదివారం) ధ్వజారోహణం, శేషవాహనం


11-04-2022(సోమ‌వారం) వేణుగాన అలంకారం, హంస వాహనం


12-04-2022(మంగ‌ళ‌వారం) వటపత్రశాయి అలంకారం, సింహ వాహనం


13-04-2022(బుధ‌వారం) నవనీతకృష్ణ అలంకారం, హనుమత్సేవ‌


14-04-2022(గురువారం) మోహినీ అలంకారం, గరుడసేవ


15-04-2022(శుక్రవారం) శివధనుర్భంగాలంకారం, శ్రీ సీతారాముల కల్యాణం , గ‌జవాహనం.


16-04-2022(శ‌నివారం) రథోత్సవం


17-04-2022(ఆదివారం) కాళీయమర్ధన అలంకారం, అశ్వవాహనం


18-04-2022(సోమ‌వారం) చక్రస్నానం, ధ్వజావరోహణం(రా|| 7 గం||)


19-04-2022(మంగ‌ళ‌వారం) పుష్పయాగం(సా|| 6 గం||)


Also Read: రామాయణం చదివిన వారికి టెస్ట్, చదవని వారికి అవగాహన కోసం