Vijaya Ekadasi 2024 Vrat Katha : సనాతన ధర్మంలో 24 ఏకాదశుల గురించి ప్రస్తావన ఉంది. అధికమాసం వస్తే మరో రెండు ఏకాదశులు కలుపుకుని 26 వస్తాయి. తిథుల్లో ఏకాదశి ఎప్పుడూ శుభప్రదమే. మాఘమాసం కృష్ణ పక్షంలో ( శివరాత్రి ముందు) వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఈ ఏడాది మార్చి 6న వచ్చింది విజయ ఏకాదశి. సాధారణంగా ఏ ఏకాదశి రోజు అయినా ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. అయితే ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మార్చి 6 బుధవారం వచ్చిన ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే చేపట్టిన పనిలో విజయం తథ్యం అని చెబుతారు పండితులు...
విజయ ఏకాదశి తేదీ - తిథి
విజయ ఏకాదశి మార్చి 6, 2024 బుధవారం రాత్రి 12.11 వరకూ ఉంది తదుపరి ద్వాదశి... ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు విష్ణు పూజ అనంతరం ఉపవాసం విరమిస్తారు..
Also Read: పార్వతీ దేవికి నిజంగా సమాధానం తెలియకే శివుడిని ప్రశ్నించిందా!
విజయ ఏకాదశి వ్రత కథ
శ్రీ రామ చంద్రుడు ఆచరించిన విజయ ఏకాదశీ వ్రత కథని పఠించడం వలన ఏకాదశీ వ్రతమాచరించిన పుణ్యం లభిస్తుందంటారు. రావణుడి చెరలో ఉన్న సీతాదేవిని విడిపించేందుకు శ్రీరామచంద్రుడు లంకకు చేరుకునే సన్నాహాల్లో ఉన్నాడు. సముద్రాన్ని దాటి వానర సైన్యం లంకకు ఎలా చేరుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఆ సమయంలో లక్ష్మణుడు అక్కడ సమీపంలో నివశిస్తున్న బకదళాభ్యుడనే ఋషి వద్దకు వెళ్ళి సహాయం కొరదామని సలహా ఇస్తాడు. అందుకు అందరూ అంగీకరించి ఆ రుషి ఆశ్రమానికి వెళతారు. తన ఆశ్రమంలో అడుగుపెట్టిన శ్రీరామచంద్రుడిని చూసి సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే వచ్చాడని తెలుసుకున్నాడు బకదళాభ్యుడు. అయినప్పటికీ రావణుడిని జయించి విజయం సిద్ధించాలంటే విజయ ఏకాదశి రోజు ఉపవాస దీక్ష చేస్తే విజయం ప్రాప్తిస్తుందని తన బాధ్యతగా సూచన చేశాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు విజయ ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఆ తర్వాత సేతువు నిర్మించి వానరులతో సహా లంకకు చేరుకుని రావణుడిని జయించి సీతాదేవిని తిరిగి తీసుకొచ్చాడు. విజయ ఏకాదశి వ్రతం ఫలితం వల్లే విజయం సిద్ధించిందని చెబుతారు.
Also Read: శివనిందను భరించలేక సతీదేవి ప్రాణత్యాగం, అమ్మవారి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు ఇవే!
ఈ వ్రతం గొప్పతనం గురించి స్కాంద పురాణం, రామాయణంలో ప్రస్తావించారు. విజయ ఏకాదశి రోజు ఉపవాస నియమాలు పాటించినా లేకున్నా ఈ వ్రత కథ విన్నా, చదివినా కోరిన కోర్కెలు నెరవేరి సర్వ కార్యాల్లోనూ విజయం సాధిస్తారని పండితులు చెబుతారు. శ్రీరామచంద్రుడు ఆచరించిన ఈ వ్రతాన్ని ఆ తర్వాత కాలంలో చాలామంది మహారాజులు ఆచరించి యుద్ధంలో విజయం సాధించారు.
Also Read: 'ఏకబిల్వం శివార్పణం' - మారేడు దళాలు శివ పూజకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!
ఏకాదశి ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు...
దేహమే దేవాలయమని శాస్త్రం చెబుతుంది. మన మనసులోనే ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే... ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం లాంటి సాధనల ద్వారా ఆరాధించడమని అర్థం . పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు , మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన రాక్షసుడిని జయించి.. జ్ఞానాన్ని,ముక్తిని పొందాలంటే ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని చెబుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉపవాసం ద్వారా.... మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి, మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఏడవదైన సహస్రార చక్రంలో సహస్రకమలంలో పరమాత్మను దర్శించి బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలో ఐక్యం చేయడమే...
Also Read: మీ బంధుమిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో చెప్పేయండి!
ఏకాదశి రోజు 'ఓ నమో నారాయణాయ' అనే అష్టాక్షరి మంత్రం, 'విష్ణు సహస్రనామం' పఠించినా విన్నా సకల శుభాలు సిద్ధిస్తాయి....