Vijayawada Kanaka Durga Temple : శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వ హించేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో సెప్టెంబరు 26 నుంచి దసరా మహోత్సవాలు జరుగుతాయి. పది రోజులు శ్రీ అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తుంది. ఉత్సవాలు ప్రారంభ సూచికగా మొదటి రోజు తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తెల్లవారు జామున 3గంటలకు ప్రారంభమయ్యే స్నపనాభిషేకం కార్యక్రమాన్ని భక్తులెవరూ చూడలేరు. వేదపండితులు మాత్రమే అంతరాలయంలో అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహిస్తారు. దేవస్దానంలో స్థానాచార్యులు సహా వైదిక కమిటిలో అతి తక్కువ మంది మాత్రమే అమ్మవారి స్నపనాభిషేకంలో పాల్గొంటారు.
Also Read: శరన్నవరాత్రుల్లో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివి!
దాదాపు నాలుగు గంటల పాటు అతికొద్ది మంది అర్చకుల సమక్షంలో జరిగే ఈ అభిషేకాన్ని భక్తులకు చూసే అవకాశం లేనందున శ్ రీచక్రం పూజను ప్రత్యేకంగా నిర్వహిస్తారు.ఆదిశంకరాచార్యులు ఇక్కడ ప్రతిష్టించిన శ్రీ చక్రానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. శ్రీచక్రం పూజకు భక్తులు ముందుగానే టికెట్లు తీసుకోవాలి. సాధారణ రోజుల్లో శ్రీ చక్రం పూజా టికెట్ దొరుకుతుంది కానీ ముఖ్యమైన రోజుల్లో అంత సులువుకాదు. మూడు గంటలకుపైగా సాగే పూజలో..నేరుగా దుర్గమ్మ దగ్గర ఉన్నట్టు తన్మయత్వం చెందుతారు భక్తులు. అయితే శరన్నవరాత్రుల సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు కుంకుమ పూజ నిర్వహిస్తారు.కుంకుమ పూజలో కూడ శ్రీచక్రాన్ని అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఉంచి పూజిస్తారు.
Also Read: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం పొందుతారు!
స్నపనాభిషేకంతోనే ఉత్సవాలు ఆరంభం
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు వేకువ జామున అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం మొదటిరోజు స్వర్ణకవచాలతో దుర్గమ్మను దేదీప్యమానంగా అలంకరిస్తారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ దర్శన భాగ్యంతోనే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. అందుకే అమ్మ దర్శనంకోసం భక్తులు భారీగా బారులుతీరుతాయి. మరీ ముఖ్యంగా మూలా నక్షత్రం, దుర్గాష్టమి, శరన్నవమి, దశమి రోజు ఇంద్రకీలాద్రి భక్తజనంతో కళకళలాడిపోతుంది.
శ్రీ దుర్గా దేవి కవచం (Sri Durga Kavacham )
శృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదమ్ |
పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్ ||
అజ్ఞాత్వా కవచం దేవి దుర్గామన్త్రం చ యో జపేత్ |
న చాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్ ||
ఉమాదేవీ శిరః పాతు లలాటే శూలధారిణీ |
చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసినీ ||
సుగన్ధా నాసికం పాతు వదనం సర్వధారిణీ |
జిహ్వాం చ చణ్డికాదేవీ గ్రీవాం సౌభద్రికా తథా ||
అశోకవాసినీ చేతో ద్వౌ బాహూ వజ్రధారిణీ |
హృదయం లలితాదేవీ ఉదరం సింహవాహినీ ||
కటిం భగవతీ దేవీ ద్వావూరూ వింధ్యవాసినీ |
మహాబలా చ జంఘే ద్వే పాదౌ భూతలవాసినీ ||
ఏవం స్థితాఽసి దేవి త్వం త్రైలోక్యే రక్షణాత్మికా |
రక్ష మాం సర్వగాత్రేషు దుర్గే దేవి నమోఽస్తు తే ||