CM KCR : తెలంగాణలో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఆదివారం ఎన్టీఆర్ మైదానంలో ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ పాల్గొ్న్నారు. ఈ సభలో మాట్లాడిన ఆయన తెలంగాణ కోసం 58 ఏళ్ల పోరాటం చేశామన్నారు. గిరిజన రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఏడేళ్లు గడుస్తుందని, ఇప్పటికే కేంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రధాని మోదీకి చేతులు జోడించి అడుగుతున్నా గిరిజన రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతితో ఆమోదం తెలపాలని కోరారు. వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం  రిజర్వేషన్లు కల్పిస్తూ ఆదేశాలు ఇస్తామన్నారు. 


విభజన రాజకీయాలు 


"తెలంగాణలో విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడకు వచ్చి రాజకీయాలు చేస్తున్న అమిత్ షాను అడుగుతున్నా ఎందుకు గిరిజన రిజర్వేషన్ బిల్లును తొక్కిపెడుతున్నారు. ప్రధాని మోదీని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. మా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి పంపించండి. దానిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. రాజ్యాంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్లు పెంచకూడదని లేదు. తమిళనాడులో 50 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తున్నారు. తెలంగాణకు ఇచ్చేందుకు ఎందుకు చేతులు రావడంలేదు. చిల్లర రాజకీయాలు చేస్తున్న నేతలను అడుగుతున్నా వారికి ఎందుకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు. గిరిజనులు అక్కడక్కడా పోడు వ్యవసాయం చేస్తుంటారు. వారిని గుర్తించడానికి కమిటీలు ఏర్పాటుచేశాం. పోడు భూములు కోసం జీవో 140 విడుదల చేశాం. కమిటీలు అన్ని వివరాలు సేకరించి పంపిస్తే ఆదివాసీలకు పట్టాలు త్వరలోనే అందిస్తాం. వారికి రైతు బంధు కూడా అందిస్తామని ప్రకటిస్తున్నాను. త్వరలోనే గిరిజన బంధును అమలు చేస్తాం. భూమిలేని వారికి రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తాం. "- సీఎం కేసీఆర్ 


తండాలు గ్రామపంచాయతీలుగా 


కేంద్రం పేద ప్రజల ఉసురుపోసుకుంటుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. లక్షల కోట్లను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ఎన్ని కష్టాలు ఓర్చుకుని సాధించిన తెలంగాణను సమైక్యంగా ఉంచుకోవాలన్నారు. తెలంగాణలో తండాలను గ్రామ పంచాయతీలు చేశామని స్పష్టంచేశారు. తండాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కుమురం భీమ్‌, బంజారా భవన్‌ ఏర్పాటు చేసుకున్నామన్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీ, బంజారా భవన్‌లు వేదికలు కావాలని కోరారు. సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథంతో మేథోమధనం జరగాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా అన్ని గిరిజన తండాలకు మంచి నీటి సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గురుకులాల సంఖ్య పెంచుతున్నామని స్పష్టం చేశారు.  గిరిజనులు గౌరవంగా నిర్వహించుకునే పండులను అధికారంగా నిర్వహిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. 


గిరిజన బంధు 


"రాబోయే వారంలోనే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలుకు జీవో విడుదల చేస్తాం. ఆ జీవోను కేంద్రం అమలు చేస్తుందో లేదో చూస్తాం. గిరిజన గురుకులాలు పెంచుతాం. బాలికలు, బాలుర కోసం ప్రత్యేకంగా గిరిజన గురుకులాలు ఏర్పాటుచేస్తాం. ఎంతో కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందో మీరు చూస్తున్నారు. పోడు భూముల పంచిన తర్వాత భూములు లేని గిరిజనులకు రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తాం. త్వరలోనే ఆ పథకాన్ని ప్రారంభిస్తాం."- సీఎం కేసీఆర్     
 
 Also Read : CM KCR: అది తలచుకుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతయ్, ఆ పరిస్థితి మళ్లీ రావొద్దు - పొంచి ఉన్న ప్రమాదం: కేసీఆర్


Also Read : Amit Shah Speech: సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే హైదరాబాద్ విముక్తి , సమరయోధులందరికీ వందనం - కేంద్రమంత్రి అమిత్‌షా